Bhogapuram International Airport
-
భోగాపురం పనులు ‘టేకాఫ్’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చుక్కాని అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ఏడాది మే 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 5,000 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. 2025 నాటికల్లా ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలిదశ పూర్తి చేయాలనేది లక్ష్యం. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఈ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. నిర్వాసితుల పునరావాసం, పరిహారం సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించింది. దీంతో నిర్మాణ సంస్థ పూర్తిస్థాయిలో పనులు మొదలుపెట్టింది. తొలుత విమానాశ్రయ భూమి చుట్టూ భారీ ప్రహారీ నిర్మాణ పనులను చేపట్టింది. పటిష్టమైన స్తంభాలను నిర్మించి దానిపై పలకలతో దాదాపు పది అడుగుల ఎత్తున ఈ ప్రహరీ ఉంది. దానిపై ఇనుప ముళ్లతో కూడిన కంచెను ఏర్పాటు చేయనున్నారు. పటిష్టంగా పొడవైన రన్‌వే.. కీలకమైన రన్‌వే నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించడానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున పటిష్టంగా దీన్ని నిర్మించాల్సి ఉంది. భూమి అంతా ఒక క్రమంలో లేకపోవడంతో తొలుత సగటున 10 అడుగుల ఎత్తున మట్టితో చదును చేయడానికి సిద్ధం అవుతున్నారు. నేరుగా రోడ్డు అనుసంధానం... చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిపై ఇటు విశాఖపట్నం నుంచి, అటు శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లేలా అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారిని కలిపేందుకు ఎనిమిది సంఖ్య ఆకారంలో ట్రంపెట్ నిర్మాణం చేపడుతున్నారు. దీనికోసం 25 ఎకరాల భూసేకరణను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ. 18 కోట్లు పరిహారం చెల్లించింది. ఇక విమానాశ్రయానికి ప్రత్యేకంగా విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి భోగాపురం మండలంలోని ముక్కాం పంచాయతీలో 5.47 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. సమీపంలోనే స్టాఫ్ క్వార్టర్లు... విమానాశ్రయంలో వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా స్టాఫ్ క్వార్టర్లను జీఎంఆర్ సంస్థ నిర్మించనుంది. ఆ సంస్థ వినతి మేరకు ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో 20 ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి జాతీయ రహదారి నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని అడ్డంకులను అధిగమించి... విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూమి అంతా నిర్మాణ సంస్థకు అప్పగించాం. సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులన్నింటిలో ప్రభుత్వం విజయం సాధించింది. కొంతమంది రైతులకు సంబంధించిన పరిహారం కోర్టులో జమచేసింది. నాలుగు గ్రామాల నిర్వాసితులకు దాదాపు రూ. 80 కోట్ల వ్యయంతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస కాలనీలను నిర్మించింది. అక్కడ అన్ని మౌలిక వసతులు కల్పించాం. విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. – చింతా బంగార్రాజు, భోగాపురం తహసీల్దార్ -
ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ నమూనాను పరిశీలించిన సీఎం జగన్
-
భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
-
ఉత్తరాంధ్రకు సీఎం జగన్ నాలుగు వరాలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం భూమి పూజ చేయనున్నారు. దీంతోపాటు విజయనగరం జిల్లాలో మరో రెండు కీలక ప్రాజెక్టులతోపాటు విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్ నిర్మించే వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్‌కు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నాయి. రూ.4,592 కోట్లతో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం కానుండగా ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్ టెక్ పార్కు రూపుదిద్దుకోనుంది. ముఖ్యమంత్రి జగన్ నేడు విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించి పలు కార్యక్రమాలకు శంకుస్థాపనతోపాటు భోగాపురం మండలం సవరవిల్లి వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భోగాపురం మండలంలోని ఎ.రావివలస వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను, సవరవిల్లి వద్ద బహిరంగ సభ వేదికను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, కలెక్టర్ నాగలక్ష్మి, డీఐజీ హరికృష్ణ, ఎస్పీ దీపిక తదితరులు మంగళవారం పరిశీలించారు. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం విశాఖ ఎయిర్‌పోర్టుకి ప్రత్యామ్నాయంగా అత్యాధునిక సౌకర్యాలతో భోగాపురం మండలంలో 36 నెలల్లో నిర్మించే అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి జగన్ భూమిపూజ చేస్తారు. దాదాపు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీన్ని నిర్మిస్తోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పాటు దేశీయ, అంతర్జాతీయ రవాణాకు దోహదపడేలా కార్గో టెర్మినల్ ఇక్కడి ప్రత్యేకత. తొలి దశ నిర్మాణమే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. అనంతరం ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశలవారీగా సౌకర్యాలను విస్తరిస్తారు. రూ.21,844 కోట్లతో వైజాగ్ టెక్‌పార్క్ అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో రూ.14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్ ఏర్పాటు కానుంది. త్వరలో రూ.7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లను అభివృద్ధి చేస్తారు. తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, మరో 10,610 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు జలయజ్ఞంలో భాగంగా విజయనగరం జిల్లాలో 24,710 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చంపావతి నదిపై 2005 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాంది పలికారు. ఆయన హఠాన్మరణంతో ఈ ప్రాజెక్టు పనులు మందగించాయి. పెండింగ్ పనులను రూ.194.90 కోట్లతో పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు తాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీటితో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన నీటిని అందించడం లక్ష్యంగా తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ చేపట్టారు. 2024 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తూ పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ.23.73 కోట్ల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం కానుంది. అన్ని కాలాల్లో సముద్రంలో చేపలు వేటాడేందుకు వెసులుబాటు కలగనుంది. తుపాన్లు, విపత్తుల సమయాల్లో సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు, అలల తాకిడికి పడవలు దెబ్బ తినకుండా లంగర్ వేసే సదుపాయం ఉంటుంది. తద్వారా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు. ‘భోగాపురం’ ప్రత్యేకతలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూసేకరణ, టెండర్ ప్రక్రియను పూర్తి చేసి ఎన్వోసీ, అనుమతులు సాధించింది. ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయ వివాదాలను పరిష్కరించడం ద్వారా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. దీన్ని పీపీపీ విధానంలో నిర్మించేలా జీఎంఆర్ గ్రూప్‌తో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడిసీఎల్) ఒప్పందం చేసుకుంది. అత్యంత ఆధునికంగా ట్రంపెట్ నిర్మాణం ద్వారా ఇటు విశాఖ అటు శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయ టెర్మినల్‌కు చేరుకునేలా అనుసంధానించనున్నారు. అంతర్జాతీయ ఎగ్జిట్ గేట్‌వే ఏర్పాటుకు వీలుగా కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్తోపాటు తొలిదశలో 5,000 చ.మీ విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రన్‌వే, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ధి ప్లాంట్ దీని ప్రత్యేకతలు. 16వ నెంబర్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం, కమర్షియల్ డెవలప్మెంట్ ఏరియా, కమర్షియల్ అప్రోచ్ రోడ్, సోలార్ ప్యానెల్స్ ఏరియా, ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ సౌకర్యాలున్నాయి. విశాఖ–భోగాపురం మధ్య రూ.6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మాణం కానుంది. రెండువైపులా సర్వీసు రోడ్లు ఉంటాయి. ఎయిర్‌పోర్టు నిర్మాణ సమయంలో 5 వేల మందికి, సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి దక్కుతుంది. పర్యాటక అభివృద్ధి, ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. విమానాశ్రయం కోసం స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసిన నాలుగు గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు రూ.77 కోట్లతో పునరావాసం కల్పించారు. సీఎం జగన్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ఇప్పటికే వసతి కూడా కల్పించింది. అదానీ డేటా సెంటర్‌తో ఐటీ బూమ్ డేటా హబ్‌తో డేటా స్పీడ్ గణనీయంగా పెరగనుంది. సింగపూర్ – విశాఖ వరకు సముద్ర సబ్‌మెరైన్ కేబుల్ ఏర్పాటు ద్వారా ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ ఐదు రెట్లు పెరుగుతుంది. తద్వారా భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో మరిన్ని ఐటీ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఐటీ, ఐటీ అనుబంధ సేవల్లో వృద్ధి నమోదు కానుంది. భారీ స్ధాయిలో హైటెక్ ఉద్యోగాల కల్పనకు సానుకూల వాతావరణం నెలకొంటుంది. విశ్వసనీయమైన డేటా భద్రతతోపాటు సేవల ఖర్చుల్లో తగ్గుదల ఉంటుంది. అధునాతన టెక్ కంపెనీలు విశాఖను ఎంచుకోవడం ద్వారా ఐటీ రంగంలో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోనున్నాయి. డేటా సెంటర్‌కు అనుబంధంగా ఏర్పాటు కానున్న స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ సెంటర్ల ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు చేపట్టారు. బిజినెస్ పార్క్ రిక్రియేషన్ సెంటర్ల ద్వారా ఉద్యోగుల జీవన శైలి మారనుంది. -
అల భోగాపురంలో... నాడు నా(రా)టకం.. నేడు జగ‘నిజం’
2023 మే 3: వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కార్యరూపం తీసుకొచ్చేందుకు నడుంబిగించారు. దీనికోసం త్రిముఖ వ్యూహం అనుసరించారు. ఇక్కడ 2,751 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయించారు. మరోవైపు రైతులకు తగిన నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం విషయంలో తన ఉదారతను చాటుతూ వారిని ఒప్పించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లన్నీ పరిష్కారమయ్యేలా చొరవ చూపించారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను తరచుగా సంప్రదిస్తూ విమానాశ్రయానికి అవసరమైన అనుమతులన్నీ సాధించారు. అలా అడ్డంకులన్నీ అధిగమించడానికి, అనుమతులన్నీ తేవడానికి నాలుగేళ్ల కాలం పట్టింది. ఇక మార్గం సుగమమైన నేపథ్యంలో రానున్న రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేసి, మూడో ఏట పూర్తిస్థాయిలో విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను నిర్వహించాలనేది లక్ష్యం. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ మరుక్షణమే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు జీఎంఆర్ సిద్ధంగా ఉంది. ఉమ్మడి విజయనగరం జిల్లా సహా ఉత్తరాంధ్ర దశాదిశా మార్చేసే, రాష్ట్రంలో బహుముఖ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు దోహదం చేసే భోగాపురం విమానాశ్రయ ఊహాచిత్రం ఇది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల పాలనాకాలంలో చేసిదేమిటో, ఈ నాలుగేళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సాధించిందేమిటో రికార్డు ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రజల దృష్టిని మరల్చేందుకు టీడీపీ నాయకులు నానా పాట్లు పడుతున్నారు. కనీసం ఏ భూమిలో వేస్తున్నామో చూడకుండా శిలాఫలకం వేసేసి టెంకాయ కొట్టే మ మ అనిపించిన చంద్రబాబుదే ఘనత అంటూ డ బ్బా కొట్టుకోవడం వారికే చెల్లిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుత విశాఖ విమా నాశ్రయాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పు చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో భోగాపురం వద్ద విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదన 2015 సంవత్సరంలో తెరపైకి వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వం భూసేకరణకు బీజం వేసింది. 15 వేల ఎకరాలు సేకరిస్తామనడంతో భోగాపురం మండల రైతులు ఆందోళనలకు దిగారు. దీంతో ఐదు వేల ఎకరాలకు దిగొచ్చింది. పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ప్రకటించడం, అసైన్డ్ భూములకు విస్మరించడంతో 2015 ఆగస్టులో రైతులు రోడ్డెక్కారు. అడ్డదిడ్డంగా తలపెట్టిన భూసేకరణను సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఏమీ పూర్తి చేయలేదు. ఏదిఏమైనా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత తనదేనని చాటుకోవాలని ప్రచారయావతో చంద్రబాబు 2019 ఫిబ్రవరి 14వ తేదీన హడావుడిగా శంకుస్థాపన చేయడం అప్పట్లో విమర్శలకు దారితీసింది. ఫలించిన జగన్మోహన్రెడ్డి శ్రమ... విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఢిల్లీ స్థాయి లో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని నిర్ణయించారు. పరిహారా న్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ అందించారు. అసైన్డ్ భూములకు కూడా జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డకొండ అప్పలనాయుడు, భోగాపురం మండల నాయకుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి తదితరు లు జరిపిన చర్చలతో చాలామంది రైతులు సానుకూలంగా స్పందించారు. కోర్టుల్లో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ పరిష్కరించాయి. నిర్వాసితులైన నాలుగు గ్రామాల్లోని 404 కుటుంబాలకు అత్యుత్తమమైన పునరావాసప్యాకేజీ ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను వారికోసం నిర్మించింది. అత్యాధునికంగా నిర్మాణం... దాదాపు రూ.790 కోట్ల ఖర్చుతో సేకరించిన 2,750 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు బదలాయించింది. అందులో విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 2,203 ఎకరాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. రాజాం ప్రాంత వాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావుకు చెందిన జీఎంఆర్ గ్రూప్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేయనున్నారు. -
భోగాపురం ఎయిర్‌పోర్టుకు త్వరలో శంకుస్థాపన
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన కేసులను హైకోర్టు కొట్టేయడంతో త్వరలో శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టడానికి ఏపీ ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ప్రణాళికలు సిద్ధంచేసింది. ఈనెల 12న విశాఖ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభానికి ప్రధాని మోదీ విశాఖ వస్తున్న తరుణంలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులకు కూడా శంకుస్థాపన చేయించాలని ఏపీఏడీసీఎల్ యోచిస్తోంది. ప్రధాని యాత్రకు సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్ ఇంకా ఖరారు కానందున.. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా షెడ్యూల్లో చేర్చాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరనున్నట్లు ఏపీఏడీసీఎల్ ఎండీ భరత్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. రూ.2,300 కోట్లతో నిర్మాణం విశాఖకు సమీపంలో విజయనగరం జిల్లా భోగాపురం వద్ద 2,203 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధంచేసింది. సుమారు రూ.2,300 కోట్లతో ఎయిర్‌పోర్టు నిర్మాణ కాంట్రాక్టును జీఎంఆర్ సంస్థ చేజిక్కించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదిరింది. పనులు ప్రారంభించడానికి ఇంతకాలం కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం గట్టిగా వాదించడం ద్వారా అనుకూలమైన తీర్పు రావడంతో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ అధికారులు తెలిపారు. అలాగే, మూడేళ్లలో పనులు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ రెండున్నర ఏళ్లల్లోనే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారు తెలిపారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణం ఇక భోగాపురం తొలిదశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణించేలా ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి ఏటా సగటున 28 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వాస్తవంగా విశాఖ నుంచి ఇంకా ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత ఎయిర్‌పోర్టు భారత నావికాదళానికి సంబంధించినది కావడంతో విమాన రాకపోకలపై అనేక ఆంక్షలున్నాయి. అదే భోగాపురంలో విమానాశ్రయం వస్తే 24 గంటలూ సర్వీసులు నడిపే అవకాశముంటుంది. ఇక విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రస్తుతం ఏటా 4,400 టన్నుల సరుకు రవాణా జరుగుతుండగా కొత్త విమానాశ్రయం వస్తే ఇది భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు.. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖలోని విమానాశ్రయం మూసివేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇప్పటికే నిరభ్యంతర సర్టిఫికెట్‌ను కూడా ఇచ్చింది. అప్పట్లో టీడీపీ తీరుతో రోడ్డెక్కిన రైతులు గత టీడీపీ ప్రభుత్వంలో తొలుత 15 వేల ఎకరాలు అవసరమని ఆ పార్టీ నేతలు నాయకులు ప్రకటనలు చేయడంతో భోగాపురం మండల రైతులు తీవ్ర ఆందోళనలకు దిగారు. దీంతో ఐదువేల ఎకరాలతో సరిపెట్టాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ 2015 ఆగస్టులో రైతులు రోడ్డెక్కారు. నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. న్యాయస్థానంలో విచారణ పెండింగ్‌లో ఉండగానే 2019 సాధారణ ఎన్నికలు సమీపించాయి. మరోవైపు.. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఏమీ పూర్తిచేయలేదు. కానీ, ఎన్నికలకు రెండునెలల ముందు ఫిబ్రవరి 14న ఎలాంటి అనుమతులు లేకుండానే హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఇప్పుడు రెట్టింపు పైగా పరిహారం కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్ విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ అదే సమయంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. భూమి పరిస్థితిని బట్టి పరిహారాన్ని ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు ప్రకటించారు. అంతకుముందు డి.పట్టా భూములకు టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం రూ.12.50 లక్షలు మాత్రమే. అలాకాకుండా వారికీ జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. దీంతో చాలామంది హైకోర్టులో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగతా వాటినీ శుక్రవారం హైకోర్టు పరిష్కరించింది. సంబంధిత రైతులకు పరిహారం ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ మేరకు ఆ మొత్తాన్ని చెల్లించడానికి జిల్లా కలెక్టరు ఎ. సూర్యకుమారి తదితర అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేస్తోంది. మరోవైపు.. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. అలాగే, విమానాశ్రయ పరిధిలోనే గత టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడా వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ పూర్తయ్యింది. జాతీయ రహదారి నుంచి అనుసంధాన రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో వంతెన నిర్మాణానికి అవసరమైన 119 ఎకరాల సేకరణ రెండో దశ నోటిఫికేషన్‌తో కొలిక్కి వచ్చింది. నిర్వాసితులకు టౌన్‌షిప్‌లను తలదన్నే కాలనీలు ఇక ఇళ్లు కోల్పోయిన 376 కుటుంబాల కోసం రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను ప్రభుత్వం నిర్మిస్తోంది. అంతేకాక.. ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా ఐదు సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల చొప్పున పునరావాస పరిహారాన్ని ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేసింది. చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? -
భోగాపురానికి విశాఖ ఎయిర్‌పోర్టు
సాక్షి, విశాఖపట్నం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమయ్యాక విశాఖలోని ప్రస్తుత విమానాశ్రయాన్ని అక్కడకు తరలిస్తామని రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి తెలిపారు. ఎయిర్‌పోర్టును తరలించిన అనంతరం ఆ స్థలాన్ని తిరిగి రక్షణ శాఖకు అప్పగిస్తామన్నారు. ఆదివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉందన్నారు. విశాఖ పోర్టు ట్రస్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ ఆరు వరుసల రహదారి నిర్మాణానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. సీ పోర్టు నుంచి భీమిలి వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలోనూ, భీమిలి నుంచి భోగాపురం వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) పర్యవేక్షణలో రహదారి నిర్మాణం చేపడతామన్నారు. రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వ భూముల్నే ఎక్కువగా వినియోగించుకుంటామని.. అవసరమైతే తప్ప ప్రైవేట్ భూములు సేకరించకూడదని భావిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో గరిష్ట వేగం తగ్గేలా నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇక నగర పరిధిలో 70 మీటర్లు, నగరం దాటిన తర్వాత 70కి పైగా రహదారి వెడల్పు ఉంటుందని వివరించారు. రహదారి నిర్మాణంలో భాగంగా వాకింగ్, సైకిల్ ట్రాక్ కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు. న్యాయస్థానంలో కేసులు కొలిక్కి రాగానే ఎయిర్‌పోర్టు, రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. -
భోగాపురంలో భారీ స్కామ్‌కు స్కెచ్
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్కామ్‌కు చంద్రబాబు స్కెచ్ వేశారు. విమానాశ్రయ ప్రకటన చేసినప్పటి నుంచీ ముడుపుల కోసం అనేక జిమ్మిక్కులు చేస్తూ వచ్చిన చంద్రబాబు.. చివరికి ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే తన ప్రణాళికను అధికారుల ద్వారా అమలు చేయించారు. తద్వారా చంద్రబాబు జేబులోకి కోట్ల రూపాయలు వెళ్లనున్నాయని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తొలుత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఆహ్వానించిన టెండర్లలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎల్–1గా, జీఎంఆర్ ఎల్–2గా వచ్చిన విషయం తెలిసిందే. 30.2 శాతం రెవెన్యూ వాటా, ఎకరానికి ఏడాదికి లైసెన్స్ ఫీజు కింద 20 వేల రూపాయలు, ప్రతీ ఏడాది లైసెన్స్ ఫీజు మొత్తం ఆరు శాతం పెంచడంతోపాటు 26 శాతం ఈక్విటీ ఇస్తామని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. జీఎంఆర్ కేవలం 21.6 శాతమే రెవెన్యూ వాటా ఇస్తామని తెలిపింది. దీంతో అధికారులందరూ ఎయిర్ పోర్ట్ అధారిటీ ఇండియాకు టెండర్‌ను అప్పగించాల్సిందిగా సిఫార్సు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ముడుపులు అందే అవకాశం లేకపోవడంతో చంద్రబాబు పట్టుపట్టి మరీ టెండర్‌ను రద్దు చేయించారు. అదనపు పనుల పేరుతో మళ్లీ టెండర్లు ఆహ్వానించి.. ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా పాల్గొనకుండా జీఎంఆర్‌కు అనుకూలంగా నిబంధనలు రూపొందించారు. ఈ టెండర్లలో డీవోఐటీ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వీవీకే ఎయిర్ పోర్ట్ లిమిటెడ్, జీఎంఆర్ సంస్థలు పాల్గొన్నాయి. నిబంధనల్లో తొలుత రెవెన్యూ వాటా ఎంత ఇస్తారనేది పేర్కొనగా తరువాత పిలిచిన టెండర్లో విమాన టికెట్లో వాటా ఎంత ఇస్తారంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా భూమిని లైసెన్స్‌కు బదులు లీజుకు ఇవ్వాలని, విమానాశ్రయం కమర్షియల్ ఆపరేషన్‌లో వచ్చిన తరువాత పదో సంవత్సరం నుంచి టికెట్ ఫీజు చెల్లించాలనే నిబంధనలు రూపొందించారు. టికెట్ ఫీజు బెంచ్ మార్క్‌గా 209 రూపాయలనే టెండర్ నిబంధనల్లో పెట్టారు. దీనిపై జీఎంఆర్ టికెట్ ఫీజుగా 303 రూపాయలు, డీవోఐటీ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్ 261 రూపాయలు, వీవీకే 207 రూపాయలను కోట్ చేశాయి. ఎన్నికల కోడ్‌లో కథ నడిపిన చంద్రబాబు మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత అధికారులతో సీఎం చంద్రబాబు భోగాపురం ఫైలును నడిపించారు. మార్చి 15వ తేదీన అధికారులతో కూడిన సాధికార కమిటీ సమావేశమై బిడ్స్‌ను ఖరారు చేసింది. దాని ప్రకారం.. మూడు దశల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. తొలుత 2,703 ఎకరాల్లో రూ. 2,302.51 కోట్లతో నిర్మాణం చేపడతారు. ఈ భూమిని 99 సంవత్సరాలకు ఎకరానికి రూపాయి లీజుకు అప్పగిస్తారు. ఈ భూమిని తాకట్టు పెట్టి జీఎంఆర్ సంస్థ పెట్టుబడిని సమీకరించనుంది. ఈ భూమి కాకుండా అదనంగా వాణిజ్య అవసరాలకు 793 ఎకరాలను, రెసిడెన్షియల్ అవసరాల కోసం 139 ఎకరాలను జీఎంఆర్‌కు ప్రభుత్వం అప్పగించనుంది. ఈ భూమి అభివృద్ధి చేయడానికి రూ. 134 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. టికెట్ ఫీజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 303 రూపాయలు 2033 సంవత్సరం నుంచి ఇస్తారు. వీటిపై ఆర్థిక శాఖ, న్యాయ శాఖలు పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ సాధికార కమిటీ ఆమోదం తెలిపింది. సాధికార కమిటీని ప్రశ్నించిన ఆర్థిక శాఖ టెండర్ నిబంధనల్లో మార్పులపై ఆర్థిక శాఖ సాధికార కమిటీని నిలదీసింది. ‘ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తానన్న రెవెన్యూ వాటాతో పోల్చితే ఇప్పుడు జీఎంఆర్ ఇస్తానన్న టికెట్ ఫీజు అనేది నామమాత్రమే. అలాంటప్పుడు రెవెన్యూ వాటా నిబంధన మార్చేసి టికెట్ ఫీజు ఎందుకు పెట్టారు? టికెట్ బెంచ్ మార్క్ రూ.209గా నిర్ధారించడం వాస్తవికంగా లేదు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకున్నారా లేదా?. విశాఖ నావెల్ ఎయిర్ పోర్ట్ మూసేయకుండా అంతర్జాతీయ విమానాశ్రయం లాభదాయకం కాదు. ఇందుకు అనుమతి తీసుకున్నారా?. భూమి లైసెన్స్‌కు బదులు లీజుకు ఇవ్వాలని ఏ ప్రాతిపదికన నిబంధనలు మార్చారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే టెండర్ నిబంధనల్లో పలు ఉల్లంఘనలున్నాయని, వీటిని సాధికార కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ నుంచి ఇటీవలే సంబంధిత ఫైలు ఇంధన, ఎయిర్పోర్ట్, మౌలిక సదుపాయాల శాఖకు చేరింది. ఎలాగైనా అధికారులపై ఒత్తిడి తెచ్చి భోగాపురం విమానాశ్రయం టెండర్‌ను జీఎంఆర్‌కు అప్పగింపచేయాలని సీఎం యత్నిస్తున్నట్టు అధికార వర్గాలంటున్నాయి. -
భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతి
సాక్షి బిజినెస్ బ్యూరో, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపాదిత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతి లభించింది.కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఈ మేరకు అనుమతిని మంజూరు చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో లేవనెత్తిన అంశాలకు ప్రాజెక్టు అథారిటీ సంతృప్తికరంగా స్పందించినట్టు ఈఏసీ తెలిపింది. తుది ఈఐఏ, ఈఎంపీ నివేదికలో ఈ అంశాలను పొందుపరచాలని సూచించినట్టు పేర్కొంది. విశాఖ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రూ.2,260.73 కోట్ల వ్యయంతో పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ప్రతిపాదనలు తొలి దశకు సంబంధించినవి. వచ్చే కొన్ని సంవత్సరాల్లో విశాఖ విమానాశ్రయంలో ట్రాఫిక్ గరిష్ట స్థాయికి చేరనున్న నేపథ్యంలో దాన్ని భోగాపురం విమానాశ్రయం తగ్గించనుందని ఈఏసీ పేర్కొంది.