సాక్షి, చింతకొమ్మదిన్నె (కడప): కడప నగర శివార్లలోని రింగురోడ్డుపై ఉన్న పబ్బాపురం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప డీఎస్పీ బీవీ శివారెడ్డి తెలిపిన సమాచారం మేరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ప్రాజెక్టు డైరెక్టర్ రామమోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య నళిని దేవి, మెప్మా సీఈఓ సుబ్బారెడ్డి, డ్రైవర్ వెంకట రమణారెడ్డి, ఏఓ పి.సురేష్ రెడ్డిలు కడప నగరంలోని యర్రముక్కపల్లి నుంచి పులివెందులకు ఎతియోస్ కారులో వివాహ వేడుకకు బయలుదేరారు. పబ్బాపురం సమీపంలోని వంతెనపై ముందు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి లారీని కారుపైకి రానివ్వడంతో కారు వంతెనకు ఉన్న రక్షణ గోడల మధ్య ఇరుక్కుని ధ్వంసం అయింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు ఇరుక్కు పోవడంతో వారిని వెలికి తీసేందుకు పోలీసులతో పాటు, ఫైర్ సిబ్బంది, ఆ మార్గంలో వెళుతున్న ప్రయాణికులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నళిని దేవి(42) మృతి చెందారు. ఆమె అన్నమయ్య జిల్లా పీలేరులోని గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈమెకు భర్త రామమోహన్‌రెడ్డితో పాటు కుమారుడు ఉదయ్ కుమార్‌రెడ్డి, కుమార్తె మహిజలు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీకేదిన్నె ఎస్‌ఐ భూమా అరుణ్‌రెడ్డి తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని చింతకొమ్మదిన్నె, కడప తహసీల్దార్‌లు గంగయ్య, శివరామిరెడ్డిలు పరిశీలించారు.
భార్య చనిపోయిన విషయం తెలియకుండానే..
కడప కార్పొరేషన్:రామమోహన్‌రెడ్డి తలకు బలమైన గాయాలు కావడంతో పాటు, కుడికన్ను దెబ్బతిని మూసుకుపోయింది. కాలు కూడా విరిగింది. ప్రమాదంలో గాయపడిన ఆయనకు రిమ్స్‌లో ఎంఆర్‌ఐ స్కాన్ చేసి నడుం దగ్గర గాయాలు ఉండటంతో వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. భార్య నళిని మరణించిందనే విషయం తెలియకుండానే ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ సిటీ న్యూరో కేర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో మిగిలిన ముగ్గురిలో కారు డ్రైవర్ కె. వెంకట రమణారెడ్డి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇతనికి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతను కడప నగరం బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. సురేష్‌రెడ్డి, సుబ్బారెడ్డిలను తిరుపతి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
శ్రమించిన పోలీసులు, రెస్క్యూ టీం
ప్రమాద విషయాన్ని తెలుసుకున్న సీకేదిన్నె పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం లేకపోవడంతో, వెంటనే డీఎఫ్‌ఓ రాం ప్రకాష్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని హైడ్రాలిక్ యంత్రాలతో పాటు, జేసీబీని ఉపయోగించి కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు.
రిమ్స్‌లో మిన్నంటిన రోదనలు
కడప అర్బన్: రోడ్డు ప్రమాదంలో మెప్మా పీడీ రామ్మోహన్‌రెడ్డి సతీమణి నళినీదేవి మృతి చెందారన్న విషయం తెలుసుకుని వారి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, వేంపల్లి, చక్రాయపేట మండలాలకు చెందిన వారంతా తరలివచ్చారు. క్యాజువాలిటీ, మార్చురీ వద్ద వారి రోదనలు మిన్నంటాయి.
క్షతగాత్రులను పరామర్శించిన నగర పాలక కమిషనర్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెప్మా పీడీ రామమోహన్‌రెడ్డి, మెప్మా సీఈఓ సుబ్బారెడ్డి, డ్రైవర్ వెంకట రమణారెడ్డితో పాటు ఏఓ పి.సురేష్ రెడ్డిలను కడప నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ పరామర్శించారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన నళిని దేవి మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కొండావాండ్లపల్లెలో విషాద ఛాయలు
రామాపురం: కడప సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెప్మా పీడీ రామ్మోహన్ రెడ్డి సతీమణి నళినిదేవి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే కొండావాండ్లపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామం ఆమె పుట్టిన ఊరు కావడంతో పాటు లక్కిరెడ్డిపల్లె వెలుగు గురుకుల పాఠశాలలో సుదీర్ఘ కాలంపాటు ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఈ విధంగా ఆమె అందరికీ సుపరిచితురాలు కావడంతో ఆమె మరణ వార్త తెలియగానే విషాదంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment