Covid-19 Third Wave: AP Night Curfew Lifted Due To Low Cases Reporting - Sakshi
Sakshi News home page

AP Night Curfew: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేత..

Published Mon, Feb 14 2022 6:32 PM | Last Updated on Tue, Feb 15 2022 5:28 AM

Night Curfew Lifted In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూను తొలగించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా మార్గదర్శకాలు కొనసాగిస్తూ దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఫీవర్‌ సర్వే కొనసాగించాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షల ప్రక్రియ కొనసాగాలని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగించాలన్నారు. కోవిడ్, వ్యాక్సినేషన్, వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ, గిరిజన ప్రాంతాల్లో వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలపై సీఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

ప్రత్యేక ప్రోత్సాహకాలపై మార్గదర్శకాలు
వైద్య ఆరోగ్య శాఖలో మిగిలిపోయిన నియామకాలను చేపట్టి ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఆస్పత్రుల్లో పరిపాలన, చికిత్స బాధ్యతలను వేరు చేసి నిపుణులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులు, వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. స్పెషలిస్టు వైద్యులకు మూలవేతనంలో 50 శాతం, వైద్యులకు 30 శాతం మేర ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌), ఎం.రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

అన్ని జిల్లాల్లో గణనీయంగా తగ్గుముఖం 
► రాష్ట్రంలో కోవిడ్‌ యాక్టివ్‌ కేసుల రేటు 0.82 శాతానికి తగ్గుముఖం.
► గత వారం సమావేశం నాటికి 1,00,622 పాజిటివ్‌ కేసులుండగా ఇప్పుడు 18,929కి తగ్గిన కేసులు.
► ఆస్పత్రిలో చేరిన కేసులు 794 కాగా ఐసీయూలో చేరి దాదాపుగా కోలుకుంటున్న 130 మంది.
► 746 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య చికిత్స.
► గత సమావేశం నాటికి పాజిటివిటీ రేటు 17.07 శాతం కాగా ప్రస్తుతం 3.29 శాతానికి క్షీణత
► 9,581 సచివాలయాల పరిధిలో కోవిడ్‌ కేసులు లేవు.

టీనేజర్లకు వంద శాతం తొలి డోసు 
► రాష్ట్రంలో 3,90,83,148 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌.
► తొలిడోసు పూర్తై రెండోది తీసుకోవాల్సిన వారు 39,04,927 
► మొత్తంగా వినియోగించిన డోసులు 8,32,55,831. n 45 ఏళ్లు పైబడ్డ వారిలో 96.7 శాతం మందికి రెండు డోసుల టీకాలు పూర్తి
► 18–44 వయసు వారిలో 90.07 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్లు.
► ప్రికాషన్‌ డోస్‌ల లక్ష్యం 15,02,841 కాగా 11,84,608 మంది టీకాలు. 
► 15 – 18 వయసు వారిలో వంద శాతం మేర 24.41 లక్షల మందికి మొదటి డోసు పూర్తి. 12.48 లక్షల మందికి రెండో డోసు పూర్తి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement