బండి నూకమ్మ అనారోగ్యంతో మంచం పట్టిన దృశ్యం (ఫైల్)
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ నగరపాలక సంస్థలో 30 ఏళ్ల పాటు పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసిన బండి చిననూకమ్మ అనే వృద్ధురాలు కాల్‌మనీ ముఠా వేధింపులు తాళలేక మనోవేదనతో సోమవారం రాత్రి మరణించింది. వివరాల్లోకి వెళితే.. వించిపేటకు చెందిన చిననూకమ్మ భర్త నాగరాజు ఆర్టీసీలో పనిచేసేవాడు. అతడు కాల్‌మనీ వ్యాపారి రాంపిల్ల పాపారావు నుంచి కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. 2017లో అతడు మరణించగా.. భర్త చేసిన అప్పును తాను తీరుస్తానంటూ కాల్‌మనీ వ్యాపారికి చిననూకమ్మ ప్రామిసరీ నోటు రాసిచ్చింది. ఆ తరువాత కొంతకాలానికి అప్పు మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించేసింది. అయితే, కాల్‌మనీ వ్యాపారి ఆ ప్రామిసరీ నోట్లను ఆమెకు తిరిగివ్వలేదు. ఇదిలావుంటే.. గత ఏడాది జూన్ 30వ తేదీన చిననూకమ్మ రిటైరైంది.
రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ కోసం ఆమె ఎదురు చూస్తుండగా.. కాల్‌మనీ వ్యాపారి రాంపిల్ల పాపారావు ముఠాకు చెందిన పలతోటి మరియరాజు (మంగళగిరి), జాదూ నాగేశ్వరి (గుణదల) రూ.14 లక్షలు చెల్లించాల్సిందిగా చిననూకమ్మకు లీగల్ నోటీసులు పంపించారు. ఆమెకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ కూడా తీసుకోనివ్వకుండా ఆమె బ్యాంక్ అకౌంట్‌ను గతేడాది ఆగస్టులో ఫ్రీజ్ చేయించారు. అప్పటినుంచి మనోవేదనతో మంచం పట్టిన చిననూకమ్మ సరైన వైద్యం చేయించుకోలేని స్థితిలో సోమవారం ప్రభుత్వాస్పత్రిలో చేరగా.. అదే రోజు రాత్రి మృతి చెందింది. ఈ విషయమై చిననూకమ్మ కుమారుడు వడ్డాది బోన మాట్లాడుతూ.. కాల్‌మనీ ముఠా వేధింపుల వల్లే తన తల్లి మంచం పట్టి మరణించిందని వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment