మూడో రోజు ఈవీఎం వెరిఫికేషన్‌లో అధికారుల ట్విస్ట్
పీఎస్‌ల నుంచి ఫుటేజీ సేకరణ ప్రక్రియ పూర్తి కాలేదని వెల్లడి
తమ సందేహాలను నివృత్తి చేయాలని ఫిర్యాదుదారుల పట్టు
మాక్ పోలింగ్ బహిష్కరణ.. అర్ధంతరంగా ముగిసిన వెరిఫికేషన్
తొలిరోజు
మాక్ పోలింగ్‌లో ఉపయోగించిన ఈవీఎం కొత్త బ్యాటరీ స్టేటస్ 99 శాతం నుంచి 88 శాతానికి తగ్గింది. అలాంటప్పుడు పోలింగ్ రోజు 12 గంటలకు పైగా వినియోగించిన బ్యాటరీ 21 రోజుల పాటు భద్రపరిచి కౌంటింగ్ రోజు జూన్ 4న తెరిచిన తర్వాత కూడా 99 శాతం ఎలా చూపిస్తోంది? ఈ ప్రశ్నకు ఎన్నికల అధికారుల నుంచి సమాధానం లేదు.
రెండో రోజు
ఈవీఎంలు, వీవీ ప్యాట్లలో ఓట్లను తిరిగి లెక్కించాలని ఫిర్యాదుదారులు కోరితే.. ఈసీ ఆదేశాల మేరకు ఈవీఎంల డేటా తొలగించామని, వీవీ ప్యాట్లలో స్లిప్‌లను బర్న్ చేశామని అధికారులు చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినప్పుడు వాటిని భద్రపరచాల్సింది పోయి ఆగమేఘాలపై ఎందుకు ధ్వంసం చేశారంటే జవాబు లేదు.
మూడో రోజు
తాము ఫిర్యాదులో పేర్కొన్న మూడు పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నాడు చిత్రీకరించిన సీసీ కెమెరాల ఫుటేజీ, ఈవీఎంలను భద్రపరిచిన గోదాం వద్ద సీసీ కెమెరాల ఫుటేజీ, కౌంటింగ్ రోజు చిత్రీకరించిన సీసీ కెమెరాల ఫుటేజీ ఇవ్వాలని ఫిర్యాదుదారులు కోరితే... అబ్బే.. ఇప్పుడు ఇవ్వడం కుదరదు. సమయం పడుతుంది. అసలు ఇంకా పోలింగ్ కేంద్రాలన్నింటి సీసీ కెమెరాల ఫుటేజీని ఇంతవరకు ఒకచోట కూర్చలేదని అధికారులు చెబుతున్నారు.
మాక్ పోలింగ్‌తో ఏం ఉపయోగం?
విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎం గోదాంలో సోమవారం నుంచి బుధవారం వరకూ జరిగిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఫిర్యాదుదారుల సందేహాలను నివృత్తి చేయకుండానే అర్ధంతరంగా ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల (ఎస్‌వోపీ) ప్రకారం మాక్ పోలింగ్ మాత్రమే చేస్తామని అధికారులు మూడు రోజులుగా చెబుతూ వచ్చారు.
తమ సందేహాలను నివృత్తి చేయని మాక్ పోలింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఫిర్యాదుదారులైన విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అందుకు అంగీకరించలేదు. ఇది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రాతపూర్వకంగా బుధవారం ఎన్నికల కమిషన్‌కు తెలియజేశారు.
ఈవీఎంల గోదాం నుంచి ఫిర్యాదుదారుల ప్రతినిధి బెల్లాన వంశీ నిష్క్రమించడంతో మాక్ పోల్ కొనసాగించలేకపోయామని విజయనగరం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోకు నివేదిక పంపించినట్లు చెప్పారు.
సందేహాలకు సమాధానం శూన్యం
ఈవీఎంలపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వెరిఫికేషన్ ప్రక్రియ వాటిని నివృత్తి చేయకపోగా సరికొత్త అనుమానాలకు దారి తీసింది. ఈవీఎంల సేఫ్ ట్రంక్ బాక్స్ తాళం చెవి కనిపించలేదంటూ సోమవారం మూడు గంటలు ఆలస్యంగా వెరిఫికేషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
మాక్ పోలింగ్‌లో ఉపయోగించిన కొత్త బ్యాటరీ స్టేటస్ 80 శాతానికి తగ్గినప్పుడు మే 13వ తేదీ పోలింగ్ రోజున దాదాపు 12 గంటలు ఓటింగ్‌కు ఉపయోగించిన ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్ మాత్రం 21 రోజుల పాటు భద్రపరచిన తర్వాత కూడా 99 శాతం ఎందుకు చూపిస్తోందన్న ఫిర్యాదుదారుల ప్రశ్నకు ఈసీ వద్ద జవాబు లేదు. ఇక పోలింగ్ రోజు అన్ని సీసీ కెమెరాలను విజయనగరం కలెక్టరేట్‌లో ప్రత్యేక కేంద్రం నుంచి కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు.
ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినవి దాదాపుగా ప్రైవేట్ ఏజెన్సీలే. అలాంటప్పుడు ఇప్పటివరకూ వారి నుంచి ఫుటేజీని అధికారులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పనుల ఒత్తిడి వల్ల, సమయం లేక ఫుటేజీ కూర్పు చేపట్టలేకపోయామన్న అధికారుల వివరణ విచిత్రంగానూ, మరిన్ని అనుమానాలు రేకెత్తించేదిగా ఉందని ఫిర్యాదుదారుల ప్రతినిధి బెల్లాన వంశీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment