పెదకూరపాడు నియోజకవర్గంలో 737 ఓట్లున్న ఈవీఎంను లెక్కించని అధికారులు
56వ పోలింగ్ బూత్ ఈవీఎంలో సాంకేతిక లోపమంటూ పక్కన పెట్టిన వైనం
అచ్చంపేట మండలంలో 2019లో వైఎస్సార్‌సీపీకి 7,597 ఓట్ల మెజార్టీ
ఈసారి ఈవీఎం లెక్కించకుండానే టీడీపీకి ఆధిక్యమని చెప్పిన అధికారులు
ఇలాంటి దారుణాలు ఇంకెన్ని జరిగాయోనని అనుమానాలు
అచ్చంపేట: ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈవీఎం మారిపోయిన సంఘటన ఇప్పటికే బయటపడగా, తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎంలో నమోదైన ఓట్లను లెక్కించకుండానే అధికారులు పక్కన పడేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ నియోజకవర్గంలోని అచ్చంపేట జెడ్పీ హైస్కూల్‌లో ఉన్న 56వ పోలింగ్ బూత్‌లో ఈవీఎంలో ఓట్లను లెక్కించకుండానే అధికారులు పక్కన పెట్టేశారని కౌంటింగ్ ఏజెంట్లు తెలిపారు.
దీనిపై అధికారులను ప్రశ్నించగా, ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తిందని, అది ఓపెన్ కావడంలేదని, అందువల్ల లెక్కింపు సాధ్యం కావడంలేదని చెప్పారని ఏజెంట్లు చెప్పారు. ఈ బూత్‌లో మొత్తం 737 ఓట్లు ఉన్నాయి. అందులో 357 మంది పురుషులు, 380 మంది మహిళలు ఉన్నారు. అచ్చంపేట మండలంలో 2019 ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి 7,597 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈసారి టీడీపీకి ఈ మండలంలో 161 ఓట్ల మెజార్టీ వచ్చింది.
అయితే, 56వ పోలింగ్ బూత్‌లో ఓట్లను లెక్కించకుండానే టీడీపీకి 161 ఓట్ల మెజార్టీ వచ్చినట్లు అధికారులు ఎలా ధృవీకరిస్తారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకే అధికారులు ఈ విధంగా, చేశారని, వైఎస్సార్‌సీపీని దెబ్బ తీయడానికి ఇంకా బయటపడని ఘోరాలు ఇంకెన్ని జరిగాయోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment