క్వింగ్‌డావో: హాలీవుడ్‌ను తలదన్నే ఫిల్మ్ స్టూడియోను నిర్మించేందుకు చైనా శ్రీకారం చుట్టింది. తీరప్రాంత నగరం క్వింగ్‌డావో శివార్లలో క్వింగ్‌డావో ఓరియంటల్ మూవీ మెట్రోపోలీస్ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. 900 ఎకరాల్లో చేపట్టనున్న ఈ ఫిల్మ్ సిటీ నిర్మాణం 2017కు పూర్తికానుంది.
ఆ తర్వాతే ఇక్కడ సినిమా కార్యకలాపాలు మొదలవుతాయి. వాండా గ్రూప్‌తో కలిసి చైనాలోనే అత్యంత ధనవంతుడు వాంగ్ జియాన్‌లిన్ సంయుక్తంగా ఈ చైనా హాలీవుడ్‌ను నిర్మిస్తున్నారు. 830 కోట్ల అమెరికా డాలర్లను వెచ్చించనున్నారు. సినిమా సిటీ ప్రారంభోత్సవానికి హాలీవుడ్ టాప్ స్టార్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. నికోల్ కిడ్‌మన్, లియోనార్డో డికాప్రియోలతో పాటు చైనా స్టార్లు జాంగ్ జియి, జెట్ లీ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా సిటీలో సుమారు 20 స్టూడియోల నిర్మాణం జరుగనుంది.