స్వయం సహాయక సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలొద్దు | No programs affecting SHGs | Sakshi
Sakshi News home page

స్వయం సహాయక సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలొద్దు

Published Wed, Apr 17 2024 5:04 AM | Last Updated on Wed, Apr 17 2024 5:04 AM

No programs affecting SHGs - Sakshi

పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలకు ఏపీ సీఈవో మీనా ఆదేశం 

సాక్షి, అమరావతి :  ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమ­ల్లో ఉన్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాల సభ్యు­లను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యక్రమా­లను నిర్వ­హించకూడదంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌–గ్రామీణాభివృద్ధి, రాష్ట్ర పురపాలక– పట్టణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో పనిచేసే సంబంధిత అధికా­రులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఎవరూ స్వయం సహాయక బృందాల సభ్యు­లను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదన్నారు.

కోడ్‌ అమల్లో ఉన్నంత వరకూ స్వయం సహాయక బృందాల సభ్యులను వ్యక్తిగతంగా, సమష్టిగా రాజకీయ కోణంలో అభిప్రాయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రభావితం చేసే ఏ విధమైన సమీకరణ, అవగా­హన, సర్వే వంటి ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.  నిబంధనల అమల్లో సెర్ప్‌ సీఈవో, మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపాలని ఆదేశించారు. 

మహిళల గౌరవానికి పెద్దపీట  
ఎన్నికల ప్రచారంలో మహిళల గౌరవం విషయంలో కఠిన వైఖరిని అమలు­చేస్తు­న్న­ట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహిళలను కించపరిచేలా అభ్యంతర­కర వ్యాఖ్యలు చేసిన పార్టీల నాయకులకు తక్షణం నోటీసులివ్వడం ద్వారా మహి­ళల గౌరవం విషయంలో గట్టి వైఖరిని అమలు చేస్తున్నట్లు తెలిపింది. పార్టీ నేత­లు, ప్ర­చా­రకర్తలు ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలను ఆశ్రయించకుండా చూసు­కోవ­డానికి పార్టీ ముఖ్యులు/అధ్యక్షులు జవాబుదారీతనం వ్యవహరించాలని  కోరింది. 

రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియకు సిద్ధంకండి 
ఈ నెల 18న (రేపు) నోటిఫికేషన్‌ జారీతో ప్రారంభమయ్యే అసలైన ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు సిద్ధం కావాలని మీనా ఆదేశించారు. ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించడంతోపాటు రోజూ క్రమం తప్పకుండా నివేదికలను పంపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

18న నోటిఫికేషన్‌ జారీ నుంచి రోజూ ఈసీఐకి నివేదికలు పంపాలని చెప్పారు. ఈ విషయంలో అలసత్వం వహించరాదన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీపై దృష్టి పెట్టాలన్నారు. ఎపిక్‌ కార్డుల పంపిణీపై మే 4న ఈసీఐ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ లోపు కార్డుల పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. సీ–విజిల్‌ ఫిర్యాదులను అధికారులు సంతృప్తకరస్థాయిలో పరిష్కరిస్తున్నారని చెప్పారు.

కౌంటింగ్‌ కేంద్రాలకు పరిశీలకులను నియమించే విషయంలో ఈసీఐ మార్గదర్శకాలను పాటించాలని, అదనంగా కావాల్సిన పరిశీలకులు, ఏఆర్వోల ప్రతిపాదనలను సాధ్యమైనంత త్వరగా పంపాలని ఆదేశించారు. పోలింగ్‌ పక్రియ, కేంద్రాలు వెబ్‌కాస్టింగ్‌ ద్వారా గరిష్టస్థాయిలో కవర్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement