సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ఆర్థికంగా భారీ లబ్ధిపొందాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రయత్నాలు ఫలించలేదు. ఇంటిగ్రేటెడ్ విమానాశ్రయం, అదనపు భూసేకరణ సాకులతో భోగాపురం టెండర్లను సీఎం చంద్రబాబు రద్దు చేయించడం తెలిసిందే. అయితే ఈ టెండర్ల రద్దుకు సీఎం ఏ కారణాలనైతే చెప్పారో ఆ పనులన్నీ కూడా తాము చేపడతామని స్పష్టం చేస్తూ ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం.
ఏఏఐకి అప్పగిస్తే సొంతలాభం ఉండదనే!
పోలవరం తరహాలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను ప్రైవేట్ సంస్థకు అప్పగించి ఎస్కలేషన్స్ పేరుతో ఇష్టానుసారం అంచనాలను పెంచేసి కమీషన్లు కాజేసే యత్నాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. అత్యధికంగా రెవెన్యూ వాటా ఇస్తామని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ముందుకొచ్చినా భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను అప్పగించకుండా టెండర్లను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏఏఐకి పనులు అప్పగిస్తే ముడుపులు రావనే ఉద్దేశంతోనే భోగాపురం టెండర్లను రద్దు చేశారని అధికార వర్గాలే వ్యాఖ్యానించాయి. ఇదే అంశాన్ని ‘సాక్షి’ ఇప్పటికే పాఠకులకు తెలియజేసింది.
అదనపు పనులకు ఏఏఐ సంసిద్ధత
భోగాపురంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ పోర్టును తామే నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో (ఏఏఐ) తెలిపింది. మెయింటెనెన్స్ రిపేర్స్ ఆపరేట్ (ఎంఆర్‌వో), ఏవియేషన్ అకాడమీని కూడా నిర్మిస్తామని, అదనపు పనులు చేపట్టాలంటే రాయితీ ఒప్పందంలో ఆ విషయాలను పొందుపరచవచ్చంటూ ఈ నేపథ్యంలో టెండర్ గడువును పొడిగించాల్సిందిగా ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖలో కోరింది. మరోవైపు టెండర్లలో పాల్గొని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దక్కించుకున్న ఏఏఐకి ఆ పనులను అప్పగించాలంటూ పౌర విమానయానశాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు.
ఏఏఐకి అప్పగించడమే సముచితం
ఏఏఐ రాసిన లేఖను ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (గతంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కార్పొరేషన్ లిమిటెడ్ ) సీఈవో లోతుగా అధ్యయనం చేశారు. టెండర్లలో పాల్గొని అత్యధికంగా రెవెన్యూ వాటా ఇవ్వడంతోపాటు అదనపు పనులు చేపట్టేందుకు కూడా అంగీకరిస్తూ లేఖ రాసినందున భోగాపురం విమానాశ్రయం పనులను ఏఏఐకి అప్పగించడమే మేలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. టెండర్ రద్దుకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై కేంద్ర పౌర విమానయానశాఖ వివరణ కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని పునరాలోచించి ఏఏఐకి పనులు అప్పగించాలని సూచించారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ముఖ్యమంత్రి చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారు.
రెండు బిడ్లూ సక్రమమే
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 2016 జూన్‌లో పీపీపీ విధానంలో టెండర్లను ఆహ్వానించారు. టెండర్ దాఖలు గడువును ముఖ్యమంత్రి సూచన మేరకు 2017 జూలై 31 వరకు అధికారులు పొడిగించడంతో జీఎంఆర్ ఎయిర్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బిడ్లు దాఖలు చేశాయి. ఈ రెండు బిడ్లూ సక్రమంగా ఉన్నాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ స్పష్టం చేసింది.
అత్యధిక రెవెన్యూ వాటా ఇస్తామన్నా..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేషన్ చైర్మన్ సమక్షంలో 2017 ఆగస్టు 21వ తేదీన ఫైనాన్సియల్ బిడ్లు తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వాటాగా 30.2 శాతం ఇవ్వడంతోపాటు ఎకరానికి ఏటా రూ. 20 వేల చొప్పున భూమికి లీజు, 26 శాతం ఈక్విటీని ఇస్తామని ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది. జీఎంఆర్ 21.6 శాతం మాత్రమే రెవెన్యూ వాటా ఇస్తామని పేర్కొంది. దీంతో ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామన్న ఏఏఐకి భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆర్థికశాఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖలన్నీ కూడా ఇదే సిఫార్సు చేశారు. అయితే ఏఏఐకి ఇవ్వడం ఇష్టం లేని సీఎం చంద్రబాబు అదనపు పనులు, ఇంకా భూ సేకరణ అవసరం అంటూ భోగాపురం టెండర్లను రద్దు చేయించారు. అదనపు పనులు చేపట్టేందుకు తాము సిద్ధమంటూ ఏఏఐ లేఖ రాయడం, టెండర్ల రద్దుపై పౌర విమానయాన శాఖ వివరణ కోరటం, ఏఏఐకే పనులు అప్పగించడం సముచితమని ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సూచించడంతో తో ముఖ్యమంత్రి ఇరకాటంలో పడ్డారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు ఇలా...
భోగాపురం వద్ద 2,708 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి రూ. 2,461 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను సేకరించేందుకు హడ్కో నుంచి రూ.840 కోట్ల రుణం మంజూరైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేషన్ లిమిడెట్‌ను స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ఏర్పాటు చేశారు. తొలుత 5,311 ఎకరాలు అవసరమని, రెండు దశల్లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం రెండు దశల్లో కాకుండా ఒకేదశలో 2,708 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఎయిర్ పోర్టుకు 1,733.66 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 592.69 ఎకరాలు, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్డుతో పాటు వాణిజ్య ప్రాంతానికి 175.70 ఎకరాలు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేషన్‌కు 201.21 ఎకరాలను కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment