Qingdao
-
నిర్లక్ష్యానికి ఫలితం.. కోటి టెస్ట్‌లు
బీజింగ్: చైనాలోని కింగ్డావ్ హాస్పిటల్లో జరిగిన చిన్న నిర్లక్ష్యపూరిత తప్పిదానికి దాదాపు కోటి మందికి కరోనా టెస్టులు చేయాల్సివచ్చిందని సీనియర్ ఆరోగ్య అధికారి ఒకరు చెప్పారు. అయితే ఇంతవరకు వీరిలో ఎవరికీ పాజిటివ్ రాలేదన్నారు. కింగ్డావ్ ఆస్పత్రి సీటీ రూమ్‌లో డిసిన్ఫెక్షన్ సరిగా చేయకపోవడంతో ఆస్పత్రి కరోనాకు కొత్త క్లస్టర్‌గా మారిందని తెలిపారు. కానీ ఈ తప్పిదంతో ఎవరికీ కొత్తగా కరోనా సోకలేదని, ఇకపై క్రాస్ ఇన్ఫెక్షన్తో కొత్త కేసులు వచ్చే అవకాశాలు కూడా ఉండకపోవచ్చని తెలిపారు. కింగ్‌డావ్‌లో కొత్త క్లస్టర్ ఏర్పడడం దేశవ్యాప్తంగా కలవరం సృష్టించింది. ఈ నగరాన్ని ఇటీవలి సెలవు దినాల్లో వేలాది మంది సందర్శించారు. దీంతో వీరందరికీ కోవిడ్ ముప్పు ఉండొచ్చన్న అనుమానాలు పెరిగాయి. అందుకే భారీ స్థాయిలో కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు 1.04 కోట్ల శాంపిళ్లు సేకరించామని, వీటిలో 88 లక్షల శాంపిళ్ల ఫలితాలు వచ్చాయని అధికారులు చెప్పారు. శుక్రవారానికి 1.1 కోట్ల మందికి టెస్టులు నిర్వహించడం పూర్తవుతుందన్నారు. ఆస్పత్రి నిర్లక్ష్యానికిగాను కింగ్డావ్ హెల్త్ కమీషన్ డైరెక్టర్ సుయిజెన్హువాను సస్పెండ్ చేశారు. పల్మనరీ ఆస్పత్రి డీన్ డెంగ్ కైను పదవి నుంచి తొలగించారు. ప్రజలకు అందుబాటులో టీకా చైనాలోని జియాజింగ్ నగరంలోని కొందరు పౌరులకు ప్రయోగాత్మకంగా కరోనా టీకాను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న, టీకా అత్యంత అవసరమైన వారు ఈ సైనోవాక్ బయోటెక్ టీకా కోసం స్థానిక క్లినిక్‌లలో సంప్రదించాలని జియాజింగ్ అధికారులు గురువారం ప్రకటించారు. ఈ టీకాను ఇప్పటికే వైద్యసిబ్బంది సహా వైరస్ ముప్పు అధికంగా ఉన్న వారికి ఇచ్చినట్లు తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎంతమందికి ఈ టీకా ఇచ్చారనే విషయం కానీ, టీకా దుష్ఫలితాల విషయం కానీ వారు వెల్లడించలేదు. ఈ టీకాను 28 రోజుల వ్యవధిలో 2 డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టీకా ధర 400 యువాన్లు(రూ. 4332)గా నిర్ధారించారు. చైనాలో ప్రస్తుతం 11 టీకాలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. వాటిలో నాలుగు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఏ టీకా కూడా పూర్తి స్థాయిలో ప్రజాబాహుళ్య వినియోగానికి అనుమతులు పొందలేదు. -
చైనా చేరిన భారత యుద్ధ నౌకలు
పెదవాల్తేరు(విశాఖతూర్పు): చైనాలో జరుగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు భారత్‌కు చెందిన నౌకలు తరలి వెళ్లాయి. భారతీయ నావికాదళానికి చెందిన కోల్‌కతా, శక్తి నౌకలు చైనాలోని క్వింగ్డాయో నగరంలోకి సోమవారం ప్రవేశించాయి. చైనా నేవీ పీఎల్ఏ 70వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అంతర్జాతీయ ఫ్లీట్‌రివ్యూ తలపెట్టారు. భారతీయ నౌకలకు చెందిన సిబ్బంది చైనాలో 21 తుపాకులతో సెల్యూట్ నిర్వహించారు. భారతీయ నౌకలకు స్వాగత కార్యక్రమంలో భాగంగా చైనా నేవీ పీఎల్ఏ సిబ్బంది నేవీ బ్యాండుతో సాదర స్వాగతం పలికారు. కాగా, భారతీయ నౌకలు చైనాలో అంతర్జాతీయ ఫ్లీట్‌రివ్యూలో గతంలో 2009, 2014 సంవత్సరాల్లోనూ పాల్గొన్నాయి. భారత్–చైనా మధ్య గల సౌభ్రాతృత్వ స్నేహానికి వారధిగా ఇరు దేశాల నేవీలు పరస్పర సహకారంలో భాగంగానే భారతీయ నౌకలు అంతర్జాతీయ ఫ్లీట్‌రివ్యూలో పాల్గొంటున్నాయి. ఈనెల 23వ తేదీన భారతీయ నౌకలు నిర్వహించే పరేడ్‌ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమీక్షిస్తారు. పలు క్రీడా ఈవెంట్లలో భారతీయ నౌకాదళ సిబ్బంది పాల్గొంటారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్‌రివ్యూలో చైనాలోని భారత్ రాయబారి విక్రమ్మిస్రి తదితర అధికారులు పాల్గొంటారు. మే 4వ తేదీన ఫ్లీట్‌రివ్యూ ప్రారంభోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. భారతీయ నౌకలు చైనా ప్రయాణంలో భాగంగా వియత్నాంలోని కామ్రన్హ్బే పోర్టు మీదుగా చైనా చేరుకున్నాయి. అలాగే, ఈ నౌకలు తిరుగు ప్రయాణంలో భాగంగా పోర్టు బూషన్, దక్షిణ కొరియా, సింగపూర్ పోర్టుకు వెళతాయి. కేంద్ర ప్రభుత్వ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా తూర్పు, దక్షిణ ఆసియా దేశాలతో సాంస్కృతిక, ఆర్థిక, మేరీటైమ్ రంగాల్లో ఆయా దేశాలతో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. -
'అణు శక్తి'తో చైనా అనూహ్య చర్య
-
'అణు శక్తి'తో చైనా అనూహ్య చర్య
బీజింగ్: ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశమూ చేపట్టని అనూహ్యచర్యకు చైనా ఉపక్రమించింది. అణుశక్తితో దాడులు చేయగల భారీ జలాంతర్గామిని మొట్టమొదటిసారి ప్రదర్శనకు ఉంచనుంది. తద్వారా తన నౌకాదళ సామర్థ్యాన్ని చాటి చెప్పాలనుకుంటున్నది. స్వదేశీ పరిజ్ఞానంతో తాయరుచేసిన యుద్ధవాహక నౌకను కూడా తన ప్రజలకు చూపనుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కీలక ప్లీనం జరగడానికి కొద్ది రోజుల ముందే చైనీస్ నేవీ తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించనుండటం గమనార్హం. షాగ్డాంగ్ ఫ్రావిన్స్ లోని సింగ్టావో తీరంలోగల నేవీ మ్యూజియంలో.. అణు శక్తితో దాడులు చేయగల సబ్ మెరైన్ తోపాటు ఇతర సంపత్తిని ప్రదర్శించబోతున్నట్లు చైనీస్ రక్షణ శాఖ గురువారం ప్రకటించింది. ఈ తరహా ప్రదర్శన ప్రపంచంలోనే మొదటిసారని పేర్కొంది. పౌరుల్లో జాతీయవాద భావనను పురిగొల్పేటందుకే చైనా రక్షణ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నదని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అధ్యక్షుడు జింగ్ పింగ్ నేతృత్వంలో చైనా బలీయమైన శక్తిగా ఎదిగిందని, మున్ముందు తన పాటవాన్ని ఇంకా మెరుగుపర్చుకునే క్రమంలో ఇలాంటి ప్రదర్శనలు ఎంతో అవసరమని విశ్లేషకులు అంటున్నారు. కాగా, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి జలాంతర్గామిలోని అణు పదార్థాలను తొలగించిన తర్వాతే దానిని ప్రదర్శనకు ఉంచుతామని అధికారులు వెల్లడించారు. చైనా నౌకాదళ ప్రదర్శనపై ఎప్పటిలాగే కొన్ని దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. -
మురికి బీచ్‌లో అమ్మాయిల వింత సరదా
అలుపెరుగని అలల నురగలతో సుందరంగా ఉండాల్సిన బీచ్ ఆకుపచ్చగా మారిపోయింది. తూర్పు చైనా జింగ్ డావో ఫ్రావిన్స్ లోని ఓ బీచ్ నాచుమయంగా మారింది. అలలతో పాటు ఒడ్డుకు కొట్టుకొచ్చే నాచుతో ఆ ప్రాంతమంతా కంటికి ఇంపుగా కనిపిస్తుంది. సాధారణ నాచులా కంపు కొట్టకుండా సువాసన వెదజల్లే ఈ నాచు తీరాన్ని చూసేందుకు చైనీయులు ఎగబడుతుంటారు. మరీ ముఖ్యంగా వీకెండ్స్ లో అమ్మాయిల తాకిడి ఎక్కువగా ఉంటోంది. పచ్చ సముద్రం (యెల్లో సీ) నుంచి భారీగా కొట్టుకొచ్చే నాచును.. దాదాపు 9 వేల హెక్టార్లు పేరుకుపోయిందని, దీనిని శుభ్రం చేయాలనుకునే లోగా పర్యాటకుల సంఖ్య పెరిగిందని, దీంతో నాచు తొలగింపు పనులు నిలిపేశామని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఆకుపచ్చ నాచులో అందంగా ఆడుకుంటోన్న అమ్మాయిల ఫొటోలు ఇవిగో.. -
మోదీ చైనా పర్యటనలో హైదరాబాద్ కు ప్రాధాన్యత
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనలో హైదరాబాద్ నగరానికి కూడా ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ చైనా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య 24 ఒప్పందాలు జరిగాయి. వాటిలో హైదరాబాద్ నగరం కూడా ఉండటం విశేషం. భారత్‌లోని నాలుగు నగరాలతో చైనాలోని నాలుగు నగరాలను అనుసంధానం చేస్తూ ఈ నగరాల మధ్య పరస్పర స్నేహపూర్వక వ్యాపారం నిర్వహించేందుకు ఒప్పందం కూడా ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరాన్ని చైనాలోని కింగ్దావ్ నగరంతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు నగరాల మధ్య స్నేహపూర్వక వర్తకం జరిగే అవకాశం ఏర్పడింది. ఈ విధంగా హైదరాబాద్‌కు మేలు జరిగిందని భావిస్తున్నారు. -
చైనాలో ఆయిల్ పైప్‌లైన్ పేలి 22 మంది మృతి
బీజింగ్: చైనాలో ఆయిల్ పైప్‌లైన్ పేలి భారీ ప్రమాదం సంభవించింది. తీర ప్రాంతమైన కిన్దావ్లో పెట్రోలియం పైప్‌లైన్ లీక్ కావడంతో దాదాపు 22 మంది మరణించగా, అధిక సంఖ్యలో గాయపడ్డారు.కాగా, ఎంత మంది గాయపడ్డారనేది అనేది మాత్రం బయటకు వెల్లడించలేదు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఉదయం 10.30గం.లకు జరగగా, పైప్‌లైన్ లీకేజీ మాత్రం తెల్లవారుజామున 3.గంలకే ఆరంభమైంది. దీంతో పైప్‌లైన్ ను పూర్తిగా నిలిపివేశారు. పైప్ లైన్ లో చమురు ఒత్తిడి పెరిగడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు కిన్దావ్ ప్రభుత్వ కార్యాలయం వెల్లడించింది. ఈ ఘటన నేపధ్యంలో తీర ప్రాంతాల్లో ఉన్న పెట్రోలియం సైట్ లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. -
అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో నిర్మించనున్న చైనా
క్వింగ్డావో: హాలీవుడ్‌ను తలదన్నే ఫిల్మ్ స్టూడియోను నిర్మించేందుకు చైనా శ్రీకారం చుట్టింది. తీరప్రాంత నగరం క్వింగ్డావో శివార్లలో క్వింగ్డావో ఓరియంటల్ మూవీ మెట్రోపోలీస్ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. 900 ఎకరాల్లో చేపట్టనున్న ఈ ఫిల్మ్ సిటీ నిర్మాణం 2017కు పూర్తికానుంది. ఆ తర్వాతే ఇక్కడ సినిమా కార్యకలాపాలు మొదలవుతాయి. వాండా గ్రూప్‌తో కలిసి చైనాలోనే అత్యంత ధనవంతుడు వాంగ్ జియాన్లిన్ సంయుక్తంగా ఈ చైనా హాలీవుడ్‌ను నిర్మిస్తున్నారు. 830 కోట్ల అమెరికా డాలర్లను వెచ్చించనున్నారు. సినిమా సిటీ ప్రారంభోత్సవానికి హాలీవుడ్ టాప్ స్టార్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. నికోల్ కిడ్మన్, లియోనార్డో డికాప్రియోలతో పాటు చైనా స్టార్లు జాంగ్ జియి, జెట్ లీ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా సిటీలో సుమారు 20 స్టూడియోల నిర్మాణం జరుగనుంది.