
మదనపల్లె అగ్ని ప్రమాదం ఘటనలో ఏకపక్షంగా విచారణ
ఆగమేఘాలపై సోదాలు.. రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యం
రహస్యంగా విచారణ జరిగితే ఎల్లో మీడియాకు లీకులిచ్చిందెవరు?
సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు కాలిపోతే డిజిటల్ రికార్డులు ఉంటాయి కదా?
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటన అనంతరం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఫైళ్లు కాలిపోతే రెవెన్యూ కార్యాలయాల్లో డిజిటల్ రికార్డులు ఉంటాయి కదా? ఆర్డీవో, సీసీఎల్‌ఏ కార్యాలయాల్లో సంబంధిత రికార్డులు భద్రంగానే ఉంటాయి.
కనీసం ఫైళ్ల వెరిఫికేషన్ చేయకపోవడం.. ఉన్నతాధికారులను హుటాహుటిన హెలికాఫ్టర్‌లో పంపి అక్కడేదో జరిగిపోయిందనే అనుమానాలు రేకెత్తించడం.. అనుమానితుల పేరుతో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు, విచారణ పేరుతో బెదిరించడం.. ప్రజలను రెచ్చగొట్టడం.. పూర్తిగా ఓ వర్గం మీడియా డైరెక్షన్‌లో దర్యాప్తు సాగడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
» ఘటన జరిగిన మర్నాడే ఈనెల 22న సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్వయంగా డీజీపీ, సీఐడీ చీఫ్‌లు హెలికాప్టర్‌లో మదనపల్లె చేరుకుని విచారణ చేపట్టారు. కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య రహస్యంగా విచారణ చేపట్టినట్లు చెబుతున్నా ఆ వివరాలన్నీ ఎల్లో మీడియాకు లీక్ కావడం గమనార్హం. ఆ కథనాల ఆధారంగా దాడులు, విచారణలు సాగుతుండటంతో ఇక విచారణ ఎంత నిష్పాక్షపాతంగా సాగుతుందో ఊహించవచ్చు. డీజీపీ, సీఐడీ చీఫ్ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా మీడియాను అనుమతించని పోలీసులు టీడీపీ నేతల కార్లను మాత్రం సాదరంగా లోపలికి పంపారు. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు వారు వచ్చినట్లు స్పష్టమవుతోంది.
» విచారణ మొదలైన తొలిరోజు సాయంత్రం ఎల్లో మీడియాను మాత్రమే లోపలకు అనుమతించారు. అంతకుముందు టీడీపీ నేతలను లోపలకు పంపారు. వారితో ఉన్నతాధికారులు చర్చలు జరిపినట్లు చెబుతున్నారు.
» అటు వార్తలు.. ఆపై దాడులు
ఎల్లో మీడియాలో వైఎస్సార్ సీపీ నాయకుల గురించి వార్తలు రావడమే ఆలస్యం పోలీసులు దాడులు, తనిఖీలకు దిగుతున్నారు. ఈనెల 23న వైఎస్సార్‌సీపీకి చెందిన మాధవరెడ్డిపై ఈనాడులో వార్త రాగానే పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు జరిపారు. అదే పత్రికలో ఈనెల 25న వైఎస్సార్‌సీపీకి చెందిన మరోనాయకుడు బాబ్‌జాన్ గురించి కథనం ప్రచురించడంతో పోలీసులు ఆయన ఇంటిపై దాడులకు దిగి అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. మాజీ ఎమ్మెల్యేను విచారణకు పిలిచే అవకాశం ఉందంటూ 28న పరోక్షంగా నవాజ్ బాషానుద్దేశించి కథనాన్ని వెలువరించడంతో ఉదయమే పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. సాయంత్రం వరకు తనిఖీల పేరుతో హడావుడి సృష్టించారు.
» శనివారం మదనపల్లె మున్సిపల్ వైస్‌చైర్మన్ జింకా వెంకటా చలపతి ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి తర్వాత వదిలేశారు. మరో నాయకుడు బండపల్లి అక్కులప్ప విచారణ హాజరు కాగా ఎల్లో మీడియాలో హంగామా సృష్టించారు.
ఎలాంటి తప్పు చేయలేదు – మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా
ఐదేళ్ల పదవీకాలంలో ఎక్కడా కబ్జాలు, అవినీతికి పాల్పడలేదని, ఎలాంటి తప్పు చేయలేదని మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా స్పష్టం చేశారు. శనివారం రాత్రి తాను బెంగళూరులో ఉన్న సమయంలో 22(ఏ) నిషేధిత భూముల బదలాయింపులకు సంబంధించిన ఆరోపణలపై తన నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నట్లు పోలీసులు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. తాను ఆదివారం ఉదయం వస్తున్నట్లు చెప్పి తనిఖీలకు సహకరించినట్లు తెలిపారు. రెవెన్యూ, ప్రభుత్వ శాఖల్లో అవినీతికి తావు లేకుండా వైఎస్సార్ సీపీ హయాంలో పారదర్శక పాలన అందించినట్లు గుర్తు చేశారు. ఎక్కడా తలదించుకునేలా వ్యవహరించలేదన్నారు.
పెద్దిరెడ్డి పీఏ ఇంట్లో సోదాలు
టాస్క్‌ఫోర్స్: మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్న పోలీసులు ఆదివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ నివాసంలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో పది మంది పోలీసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment