Nuclear submarine
-
కే4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: అణు సామర్థ్యం కలిగిన కే4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం తీరంలో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి భారత నావికాదళం ఆధ్వర్యంలో బుధవారం ఈ పరీక్ష చేపట్టినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. కే4 బాలిస్టిక్ క్షిపణి 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలదు. దేశంలో మొట్టమొదటిగా జలాంతర్గామి నుంచి నిర్వహించిన తొలి సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ ఇదే. ఈ క్షిపణి రాకతో మన దేశ అణ్వాయుధ సామర్థ్యం మరింత పెరిగినట్లు అధికారులు చెప్పారు. అణ్వాయుధ క్షిపణిని భూమి నుంచి, సముద్ర అంతర్భాగం నుంచి, నింగి నుంచి ప్రయోగించే సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరడం విశేషం. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే అణు జలాంతర్గాములు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, రష్యా వద్ద ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా వీటిని సమకూర్చుకుంది. -
భారత అమ్ముల పొదిలో అణు జలాంతర్గామి
విశాఖ సిటీ: భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. అణు శక్తిని పెంపొందించుకునే క్రమంలో రక్షణ వ్యవస్థలోకి కొత్తగా అణు జలాంతర్గామి ప్రవేశించింది. అణుశక్తితో నడిచే భారత నాలుగవ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి (ఎస్ఎస్బీఎన్–4) అరిధమాన్ విశాఖ సముద్ర తీరంలో నీటిలోకి ప్రవేశించింది. తెలంగాణలో నేవీ రాడార్ కేంద్రం ప్రారంభించిన మరుసటి రోజే.. అక్టోబర్ 16న విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్(ఎస్బీసీ)లో దీని ప్రారంభోత్సవం జరిగినట్లు సమాచారం. ఇది బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన మెుట్టమెుదటి అణు జలాంతర్గామి కావడం విశేషం. కొత్తగా ప్రారంభించిన ఎస్ఎస్బీఎన్ ఎస్–4ను 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇండో–పసిఫిక్ రీజియన్‌లో శత్రువులను ఎదుర్కోవడంలో ఈ జలాంతర్గాములు కీలక పాత్ర పోషించనున్నాయి. దీనిలో 3,500 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఛేదించేలా కె–4 అణు బాలిస్టిక్ క్షిపణులను అమర్చారు. ఈ క్షిపణులను నిట్టనిలువుగా ప్రయోగించే వీలు ఉంది. అయితే మెుట్టమెుదటి అణు జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ అరిహంత్ కేవలం 750 కి.మీ.పరిధి లక్ష్యాన్ని మాత్రమే ఛేదించగలదు. దీనిలో కె–15 అణు క్షిపణులు ఉన్నాయి. అదే శ్రేణిలో నూతన సాంకేతికత, నవీకరణలతో రూపొందిన ఈ ఎస్–4 జలాంతర్గామి కే–4 క్షిపణులను అమర్చే సామర్థ్యం కలిగి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ జలాంతర్గాములను తొలుత కోడ్ నేమ్‌లతో పిలుస్తారు. ఈ క్రమంలోనే ఐఎన్ఎస్ చక్రకు ఎస్–1, ఐఎన్ఎస్ అరిహంత్కు ఎస్–2, అరిఘాత్కు ఎస్–3, అరిధమాన్‌కు ఎస్–4 అని కోడ్ నేమ్ ఇచ్చారు. ఇప్పటికే ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్‌లు సముద్ర గస్తీలో ఉన్నాయి. తాజాగా ఎస్–4 కూడా భారత రక్షణ వ్యవస్థలో చేరి దేశానికి సేవలు అందించడంలో నిమగ్నౖమెంది. కీలకమైన హిందూ మహా సముద్రంపై ఆధిపత్యంలో కీలక పాత్ర పోషించడంలో భాగంగా భారత్ మరిన్ని అధునాతన జలాంతర్గాములను సిద్ధం చేయడంపై దృష్టి సారించింది. -
Melbourne: ‘డ్రాగన్’కు చెక్..! సింగపూర్ కీలక నిర్ణయం
మెల్బోర్న్: ఆస్ట్రేలియాకు చెందిన కొత్త న్యూక్లియర్ సబ్మెరైన్లు సింగపూర్‌లోని చాంగీ నావల్ బేస్‌లో మోహరించేందుకు సింగపూర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మెల్బోర్న్లో జరుగుతున్న స్పెషల్ ఆసియాన్ సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింగపూర్ ప్రధాని లీ లుంగ్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. భద్రత అంశంలో మా దేశంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నందుకుగాను ఆస్ట్రేలియాకు సింగపూర్ ప్రధాని లీ కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సింగపూర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా నేవీ యుద్ధనౌకలు, సబ్ మెరైన్ల మోహరింపు గత ఏడాదితో పోలిస్తే 35 శాతం పెరిగిందని వాషింగ్టన్కు చెందిన ఆసియా మారిటైమ్ ట్రాన్స్పరెన్సీ ఇనిషియేటివ్ అనే సంస్థ వెల్లడించింది. దక్షిణ తూర్పు ఏసియాలో ఆస్ట్రేలియా న్యూక్లియర్ సబ్ మెరైన్లు మోహరించేందుకు అంగీకరించే విషయంలో ఈ ప్రాంతంలోని మిగతా దేశాలతో పోలిస్తే సింపూర్ వేగంగా సాహసోపేత నిర్ణయం తీసుకుందన్న వాదన వినిపిస్తోంది. ఇదీ చదవండి.. అమెరికా, సౌత్‌కొరియాకు నార్త్ కొరియా వార్నింగ్ -
అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర క్షిపణి పరీక్ష
మాస్కో: అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతంగా నిర్వహించినట్లు రష్యా ఆర్మీ ఆదివారం ప్రకటించింది. ఈ క్షిపణి అణువార్హెడ్లను మోసుకెళ్లగలదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధంతో రష్యా, పశ్చిమదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడం, అంతర్జాతీయ అణు పరీక్ష నిషేధ ఒప్పందం నుంచి వైదొలుగుతూ రష్యా పార్లమెంట్ ఆమోదించిన బిల్లుపై అధ్యక్షుడు పుతిన్ గత వారం సంతకం చేసిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇంపరేటర్ అలెగ్జాండర్ 3 అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర బులావా క్షిపణిని రష్యా ఉత్తర తెల్ల సముద్రంలో నీటి అడుగు నుంచి పరీక్షించి చూసినట్లు రష్యా రక్షణ శాఖ వివరించింది. -
తాను వేసిన ఉచ్చులో..
లండన్: చైనాకు సమీపంలోని ఎల్లో సముద్రంలో పశ్చిమ దేశాల జలాంతర్గాములను నిరోధించడానికి తాను వేసిన ఉచ్చులో డ్రాగన్ దేశానికి చెందిన అణు జలాంతర్గామి చిక్కుకుంది. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన 55 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ రహస్య నివేదిక తమ దగ్గర ఉందని డెయిలీ మెయిల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆగస్టులో ఎల్లో సముద్రంలో చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతానికి సమీపంలో క్వింగ్డావ్ నౌకాదళ స్థావరం ఉంది. ఆక్కడికి అమెరికా, బ్రిటన్ల జలంతర్గాములు రాకుండా చైనా ఏర్పాటు చేసిన యాంకర్ ఉచ్చులో దాని సబ్‌మెరైన్ చిక్కుకుందని డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం ఎలా జరిగిందంటే.. ! ఈ సబ్‌మెరైన్ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ సవివరమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఉన్న వివరాల ప్రకారం ఎల్లో సముద్రంలో ఆగస్టు 21 ఉదయం 8.12 గంటల సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన అణు జలంతర్గామి 093 చిక్కుకుపోయింది. అమెరికా, దాని మిత్రపక్షాల జలాంతర్గాముల్ని అడ్డుకోవడానికి వేసిన యాంకర్ చైన్‌ను డ్రాగన్ జలంతర్గామి ఢీ కొట్టడంతో అందులో ఎయిర్ ఫ్యూరిఫయర్, ఎయిర్ ట్రీట్మెంట్ వ్యవస్థలు ఆగిపోయి ఉండవచ్చు. సబ్‌మెరైన్‌లో ప్రయాణిస్తున్న సిబ్బంది ఆరుగంటల సేపు శ్రమించి ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చినా ఫలితం లేకుండా పోయింది. జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్ విషతుల్యమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడి అందులో ప్రయాణిస్తున్న 55 మంది ఉసురు తీసింది. మృతి చెందిన వారిలో జలాంతర్గామి కెప్టెన్ కల్నల్ జీ యాంగ్పెంగ్ సహా 22 మంది అధికారులు, ఏడుగురు ఆఫీసర్ కేడెట్స్, 9 మంది పెట్టీ ఆఫీసర్స్, 17 మంది సిబ్బంది ఉన్నారు. ఆగస్టులో ఈ ప్రమాదం గురించి కొన్ని అంతర్జాతీయ పత్రికలు రాసినా అప్పట్లో చైనా, తైవాన్లు దీనిని తోసిపుచ్చాయి. జలంతర్గాముల్లో హైడ్రోజన్ నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థలు ఉంటాయి. బహుశా చైనా జలాంతర్గామిలో ఆ వ్యవస్థ లేకపోయి ఉండవచ్చునని బ్రిటన్ నిపుణులు చెబుతున్నట్టుగా డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో సబ్మెరైన్నుంచి ఎన్క్రిప్టెడ్ ఆటోమేటిక్ సిగ్నల్ పొరుగు దేశాలకు అందాయని బ్రిటన్ నిపుణులు వెల్లడించారు. అదే సమయంలో బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రసంగం మధ్యలో వెళ్లిపోయారు. అధ్యక్షుడు ప్రసంగ పాఠాన్ని ఆ దేశ వాణిజ్య మంత్రి కొనసాగించారని, ఈ ప్రమాదమే దానికి కారణమన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. -
అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం.. ఆందోళన వ్యక్తం చేసిన చైనా
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి ‘యూఎస్ఎస్ కనెక్టికట్’ ప్రమాదానికి గురైవ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘యూఎస్ఎస్ కనెక్టికట్’ గత శనివారం అంతర్జాతీయ జలాల్లో నీటి అడుగున దేనినో ఢీకొట్టిందనీ, ఈ ఘటనలో పలువురు నావికులు అంతగా ప్రమాదకరం కాని విధంగా గాయపడ్డారని గురువారం యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సబ్మెరీన్ కనెక్టికట్ సురక్షితంగానే ఉంది. అందులోని న్యూక్లియర్ ప్రొపల్షన్ ప్లాంట్, ఇతర వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి’ అని పేర్కొంది. అయితే, ఈ జలాంతర్గామి మునిగిపోయిన ఓడనో, మరే వస్తువునో ఢీకొట్టి ఉంటుందే తప్ప..మరో సబ్‌మెరీన్‌ను మాత్రం కాదని ఓ అధికారి వివరించారు. ప్రస్తుతం ఈ జలాంతర్గామి గ్వామ్ వైపు వెళుతోందని ఆయన చెప్పారు. భద్రతా కారణాల రీత్యానే ఈ ఘటన వివరాలను వెంటనే వెల్లడించలేక పోయినట్లు వివరించారు. కాగా, ప్రమాద ఘటనపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం, ఇతర వివరాలను వెంటనే బహిరంగపర్చాలని డిమాండ్ చేసింది. స్వేచ్ఛా సముద్రయానం పేరుతో ఈ ప్రాంతంలో అమెరికా జరుపుతున్న వాయు, నౌకా విన్యాసాలే ఘటనకు కారణమని నిందించింది. -
అమెరికాపై ఫ్రాన్స్ ఆగ్రహం
పారిస్: సాంప్రదాయక జలాంతర్గాముల కొనుగోలు వ్యవహారం అమెరికా, ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 66 బిలియన్ డాలర్ల విలువైన 12 డీజిల్–ఎలక్ట్రిక్ జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించి 2016లో ఆస్ట్రేలియా ఫ్రాన్స్‌తో భారీ కొనుగోలు ఒప్పందం కుదర్చుకుంది. అయితే, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల కొత్త ‘ఆకస్’ కూటమి పరోక్షంగా ఈ కొనుగోలు ఒప్పందం రద్దుకు దారితీసింది. సంప్రదాయక జలాంతర్గాములు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయబోమని, ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు లేఖ రాశారు. ఫ్రాన్స్‌కు బదులుగా అమెరికా నుంచి అత్యాధునిక అణు జలాంతర్గాములను ఆస్ట్రేలియా కొనుగోలుచేయనుంది. తమతో ఒప్పందం రద్దుకు అమెరికానే ప్రధాన కారణమని ఫ్రాన్స్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇందుకు నిరసన అమెరికాలో తమ రాయబారి ఫిలిప్ ఎతీన్ను ఫ్రాన్స్ వెనక్కి పిలిపించింది. ఆస్ట్రేలియా వైఖరిని తూర్పారబడుతూ అక్కడి తమ రాయబారి జీన్ పియర్ థబాల్ట్ను ఫ్రాన్స్ వెనక్కి పిలిపించింది. -
మూడోది.. మరింత పవర్‌తో!
సాక్షి, విశాఖపట్నం: నావికాదళంలో మూడో అణు జలాంతర్గామి సిద్ధమవుతోంది. అడ్వాన్స్ టెక్నాలజీ వెసల్(ఏటీవీ) ప్రాజెక్టులో భాగంగా స్వదేశీ పరిజ్ఞా నంతో తయారయ్యే ఐదు అణు జలాంతర్గాముల్లో ఇది మూడోది. విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో దీని నిర్మాణం జరుగుతోంది. దీనికి త్వరలో పేరు ఖరారు చేయనున్నారు. ఐఎన్ఎస్ అరిహంత్‌ను 2009 లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సతీమణి గురు శరణ్ కౌర్,అరిధామన్ను నవంబర్‌లో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. తర్వాత అరిదామన్ పేరును అరిఘాత్‌గా మార్చారు. ఈ సబ్ మెరైన్ను ఈ ఏడాది ఆఖరికల్లా ప్రారంభించను న్నారు. మూడు అణుజలాంతర్గాములు విశాఖ జిల్లా రాంబిల్లి వద్ద ఉన్న నేవల్ ఆల్టర్నేటివ్ బేస్ ‘ఐఎన్ఎస్ వర్ష’ స్థావరంగా విధులు నిర్వహించనున్నాయి. అధిక శక్తిశాలి... ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాత్‌లు 112 మీటర్ల పొడవుంటాయి. ఈ మూడో అణు జలాంతర్గామి ఒకింత పొడవు, వాటికంటే ఎక్కువ శక్తిసామర్థ్యాలను కలిగి ఉంటుంది. అరిహంత్‌లో కె–4 రకం సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్(ఎస్ఎల్బీఎం) నాలుగు ఉండగా మూడో సబ్‌మెరైన్‌లో ఎనిమిది ఉంటాయి. ఇవి 3,500 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలు గుతాయి. అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, టార్పెడోలు, టార్పెడో ట్యూబ్‌లు ఉంటాయి. 6,000 టన్నులకు పైగా బరువును మోసుకెళ్లగలుగుతుంది. నీటిపైన గంటకు 15 నాటికల్ మైళ్లు, నీటి అడుగున 24 నాటికల్ మైళ్లకు పైగా వేగంతో పయనిస్తుంది. నీటి కింద 300 మీటర్ల దిగువ వరకు వెళ్లగలుగుతుంది. అరిహంత్‌కంటే మరింత శక్తిమంతమైన ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్‌ను రూపొందించనున్నారు. ఇందులోని అణు రియాక్టర్లు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో డిజైన్ చేశారు. మొత్తం ఈ ఏటీవీ ప్రాజెక్టుకు 2.9 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని తొలుత అంచనా వేశారు. ఇప్పటి వరకు ప్రపంచంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇంగ్లండ్ దేశాలే అణుజలాంతర్గాములు కలిగి ఉన్నా యి. అరిహంత్ నూక్లియర్ సబ్‌మెరైన్ ప్రారంభంతో వీటి సరసన ఆరో దేశంగా భారత్ చేరింది. -
చైనా నేవీలో కొత్త ఆయుధం
-
'అణు శక్తి'తో చైనా అనూహ్య చర్య
-
'అణు శక్తి'తో చైనా అనూహ్య చర్య
బీజింగ్: ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశమూ చేపట్టని అనూహ్యచర్యకు చైనా ఉపక్రమించింది. అణుశక్తితో దాడులు చేయగల భారీ జలాంతర్గామిని మొట్టమొదటిసారి ప్రదర్శనకు ఉంచనుంది. తద్వారా తన నౌకాదళ సామర్థ్యాన్ని చాటి చెప్పాలనుకుంటున్నది. స్వదేశీ పరిజ్ఞానంతో తాయరుచేసిన యుద్ధవాహక నౌకను కూడా తన ప్రజలకు చూపనుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కీలక ప్లీనం జరగడానికి కొద్ది రోజుల ముందే చైనీస్ నేవీ తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించనుండటం గమనార్హం. షాగ్డాంగ్ ఫ్రావిన్స్ లోని సింగ్టావో తీరంలోగల నేవీ మ్యూజియంలో.. అణు శక్తితో దాడులు చేయగల సబ్ మెరైన్ తోపాటు ఇతర సంపత్తిని ప్రదర్శించబోతున్నట్లు చైనీస్ రక్షణ శాఖ గురువారం ప్రకటించింది. ఈ తరహా ప్రదర్శన ప్రపంచంలోనే మొదటిసారని పేర్కొంది. పౌరుల్లో జాతీయవాద భావనను పురిగొల్పేటందుకే చైనా రక్షణ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నదని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అధ్యక్షుడు జింగ్ పింగ్ నేతృత్వంలో చైనా బలీయమైన శక్తిగా ఎదిగిందని, మున్ముందు తన పాటవాన్ని ఇంకా మెరుగుపర్చుకునే క్రమంలో ఇలాంటి ప్రదర్శనలు ఎంతో అవసరమని విశ్లేషకులు అంటున్నారు. కాగా, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి జలాంతర్గామిలోని అణు పదార్థాలను తొలగించిన తర్వాతే దానిని ప్రదర్శనకు ఉంచుతామని అధికారులు వెల్లడించారు. చైనా నౌకాదళ ప్రదర్శనపై ఎప్పటిలాగే కొన్ని దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. -
సాగరతీరంలో విషాదం!
సంపాదకీయం: ప్రపంచంలో యుద్ధ భయం తొలగనంతకాలమూ, పరస్పర అవిశ్వాసం సడలనంత కాలమూ ఏ దేశమైనా రక్షణ సన్నద్ధతలో ఉండకతప్పదు. నేలపైనా, నింగిలోనూ, సాగర తీరాల్లోనూ రెప్పవాల్చని నిఘా ఉంచకతప్పదు. ఈ దేశ రక్షణ క్రతువులో పాలుపంచుకుంటున్నవారంతా అనునిత్యం ఎన్ని అవాంతరాలమధ్య, మరెన్ని ప్రమాదాలమధ్య ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారో ముంబై సాగరతీరంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ‘ఐఎన్ఎస్ సింధురక్షక్’ జలాంతర్గామి దుర్ఘటన తెలియపరుస్తోంది. రష్యాలో తయారై పదహారేళ్లనాడు మన నావికాదళంలో చేరిన సింధురక్షక్లో వరసగా రెండు పేలుళ్లు సంభవించాయి. అందులో ఆ సమయానికి ఉన్న ముగ్గురు అధికారులతోసహా 18 మంది సిబ్బంది ఆచూకీ 24 గంటలు గడిచాక కూడా తెలియలేదు. పేలుళ్లు జరిగిన వెంటనే చుట్టుముట్టిన మంటల్లో జలంతర్గామి అంతర్భాగంలోని కొంత ప్రాంతం కరిగిపోయింది. కనుక ఆచూకీ తెలియనివారు సజీవులుగా ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఈ పేలుడు విద్రోహ చర్యా లేక అనుకోకుండా సంభవించినదా అన్న సంగతి సవివరమైన దర్యాప్తులోగానీ బయటపడదు. జలాంతర్గామి వ్యవస్థే ఒక సంక్లిష్ట నిర్మాణం. అందులో మందుగుండు, ఆక్సిజన్ నిల్వలుండే సిలెండర్లు, బ్యాటరీలు, హైడ్రోజన్ గ్యాస్ నిక్షేపం... ఏవైనా ప్రమాద భరితమైనవే. బ్యాటరీలు చార్జింగ్‌లో ఉన్నప్పుడు వెలువడే హైడ్రోజన్వల్ల పేలుడు జరిగివుండొచ్చన్నది ఫోరెన్సిక్ నిపుణుల ప్రాథమిక అంచనా. బ్యాటరీ చార్జింగ్ సమయంలో లోపం ఏర్పడి ఒక్క నిప్పురవ్వ వెలువడినా అది పెను ప్రమాదానికి కారణం అవుతుందని వారు చెబుతున్నారు. ఇలా నిత్యం మృత్యువుతో సహవాసం చేసే నావికాదళ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్న సందర్భాల్లో సహాయ చర్యలకు ఉపయోగపడగల సామగ్రిలేదని, అసలు అందుకవసరమైన సామర్ధ్యం నావికాదళానికి లోపించిందని అంటున్నారు. నావికా దళ తూణీరంలో సాగర జలాల లోలోతుల్లో సంచరించే జలాంతర్గామి వంటివి ఉన్నప్పుడు వాటిలో ప్రమాదం సంభవిస్తే ఎలాగ, ఏమి చేయాలన్న అంశాల్లో స్పష్టత ఉండాలి. సహాయచర్యల్లో అక్కరకురాగలవాటిని సమకూర్చుకోవాలన్న ఆత్రుత ఉండాలి. ప్రపంచంలోగానీ, మన దేశంలోగానీ ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇదే సింధురక్షక్ మూడేళ్లక్రితం విశాఖతీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని బ్యాటరీ వ్యవస్థ ఉండేచోట పేలుడు సంభవించి ఒక నావికుడు మరణించాడు. ఆ ప్రమాదం జరిగిన నాలుగు నెలలకు మరో రెండు జలాంత ర్గాములు ఢీకొట్టుకున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడగల నౌక గురించి మన నావికాదళం 15 ఏళ్లనుంచి పోరాడుతున్నా అరణ్యరోదనే అవుతోంది. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉండగా 2006లో ఆయన సింధురక్షక్లో కొన్ని గంటలు సంచరించినప్పుడు దానికి రక్షణగా అత్యవసర పరిస్థితిలో వినియోగించడం కోసం అమెరికా నుంచి సహాయ నౌకను తెప్పించాల్సివచ్చింది. అది మన నావికాదళానికి అందుబాటులోఉంటే ఇప్పుడు సింధురక్షక్ ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడం సులభమయ్యేది. మన నావికాదళంలో 1997లో వచ్చిచేరిన ఈ జలాంతర్గామికి అప్పట్లో రూ.400 కోట్ల వ్యయం అయింది. దీనికి అవసరమైన మరమ్మతులు చేసి, ఆధునికీకరించ డానికి మూడేళ్లక్రితం ఒప్పందం కుదిరింది. అందుకోసం రూ.450 కోట్లు వెచ్చిం చారు. ఇందులో నౌకలను ధ్వంసంచేయగల, నేలపైనున్న లక్ష్యాలను సైతం ఛేదిం చగల క్రూయిజ్ క్షిపణులను అమర్చే ఏర్పాటుచేశారు. అవసరమైన మరమ్మతులు, అప్‌గ్రేడేషన్ పూర్తయ్యాక ఈ జనవరిలోనే మళ్లీ అది మన నావికాదళానికి చేరింది. అక్కడినుంచి తిరిగొచ్చేటప్పుడు గడ్డకట్టిన సముద్రజలాల మీదుగా ప్రయాణించింది. మన నావికాదళానికి చేరాక దీనిపై విన్యాసాలు కూడా జరిగాయి. కానీ, ఇప్పుడు సంభవించిన ప్రమాదాన్ని గమనిస్తే రష్యా షిప్‌యార్డ్‌లో సాగించిన మరమ్మతులపైనే అనుమానం కలుగుతోంది. వాస్తవానికి మరమ్మతులన్నీ జరిగాక దీన్ని మరో 15 ఏళ్లపాటు వినియోగించవచ్చని రష్యా సంస్థ భరోసా ఇచ్చింది. ప్రమాదానికి కారణం బ్యాటరీ వ్యవస్థ లోపమే అయినట్టయితే ఆ సంస్థను తప్పుబట్టక తప్పదు. మన నావికాదళ అవసరాలను తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది. ప్రత్యేకించి జలాంతర్గాముల నిర్వహణ తీరు సరిగాలేదని కాగ్ ఆ మధ్య తప్పుబట్టింది. మనకున్న జలాంతర్గాముల్లో 63 శాతం తప్పుకోవాల్సిన స్థాయిలోనే ఉన్నాయని కాగ్ నివేదిక వ్యాఖ్యానించింది. 2012 నాటికల్లా 12 కొత్త జలాంతర్గాముల్ని సమకూర్చుకోవాలని 1999లో నిర్ణయించినా 2000 సంవత్సరం తర్వాత మనకు కొత్తగా ఒక్కటీ రాలేదు. మన ఇరుగుపొరుగు నుంచి ముప్పువాటిల్లే పరిస్థితులు తక్కువేమీ కాదు. తరచుగా సరిహద్దుల్లో ఉల్లంఘనలకు పాల్పడుతున్న చైనా... సాగరజలాల్లో సైతం మనపై దూకుడును ప్రదర్శిస్తోంది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన జలాంతర్గాముల సంఖ్యను అది నానాటికీ పెంచుకుంటోంది. దాదాపు 90 జలాంతర్గాములతో అది ఆసియాలోనే అతి పెద్ద నావికా శక్తిగా ఉంది. అందులో దాదాపు 15 అణు జలాంతర్గాములు. పాకిస్థాన్ నుంచి రాగల ముప్పుకూడా తక్కువేమీ కాదు. పరిస్థితులు ఇలా ఉండగా సింధురక్షక్ దుర్ఘటనతో మన సంప్రదాయక జలాంతర్గాముల సంఖ్య 13కి పడిపోయింది. వీటితో పాటు రష్యా నుంచి లీజుకు తీసుకున్న అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ ఒకటుంది. యుద్ధ పరిస్థితులే ఏర్పడితే మనకున్న జలాంతర్గాములు ఏమూలకూ సరిపోవని రక్షణ మంత్రిత్వ శాఖ రహస్య నివేదిక ఆమధ్య ప్రభుత్వం దృష్టికి తెచ్చిందంటున్నారు. ఇప్పుడు సంభవించిన దుర్ఘటనైనా మన పాలకుల కళ్లు తెరిపించాలి. మన రక్షణ అవసరాలేమిటో, మన పాటవమెంతో సరిపోల్చుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలి. బలహీన స్థితిలో ఉండి పలికే శాంతిప్రవచనాలు శత్రువుల తలకెక్కవని గుర్తించాలి.