సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణానదిపై ఏపీ, తెలంగాణ మధ్య ఐకానిక్ ‘కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జి’ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని.. రూ.1,082.56 కోట్లతో 30 నెలల్లో దీన్ని పూరిచేస్తామని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించారు. ఈ తరహా బ్రిడ్జి ప్రపంచంలోనే రెండోదని, మనదేశంలో మొదటిది కానుందని తెలిపారు.
హైబ్రిడ్ నిర్మాణ విధానం వల్ల ఆర్థిక భారం తగ్గడంతోపాటు చూడటానికి అందంగా ఉంటుందని పేర్కొన్నారు. బ్రిడ్జి దిగువన పాదచారుల కోసం ప్రత్యేకంగా నిర్మించే గాజుమార్గం, పైలాన్ గోపురాలు, ప్రత్యేకమైన లైటింగ్, నల్లమల అడవులు, కొండలు, శ్రీశైలం రిజర్వాయర్ వంటివి ఆకర్షణీయంగా నిలవనున్నట్టు తెలిపారు. వంతెనకు తెలంగాణవైపు లలితా సోమేశ్వరస్వామి ఆల యం, ఏపీ వైపు సంగమేశ్వర ఆలయం ఉంటాయన్నారు.
పుట్టపర్తి–కోడూరు మధ్య 4 లేన్ల రోడ్డు
పుట్టపర్తి– కోడూరు మధ్య రెండు లేన్ల రోడ్డును నాలుగు లేన్లుగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు గడ్కరీ వెల్లడించారు. రెండేళ్లలో రూ.1,318.57 కోట్ల ఖర్చుతో 47.65 కిలోమీటర్ల రోడ్డు ఆధునీకరణను పూర్తి చేస్తామని.. దీనితో పుట్టపర్తి– బుక్కపట్నం మధ్య రవాణా సదుపాయం మెరుగవుతుందని తెలిపారు. పుట్టపర్తిలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రానికి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కూడా కనెక్టివిటీని పెంచుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment