'అణు శక్తి'తో చైనా అనూహ్య చర్య
బీజింగ్: ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశమూ చేపట్టని అనూహ్యచర్యకు చైనా ఉపక్రమించింది. అణుశక్తితో దాడులు చేయగల భారీ జలాంతర్గామిని మొట్టమొదటిసారి ప్రదర్శనకు ఉంచనుంది. తద్వారా తన నౌకాదళ సామర్థ్యాన్ని చాటి చెప్పాలనుకుంటున్నది. స్వదేశీ పరిజ్ఞానంతో తాయరుచేసిన యుద్ధవాహక నౌకను కూడా తన ప్రజలకు చూపనుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కీలక ప్లీనం జరగడానికి కొద్ది రోజుల ముందే చైనీస్ నేవీ తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించనుండటం గమనార్హం.
షాగ్డాంగ్ ఫ్రావిన్స్ లోని సింగ్టావో తీరంలోగల నేవీ మ్యూజియంలో.. అణు శక్తితో దాడులు చేయగల సబ్ మెరైన్ తోపాటు ఇతర సంపత్తిని ప్రదర్శించబోతున్నట్లు చైనీస్ రక్షణ శాఖ గురువారం ప్రకటించింది. ఈ తరహా ప్రదర్శన ప్రపంచంలోనే మొదటిసారని పేర్కొంది. పౌరుల్లో జాతీయవాద భావనను పురిగొల్పేటందుకే చైనా రక్షణ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నదని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అధ్యక్షుడు జింగ్ పింగ్ నేతృత్వంలో చైనా బలీయమైన శక్తిగా ఎదిగిందని, మున్ముందు తన పాటవాన్ని ఇంకా మెరుగుపర్చుకునే క్రమంలో ఇలాంటి ప్రదర్శనలు ఎంతో అవసరమని విశ్లేషకులు అంటున్నారు. కాగా, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి జలాంతర్గామిలోని అణు పదార్థాలను తొలగించిన తర్వాతే దానిని ప్రదర్శనకు ఉంచుతామని అధికారులు వెల్లడించారు. చైనా నౌకాదళ ప్రదర్శనపై ఎప్పటిలాగే కొన్ని దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.