
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రజలు ఓపిక ఉండి ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఎక్కువగా లాభ పడతారని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఇక్కడ జరిగిన రా.. కదిలిరా.. సభలో ఆయన మాట్లాడుతూ.. “టీడీపీ అధికారంలోకి వస్తే ఒక ఆడపిల్ల ఉంటే నెలకు రూ.1500, ఇద్దరు ఉంటే రూ.3000, ముగ్గురు ఉంటే రూ.4500 .. అలాగే ఒక్కో పిల్లవానికి చదువుకోసం ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అంత మొత్తం జమ చేస్తాం. ఎక్కువ మంది పిల్లలను కంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక అంతగా లాభపడతారు’ అని చెప్పడంతో సభలోని వారంతా ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయటం సరికాదన్నారు.
ఈ ప్రభుత్వం తప్పుడు సలహాలు ఇస్తున్న సలహాదారులకు ఇప్పటివరకు రూ.680 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. అన్న క్యాంటీన్లు మూత వేసిన ఈ సీఎం పేదల మనిషి ఎలా అవుతారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ అవినీతికి పాల్పడుతున్నారని, అభివృద్ధి చేయలేదని తెలిపారు. జనసేన టీడీపీ మధ్య వివాదాలు సృష్టించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. తాము అనేక రకాలుగా సర్వేలు చేయించి ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి 99 మంది అభ్యర్థులను ప్రకటించామన్నారు. ఈ రోజు నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి సైకిల్ ఎక్కాలని, కనబడిన ప్రతి చోటా తెలుగుదేశం పారీ్టకి ఓటు వేయటంపై చర్చించాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు ప్రసంగిస్తుండగానే ఖాళీ అయిన సభ
గంటపాటు సాగిన చంద్రబాబు ప్రసంగంలో చెప్పిందే చెబుతూ సాగదీయడంతో ప్రజలకు విసుగుపుట్టి ఆయన ప్రసంగం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. ఆయన ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రజలు లేచి వెళ్లిపోవడం ప్రారంభించారు. చివరికి వచ్చేసరికి సభా ప్రాంగణం ఖాళీ అయింది.
ఎన్టీఆర్ కు బదులు ఎర్రన్న స్మరణ
తెలుగుదేశం పార్టీ ఎక్కడ సభ నిర్వహించినా ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం పరిపాటి. కానీ, శ్రీకాకుళంలో సోమవారం జరిగిన రా.. కదిలిరా.. సభలో కొత్త ఆనవాయితీ తీసుకువచ్చారు. దివంగత ఎంపీ ఎర్రన్నాయుడు విగ్రహాన్ని వేదికపై ఉంచి ఆయన స్మరణతో సభను జరుపుకుందామంటూ ఎర్రన్న విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment