వేగంగా జరుగుతున్న పులివెందుల ఆర్టీసీ బస్టాండ్, డిపోల నిర్మాణ పనులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా పులివెందులలో కొత్త ఆర్టీసీ బస్ స్టేషన్, డిపోల నిర్మాణ పనులు నిర్దేశిత ప్రణాళిక ప్రకారం వేగంగా సాగుతున్నాయని, నిర్ణీత కాలంలో వాటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ.. కరోనా సెకండ్ వేవ్‌తో పనులకు కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ ముందుగా ప్రకటించిన గడువులోగానే పూర్తి చేస్తామని తెలిపింది. కొత్త ఆర్టీసీ బస్ స్టేషన్, డిపోల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది డిసెంబర్ 24న శంకుస్థాపన చేయగా.. అన్ని పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొంది.
పనుల పురోగతి ఇలా..: టరూ.2.80 కోట్లతో ప్రహరీ నిర్మాణం, గ్రావెల్ లెవలింగ్ పనుల పూర్తికి గడువు తేదీ ఈ ఏడాది జులై 31. ఆ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. 1,100 మీటర్ల ప్రహరీకి గాను 900 మీటర్ల గోడ నిర్మాణం పూర్తయ్యింది. మిగతా 200 మీటర్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. ఇంతవరకు రూ.2.30 కోట్ల మేర పనులు పూర్తి చేశారు.
► రూ.9 కోట్లతో చేపట్టిన కొత్త బస్ డిపో భవనాల నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ 30 నాటికి పూర్తి చేయాలి. గ్యారేజీ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయ్యింది. మొదటి అంతస్తు గోడల నిర్మాణం జరుగుతోంది. ఆయిల్ రూమ్‌కు శ్లాబ్ వేశారు. మిగతా నిర్మాణాలు బేస్‌మెంట్ వరకు పూర్తి చేశారు. మొత్తం రూ.3 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు.
► రూ.22.40 కోట్లతో కొత్త బస్ స్టేషన్ నిర్మాణాన్ని 2022 సెప్టెంబరు 1నాటికి పూర్తి చేయాలి. మొత్తం 128 స్తంభాలకు గాను 108 స్తంభాల నిర్మాణం బేస్‌మెంట్ వరకు పూర్తయ్యింది. ఇంతవరకు రూ.2 కోట్ల విలువైన పనులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment