సంపాదకీయం: ప్రపంచంలో యుద్ధ భయం తొలగనంతకాలమూ, పరస్పర అవిశ్వాసం సడలనంత కాలమూ ఏ దేశమైనా రక్షణ సన్నద్ధతలో ఉండకతప్పదు. నేలపైనా, నింగిలోనూ, సాగర తీరాల్లోనూ రెప్పవాల్చని నిఘా ఉంచకతప్పదు. ఈ దేశ రక్షణ క్రతువులో పాలుపంచుకుంటున్నవారంతా అనునిత్యం ఎన్ని అవాంతరాలమధ్య, మరెన్ని ప్రమాదాలమధ్య ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారో ముంబై సాగరతీరంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ‘ఐఎన్‌ఎస్ సింధురక్షక్’ జలాంతర్గామి దుర్ఘటన తెలియపరుస్తోంది. రష్యాలో తయారై పదహారేళ్లనాడు మన నావికాదళంలో చేరిన సింధురక్షక్‌లో వరసగా రెండు పేలుళ్లు సంభవించాయి. అందులో ఆ సమయానికి ఉన్న ముగ్గురు అధికారులతోసహా 18 మంది సిబ్బంది ఆచూకీ 24 గంటలు గడిచాక కూడా తెలియలేదు. పేలుళ్లు జరిగిన వెంటనే చుట్టుముట్టిన మంటల్లో జలంతర్గామి అంతర్భాగంలోని కొంత ప్రాంతం కరిగిపోయింది.
కనుక ఆచూకీ తెలియనివారు సజీవులుగా ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఈ పేలుడు విద్రోహ చర్యా లేక అనుకోకుండా సంభవించినదా అన్న సంగతి సవివరమైన దర్యాప్తులోగానీ బయటపడదు. జలాంతర్గామి వ్యవస్థే ఒక సంక్లిష్ట నిర్మాణం. అందులో మందుగుండు, ఆక్సిజన్ నిల్వలుండే సిలెండర్లు, బ్యాటరీలు, హైడ్రోజన్ గ్యాస్ నిక్షేపం... ఏవైనా ప్రమాద భరితమైనవే. బ్యాటరీలు చార్జింగ్‌లో ఉన్నప్పుడు వెలువడే హైడ్రోజన్‌వల్ల పేలుడు జరిగివుండొచ్చన్నది ఫోరెన్సిక్ నిపుణుల ప్రాథమిక అంచనా. బ్యాటరీ చార్జింగ్ సమయంలో లోపం ఏర్పడి ఒక్క నిప్పురవ్వ వెలువడినా అది పెను ప్రమాదానికి కారణం అవుతుందని వారు చెబుతున్నారు.
ఇలా నిత్యం మృత్యువుతో సహవాసం చేసే నావికాదళ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్న సందర్భాల్లో సహాయ చర్యలకు ఉపయోగపడగల సామగ్రిలేదని, అసలు అందుకవసరమైన సామర్ధ్యం నావికాదళానికి లోపించిందని అంటున్నారు. నావికా దళ తూణీరంలో సాగర జలాల లోలోతుల్లో సంచరించే జలాంతర్గామి వంటివి ఉన్నప్పుడు వాటిలో ప్రమాదం సంభవిస్తే ఎలాగ, ఏమి చేయాలన్న అంశాల్లో స్పష్టత ఉండాలి. సహాయచర్యల్లో అక్కరకురాగలవాటిని సమకూర్చుకోవాలన్న ఆత్రుత ఉండాలి.
ప్రపంచంలోగానీ, మన దేశంలోగానీ ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇదే సింధురక్షక్ మూడేళ్లక్రితం విశాఖతీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని బ్యాటరీ వ్యవస్థ ఉండేచోట పేలుడు సంభవించి ఒక నావికుడు మరణించాడు. ఆ ప్రమాదం జరిగిన నాలుగు నెలలకు మరో రెండు జలాంత ర్గాములు ఢీకొట్టుకున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడగల నౌక గురించి మన నావికాదళం 15 ఏళ్లనుంచి పోరాడుతున్నా అరణ్యరోదనే అవుతోంది. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉండగా 2006లో ఆయన సింధురక్షక్‌లో కొన్ని గంటలు సంచరించినప్పుడు దానికి రక్షణగా అత్యవసర పరిస్థితిలో వినియోగించడం కోసం అమెరికా నుంచి సహాయ నౌకను తెప్పించాల్సివచ్చింది. అది మన నావికాదళానికి అందుబాటులోఉంటే ఇప్పుడు సింధురక్షక్ ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడం సులభమయ్యేది.
మన నావికాదళంలో 1997లో వచ్చిచేరిన ఈ జలాంతర్గామికి అప్పట్లో రూ.400 కోట్ల వ్యయం అయింది. దీనికి అవసరమైన మరమ్మతులు చేసి, ఆధునికీకరించ డానికి మూడేళ్లక్రితం ఒప్పందం కుదిరింది. అందుకోసం రూ.450 కోట్లు వెచ్చిం చారు. ఇందులో నౌకలను ధ్వంసంచేయగల, నేలపైనున్న లక్ష్యాలను సైతం ఛేదిం చగల క్రూయిజ్ క్షిపణులను అమర్చే ఏర్పాటుచేశారు. అవసరమైన మరమ్మతులు, అప్‌గ్రేడేషన్ పూర్తయ్యాక ఈ జనవరిలోనే మళ్లీ అది మన నావికాదళానికి చేరింది. అక్కడినుంచి తిరిగొచ్చేటప్పుడు గడ్డకట్టిన సముద్రజలాల మీదుగా ప్రయాణించింది. మన నావికాదళానికి చేరాక దీనిపై విన్యాసాలు కూడా జరిగాయి. కానీ, ఇప్పుడు సంభవించిన ప్రమాదాన్ని గమనిస్తే రష్యా షిప్‌యార్డ్‌లో సాగించిన మరమ్మతులపైనే అనుమానం కలుగుతోంది. వాస్తవానికి మరమ్మతులన్నీ జరిగాక దీన్ని మరో 15 ఏళ్లపాటు వినియోగించవచ్చని రష్యా సంస్థ భరోసా ఇచ్చింది. ప్రమాదానికి కారణం బ్యాటరీ వ్యవస్థ లోపమే అయినట్టయితే ఆ సంస్థను తప్పుబట్టక తప్పదు.
మన నావికాదళ అవసరాలను తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది. ప్రత్యేకించి జలాంతర్గాముల నిర్వహణ తీరు సరిగాలేదని కాగ్ ఆ మధ్య తప్పుబట్టింది. మనకున్న జలాంతర్గాముల్లో 63 శాతం తప్పుకోవాల్సిన స్థాయిలోనే ఉన్నాయని కాగ్ నివేదిక వ్యాఖ్యానించింది. 2012 నాటికల్లా 12 కొత్త జలాంతర్గాముల్ని సమకూర్చుకోవాలని 1999లో నిర్ణయించినా 2000 సంవత్సరం తర్వాత మనకు కొత్తగా ఒక్కటీ రాలేదు. మన ఇరుగుపొరుగు నుంచి ముప్పువాటిల్లే పరిస్థితులు తక్కువేమీ కాదు. తరచుగా సరిహద్దుల్లో ఉల్లంఘనలకు పాల్పడుతున్న చైనా... సాగరజలాల్లో సైతం మనపై దూకుడును ప్రదర్శిస్తోంది.
హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన జలాంతర్గాముల సంఖ్యను అది నానాటికీ పెంచుకుంటోంది. దాదాపు 90 జలాంతర్గాములతో అది ఆసియాలోనే అతి పెద్ద నావికా శక్తిగా ఉంది. అందులో దాదాపు 15 అణు జలాంతర్గాములు. పాకిస్థాన్ నుంచి రాగల ముప్పుకూడా తక్కువేమీ కాదు. పరిస్థితులు ఇలా ఉండగా సింధురక్షక్ దుర్ఘటనతో మన సంప్రదాయక జలాంతర్గాముల సంఖ్య 13కి పడిపోయింది. వీటితో పాటు రష్యా నుంచి లీజుకు తీసుకున్న అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్ ఒకటుంది. యుద్ధ పరిస్థితులే ఏర్పడితే మనకున్న జలాంతర్గాములు ఏమూలకూ సరిపోవని రక్షణ మంత్రిత్వ శాఖ రహస్య నివేదిక ఆమధ్య ప్రభుత్వం దృష్టికి తెచ్చిందంటున్నారు. ఇప్పుడు సంభవించిన దుర్ఘటనైనా మన పాలకుల కళ్లు తెరిపించాలి. మన రక్షణ అవసరాలేమిటో, మన పాటవమెంతో సరిపోల్చుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలి. బలహీన స్థితిలో ఉండి పలికే శాంతిప్రవచనాలు శత్రువుల తలకెక్కవని గుర్తించాలి.
సాగరతీరంలో విషాదం!
Published Fri, Aug 16 2013 12:35 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement
Advertisement