భోగాపురం పనులు ‘టేకాఫ్‌’ | Ongoing Bhogapuram airport construction works | Sakshi
Sakshi News home page

భోగాపురం పనులు ‘టేకాఫ్‌’

Published Sun, Oct 22 2023 5:06 AM | Last Updated on Sun, Oct 22 2023 7:49 AM

Ongoing Bhogapuram airport construction works - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చుక్కాని అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ఏడాది మే 3న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 5,000 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. 2025 నాటికల్లా ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలిదశ పూర్తి చేయాలనేది లక్ష్యం.

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఈ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. నిర్వాసితుల పునరావాసం, పరిహారం సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించింది. దీంతో నిర్మాణ సంస్థ పూర్తిస్థాయిలో పనులు మొదలుపెట్టింది. తొలుత విమానాశ్రయ భూమి చుట్టూ భారీ ప్రహారీ నిర్మాణ పనులను చేపట్టింది. పటిష్టమైన స్తంభాలను నిర్మించి దానిపై పలకలతో దాదాపు పది అడుగుల ఎత్తున ఈ ప్రహరీ ఉంది. దానిపై ఇనుప ముళ్లతో కూడిన కంచెను ఏర్పాటు చేయనున్నారు.  

పటిష్టంగా పొడవైన రన్‌వే.. 
కీలకమైన రన్‌వే నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించడానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున పటిష్టంగా దీన్ని నిర్మించాల్సి ఉంది. భూమి అంతా ఒక క్రమంలో లేకపోవడంతో తొలుత సగటున 10 అడుగుల ఎత్తున మట్టితో చదును చేయడానికి సిద్ధం అవుతున్నారు.  

నేరుగా రోడ్డు అనుసంధానం... 
చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిపై ఇటు విశాఖపట్నం నుంచి, అటు శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లేలా అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారిని కలిపేందుకు ఎనిమిది సంఖ్య ఆకారంలో ట్రంపెట్‌ నిర్మాణం చేపడుతున్నారు. దీనికోసం 25 ఎకరాల భూసేకరణను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ. 18 కోట్లు పరిహారం చెల్లించింది. ఇక విమానాశ్రయానికి ప్రత్యేకంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి భోగాపురం మండలంలోని ముక్కాం పంచాయతీలో 5.47 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
 
సమీపంలోనే స్టాఫ్‌ క్వార్టర్లు... 
విమానాశ్రయంలో వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా స్టాఫ్‌ క్వార్టర్లను జీఎంఆర్‌ సంస్థ నిర్మించనుంది. ఆ సంస్థ వినతి మేరకు ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో 20 ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి జాతీయ రహదారి నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.  

అన్ని అడ్డంకులను అధిగమించి... 
విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూమి అంతా నిర్మాణ సంస్థకు అప్పగించాం. సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసులన్నింటిలో ప్రభు­త్వం విజయం సాధించింది. కొంతమంది రైతులకు సంబంధించిన పరిహారం కోర్టు­లో జమచేసింది. నాలుగు గ్రామాల నిర్వాసితులకు దాదాపు రూ. 80 కోట్ల వ్యయంతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో పునరావాస కాలనీలను నిర్మించింది. అక్కడ అన్ని మౌలిక వసతులు కల్పించాం. విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. – చింతా బంగార్రాజు,  భోగాపురం తహసీల్దార్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement