విశాఖ ఎస్‌బీసీలో ఎస్‌ఎస్‌బీఎన్ ఎస్–4 సబ్‌మెరైన్ ప్రారంభం
విశాఖ సిటీ: భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. అణు శక్తిని పెంపొందించుకునే క్రమంలో రక్షణ వ్యవస్థలోకి కొత్తగా అణు జలాంతర్గామి ప్రవేశించింది. అణుశక్తితో నడిచే భారత నాలుగవ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి (ఎస్‌ఎస్‌బీఎన్–4) అరిధమాన్ విశాఖ సముద్ర తీరంలో నీటిలోకి ప్రవేశించింది. తెలంగాణలో నేవీ రాడార్ కేంద్రం ప్రారంభించిన మరుసటి రోజే.. అక్టోబర్ 16న విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్(ఎస్‌బీసీ)లో దీని ప్రారంభోత్సవం జరిగినట్లు సమాచారం. ఇది బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన మెుట్టమెుదటి అణు జలాంతర్గామి కావడం విశేషం.
కొత్తగా ప్రారంభించిన ఎస్‌ఎస్‌బీఎన్ ఎస్–4ను 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇండో–పసిఫిక్ రీజియన్‌లో శత్రువులను ఎదుర్కోవడంలో ఈ జలాంతర్గాములు కీలక పాత్ర పోషించనున్నాయి. దీనిలో 3,500 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఛేదించేలా కె–4 అణు బాలిస్టిక్ క్షిపణులను అమర్చారు. ఈ క్షిపణులను నిట్టనిలువుగా ప్రయోగించే వీలు ఉంది. అయితే మెుట్టమెుదటి అణు జలాంతర్గామి అయిన ఐఎన్‌ఎస్ అరిహంత్ కేవలం 750 కి.మీ.పరిధి లక్ష్యాన్ని మాత్రమే ఛేదించగలదు. దీనిలో కె–15 అణు క్షిపణులు ఉన్నాయి.
అదే శ్రేణిలో నూతన సాంకేతికత, నవీకరణలతో రూపొందిన ఈ ఎస్–4 జలాంతర్గామి కే–4 క్షిపణులను అమర్చే సామర్థ్యం కలిగి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ జలాంతర్గాములను తొలుత కోడ్ నేమ్‌లతో పిలుస్తారు. ఈ క్రమంలోనే ఐఎన్‌ఎస్ చక్రకు ఎస్–1, ఐఎన్‌ఎస్ అరిహంత్‌కు ఎస్–2, అరిఘాత్కు ఎస్–3, అరిధమాన్‌కు ఎస్–4 అని కోడ్ నేమ్ ఇచ్చారు.
ఇప్పటికే ఐఎన్‌ఎస్ అరిహంత్, ఐఎన్‌ఎస్ అరిఘాత్‌లు సముద్ర గస్తీలో ఉన్నాయి. తాజాగా ఎస్–4 కూడా భారత రక్షణ వ్యవస్థలో చేరి దేశానికి సేవలు అందించడంలో నిమగ్నౖమెంది. కీలకమైన హిందూ మహా సముద్రంపై ఆధిపత్యంలో కీలక పాత్ర పోషించడంలో భాగంగా భారత్ మరిన్ని అధునాతన జలాంతర్గాములను సిద్ధం చేయడంపై దృష్టి సారించింది.
Comments
Please login to add a commentAdd a comment