భోగాపురంలో భారీ స్కామ్‌కు స్కెచ్‌ | Sketch for a huge scam in Bhogapuram Airport | Sakshi
Sakshi News home page

భోగాపురంలో భారీ స్కామ్‌కు స్కెచ్‌

Published Tue, May 21 2019 3:54 AM | Last Updated on Tue, May 21 2019 5:06 AM

Sketch for a huge scam in Bhogapuram Airport - Sakshi

సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్కామ్‌కు చంద్రబాబు స్కెచ్‌ వేశారు. విమానాశ్రయ ప్రకటన చేసినప్పటి నుంచీ ముడుపుల కోసం అనేక జిమ్మిక్కులు చేస్తూ వచ్చిన చంద్రబాబు.. చివరికి ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగానే తన ప్రణాళికను అధికారుల ద్వారా అమలు చేయించారు. తద్వారా చంద్రబాబు జేబులోకి కోట్ల రూపాయలు వెళ్లనున్నాయని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తొలుత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఆహ్వానించిన టెండర్లలో ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఎల్‌–1గా, జీఎంఆర్‌ ఎల్‌–2గా వచ్చిన విషయం తెలిసిందే. 30.2 శాతం రెవెన్యూ వాటా, ఎకరానికి ఏడాదికి లైసెన్స్‌ ఫీజు కింద 20 వేల రూపాయలు, ప్రతీ ఏడాది లైసెన్స్‌ ఫీజు మొత్తం ఆరు శాతం పెంచడంతోపాటు 26 శాతం ఈక్విటీ ఇస్తామని ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

జీఎంఆర్‌ కేవలం 21.6 శాతమే రెవెన్యూ వాటా ఇస్తామని తెలిపింది. దీంతో అధికారులందరూ ఎయిర్‌ పోర్ట్‌ అధారిటీ ఇండియాకు టెండర్‌ను అప్పగించాల్సిందిగా సిఫార్సు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ముడుపులు అందే అవకాశం లేకపోవడంతో చంద్రబాబు పట్టుపట్టి మరీ టెండర్‌ను రద్దు చేయించారు. అదనపు పనుల పేరుతో మళ్లీ టెండర్లు ఆహ్వానించి.. ఎయిర్‌ పోర్ట్‌ ఆఫ్‌ ఇండియా పాల్గొనకుండా జీఎంఆర్‌కు అనుకూలంగా నిబంధనలు రూపొందించారు. ఈ టెండర్లలో డీవోఐటీ స్మార్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, వీవీకే ఎయిర్‌ పోర్ట్‌ లిమిటెడ్, జీఎంఆర్‌ సంస్థలు పాల్గొన్నాయి. నిబంధనల్లో తొలుత రెవెన్యూ వాటా ఎంత ఇస్తారనేది పేర్కొనగా తరువాత పిలిచిన టెండర్‌లో విమాన టికెట్‌లో వాటా ఎంత ఇస్తారంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా భూమిని లైసెన్స్‌కు బదులు లీజుకు ఇవ్వాలని, విమానాశ్రయం కమర్షియల్‌ ఆపరేషన్‌లో వచ్చిన తరువాత పదో సంవత్సరం నుంచి టికెట్‌ ఫీజు చెల్లించాలనే నిబంధనలు రూపొందించారు. టికెట్‌ ఫీజు బెంచ్‌ మార్క్‌గా 209 రూపాయలనే టెండర్‌ నిబంధనల్లో పెట్టారు. దీనిపై జీఎంఆర్‌ టికెట్‌ ఫీజుగా 303 రూపాయలు, డీవోఐటీ స్మార్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియా లిమిటెడ్‌ 261 రూపాయలు, వీవీకే 207 రూపాయలను కోట్‌ చేశాయి. 

ఎన్నికల కోడ్‌లో కథ నడిపిన చంద్రబాబు 
మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తరువాత అధికారులతో సీఎం చంద్రబాబు భోగాపురం ఫైలును నడిపించారు. మార్చి 15వ తేదీన అధికారులతో కూడిన సాధికార కమిటీ సమావేశమై బిడ్స్‌ను ఖరారు చేసింది. దాని ప్రకారం.. మూడు దశల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. తొలుత 2,703 ఎకరాల్లో రూ. 2,302.51 కోట్లతో నిర్మాణం చేపడతారు. ఈ భూమిని 99 సంవత్సరాలకు ఎకరానికి రూపాయి లీజుకు అప్పగిస్తారు. ఈ భూమిని తాకట్టు పెట్టి జీఎంఆర్‌ సంస్థ పెట్టుబడిని సమీకరించనుంది. ఈ భూమి కాకుండా అదనంగా వాణిజ్య అవసరాలకు 793 ఎకరాలను, రెసిడెన్షియల్‌ అవసరాల కోసం 139 ఎకరాలను జీఎంఆర్‌కు ప్రభుత్వం అప్పగించనుంది. ఈ భూమి అభివృద్ధి చేయడానికి రూ. 134 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. టికెట్‌ ఫీజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 303 రూపాయలు 2033 సంవత్సరం నుంచి ఇస్తారు. వీటిపై ఆర్థిక శాఖ, న్యాయ శాఖలు పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ సాధికార కమిటీ ఆమోదం తెలిపింది.

సాధికార కమిటీని ప్రశ్నించిన ఆర్థిక శాఖ 
టెండర్‌ నిబంధనల్లో మార్పులపై ఆర్థిక శాఖ సాధికార కమిటీని నిలదీసింది. ‘ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఇస్తానన్న రెవెన్యూ వాటాతో పోల్చితే ఇప్పుడు జీఎంఆర్‌ ఇస్తానన్న టికెట్‌ ఫీజు అనేది నామమాత్రమే. అలాంటప్పుడు రెవెన్యూ వాటా నిబంధన మార్చేసి టికెట్‌ ఫీజు ఎందుకు పెట్టారు? టికెట్‌ బెంచ్‌ మార్క్‌ రూ.209గా నిర్ధారించడం వాస్తవికంగా లేదు. ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అనుమతి తీసుకున్నారా లేదా?. విశాఖ నావెల్‌ ఎయిర్‌ పోర్ట్‌ మూసేయకుండా అంతర్జాతీయ విమానాశ్రయం లాభదాయకం కాదు. ఇందుకు అనుమతి తీసుకున్నారా?. భూమి లైసెన్స్‌కు బదులు లీజుకు ఇవ్వాలని ఏ ప్రాతిపదికన నిబంధనలు మార్చారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే టెండర్‌ నిబంధనల్లో పలు ఉల్లంఘనలున్నాయని, వీటిని సాధికార కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ నుంచి ఇటీవలే సంబంధిత ఫైలు ఇంధన, ఎయిర్‌పోర్ట్, మౌలిక సదుపాయాల శాఖకు చేరింది. ఎలాగైనా అధికారులపై ఒత్తిడి తెచ్చి భోగాపురం విమానాశ్రయం టెండర్‌ను జీఎంఆర్‌కు అప్పగింపచేయాలని సీఎం యత్నిస్తున్నట్టు అధికార వర్గాలంటున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement