ఆయనెలాంటి అనుచిత లబ్ధి పొందలేదు
అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా లేవు
సెక్షన్–17ఏను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది
కక్ష సాధింపులో భాగంగానే ఏసీబీ కేసు పెట్టింది
ముందస్తు బెయిల్ మంజూరు చేయండి
హైకోర్టుకు నివేదించిన విజయ్‌కుమార్‌రెడ్డి తరపు న్యాయవాది
విచారణ ఈనెల 23కి వాయిదా
సాక్షి, అమరావతి : అధికారిక విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదని సమాచార, పౌర సంబంధాల (ఐ అండ్ పీఆర్) శాఖ పూర్వ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పబ్లిక్ సర్వెంట్‌గా విజయ్‌కుమార్ తన విధి నిర్వహణలో ఎలాంటి అనుచిత లబ్ధిపొందలేదని ఆయన తరఫు న్యాయవాది వేలూ రి మహేశ్వరరెడ్డి వివరించారు. నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని, పత్రికా ప్రకటనల్లో ఓ వర్గం మీడియాకు లబ్ధి చేకూర్చారంటూ ఏసీబీ ఆరోపిస్తోందని.. అయితే, ఇందుకు నిర్ధిష్ట ఆధారాలను మాత్రం చూపడంలేదన్నారు.
విధి నిర్వహణలో విజయ్‌కుమార్‌రెడ్డి చర్యలేవీ కూడా నేరపూరిత దుష్ప్రవర్తన కిందకు రావని తెలిపారు. ఆయనెలాంటి అవినీతికి కూడా పాల్పడలేదని, అందుకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు కూడా లేవని మహేశ్వరరెడ్డి కోర్టుకు వివరించారు. కక్ష, పక్షపాతం దురుద్దేశాలతో ఏసీబీ తన క్లయింట్‌పై తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. తప్పుడు కేసుల నుంచి అధికారులను రక్షించేందుకే అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్–17ఏను చేర్చారని.. కానీ, ప్రభుత్వం సెక్షన్–17ఏ కింద విచారణ చేసేందుకు అనుమతించడం సరికాదన్నారు.
తన క్లయింట్ విచారణకు అనుమతినివ్వడం ద్వారా ఆ సెక్షన్‌ను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో దాన్ని ప్రభుత్వం కాలరాసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దురుద్దేశంతోనే తన క్లయింట్‌పై ఉన్న ఆరోపణల పరిధిని ఏసీబీ పెంచిందన్నారు. రీడర్‌షిప్, సర్క్యులేషన్‌ను ప్రామాణికంగా తీసుకునే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు ఇచ్చినట్లు మహేశ్వర్‌రెడ్డి స్పష్టంచేశారు. దీనిని కూడా అవినీతి అనడం దారుణమన్నారు. పరిపాలనపరమైన నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడం చెల్లదన్నారు.
అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని విజయ్‌కుమార్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మహేశ్వర్‌రెడ్డి కోర్టును అభ్యర్థించారు. ఏ షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు. విజయ్‌కుమార్‌రెడ్డి వాదనలు ముగియడంతో ఏసీబీ వాదనల నిమిత్తం విచారణ ఈనెల 23కి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ప్రకటనల జారీ, బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ విజయ్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment