తెలుగుదేశం ఎందుకు చేయలేకపోయింది
‘‘నిజంగా టీడీపీకి భోగాపురం ఎయిర్‌పోర్టుపై చితశుద్ధి ఉంటే ఎందుకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు? హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు అన్ని కేసులనూ దేవుడి దయతో పరిష్కరించుకుని రైతుల ఆమోదంతో భూసేకరణను పూర్తి చేశాం.అంతేకాకుండా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి శంకుస్థాపన చేస్తున్నాం. ఈ నాలుగేళ్లలో రూ.80 కోట్లు ఖర్చు చేసి అన్ని వసతులు, సౌకర్యాలతో పునరావాస గ్రామాలను అభివృద్ధి చేసి రైతులు స్వచ్ఛందంగా వెళ్లేలా చేశాం. విశాఖ నుంచి భోగాపురానికి ఎక్స్‌ప్రెస్ హైవేను రూ.6,300 కోట్లతో నిర్మించడానికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకున్నాం. వీటి పనులు త్వరలో మొదలవుతాయి. ఇక భోగాపురం ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల నీటి ఎద్దడిని పరిష్కరించడానికి రూ.195 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరో 30 నెలల్లో ఇక్కడి నుంచి విమానాలు ఎగురుతాయి. ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కిరీటంగా మారుతుంది.’’
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అసత్యాలు ప్రమాదకరం. అర్థసత్యాలు మరింత ప్రమాదకరం. అందుకే భోగాపురం ఎయిర్‌పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన వేళ.. ‘ఈనాడు’ అర్థసత్యాల రూటును ఎంచుకుంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సొంత భాష్యాలు చెబుతూ... వాటిలో కొంత మాత్రమే ఇస్తూ... ‘‘హవ్వ... అది నోరేనా?’’ అంటూ తన అక్కసు మొత్తం వెళ్లగక్కేసింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా చెప్పినవన్నీ ఇపుడు చేశాకే... విమానాశ్రయానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ శంకుస్థాపన చేశారనే అసలు వాస్తవానికి మాత్రం తనదైన ముసుగేసేసింది.
టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టకుండానే... ఎప్పుడో రెండేళ్ల కిందటి ఫోటో తీసుకొచ్చి కొట్టారంటూ ప్రచారం చేయటం... వ్యాపారులు మిల్లు ఆవరణలో ఆరబెట్టుకున్న ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకున్నారని అబద్ధాలు చెప్పి గుండెలు బాదేసుకోవటం... ఇపుడేమో భోగాపురంపై జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెప్పి దుష్ప్రచారానికి దిగటం...
ఇవన్నీ తాజా పరిణామాలు కావటంతో ‘‘ఈనాడు మరీ ఇంతలా దిగజారిపోయిందేంటి?’’ అనే వ్యాఖ్యలు, దానికి జోడించిన కథనాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏఏ అంశాలను వ్యతిరేకించారు? ఇపుడు వాటి విషయంలో ఎలా ముందుకు వెళుతున్నారో చూద్దాం...
ఎన్నికలకు నిండా నెల రోజులు కూడా లేదు. భూ సేకరణ పూర్తికాలేదు. ఎలాంటి అనుమతులూ లేవు. అయినా సరే... హడావుడిగా ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసేశారు చంద్రబాబు నాయుడు. అనుమతులు లేకుండా ఎలా చేశారు? భూసేకరణ ఎప్పుడు పూర్తి చేస్తారు? అసలు ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు ఎందుకింత హడావుడి? అని ‘ఈనాడు’ ఒక్క ప్రశ్న వేస్తే ఒట్టు!!. పైపెచ్చు కొబ్బరికాయ కొట్టిననాడే విమానాశ్రయం పూర్తయిపోయి విమానాలు ఎగురుతున్న రేంజిలో కవరేజి.
ఇప్పుడైతే ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేవలం శంకుస్థాపనకే పరిమితం కాలేదు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన వివాదాలన్నిటినీ పరిష్కరించారు. కావాల్సిన అనుమతులన్నీ తెప్పించారు. అన్నీ చేసిన తరవాత... 30 నెలల్లో పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థకు లక్ష్యం విధించి మరీ కొబ్బరికాయ కొట్టారు. కానీ రామోజీరావు మాత్రం... సవాలక్ష అర్థసత్యాలతో చెలరేగిపోయారు. నిజానికి 2018 మార్చి దాకా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామి.
అన్నిటికన్నా ముఖ్యం... విజయనగరం జిల్లాకే చెందిన పి.అశోక్‌గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి. సొంత జిల్లాలో వస్తున్న విమానాశ్రయానికి అన్ని అనుమతులూ తెప్పించడానికి ఆయన ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. చంద్రబాబు నాయుడు కూడా పట్టించుకోలేదు. కానీ ఎన్నికల ముందు ఉత్తుత్తి శంకుస్థాపనతో హడావుడి మాత్రం చేశారు.
వాస్తవానికి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసింది కూడా విమానాశ్రయానికి సంబంధించిన భూమిలో కాదు. అది తన సొంత భూమి అని, తన నుంచి విమానాశ్రయం కోసం సేకరించటం కూడా జరగలేదని, కానీ అందులో శంకుస్థాపన చేశారని అప్పట్లో సత్యనారాయణ అనే రైతు వాపోయాడు. చివరకు ఆ రైతు గోడును కూడా పట్టించుకోని రామోజీరావు... ఇపుడు మాత్రం ముఖ్యమంత్రి జగన్‌పై అభాండాలు వేయటం విచిత్రం.
అమరావతి రైతులతో పోలికా?
అప్పట్లో అమరావతి రైతులను త్యాగధనులగాను, భోగాపురం రైతులను లిటిగేషన్ పెట్టే రైతులుగాను చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించటం నిజం కాదా? అమరావతి రైతులతో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... తాను ఇచ్చిన పిలుపుతో అమరావతి కోసం. గన్నవరం విమానాశ్రయం కోసం రైతులు భూమిని ఇచ్చి త్యాగం చేశారని, కానీ భోగాపురం రైతులు భూములిచ్చి కోర్టుల్లో కేసులు వేసి లిటిగేషన్లు పెడుతున్నారని, అందుకే తాము ఎయిర్‌పోర్టును నిర్మించలేకపోతున్నామని చెప్పారు. మరి ‘ఈనాడు’ ఈ వాస్తవాలెందుకు రాయదు? ముఖ్యమంత్రి జగన్ మాట మార్చారంటూ తప్పుడు కథనాలేల?
వ్యతిరేకించింది 12,000 ఎకరాల భూసేకరణనే...
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం చంద్రబాబు నాయుడు 2015లో రైతుల నుంచి 12,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకోవడంపై స్థానిక రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమయింది. ఈ ఆందోళనతో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా ఏకీభవించారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అన్ని ఎకరాల భూమి దేనికని ప్రశ్నించారు. 2,300 ఎకరాలు ఉంటే సరిపోతుందన్నారు. ‘‘చెన్నై ఎయిర్‌పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? అని ప్రశ్నిస్తూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రైతులకు మద్దతుగా నిలిచారు.
చివరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సేకరించాల్సిన భూమిని తొలుత 6,000 ఎకరాలకు... ఆ తర్వాత 2,700 ఎకరాలకు కుదించుకుంటూ వచ్చింది. చివరకు 2017లో 2,700 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడంతో పాటు... ఇందుకోసం ఏర్పాటు చేసిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ కంపెనీ పేరుమీద రూ.1,500 కోట్ల అప్పును హడ్కో నుంచి తీసుకోవడానికి అనుమతిస్తూ జీవో ఇచ్చారు. అయితే బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇవేమీ ప్రస్తావించని ‘ఈనాడు’... నాడు భూసేకరణను వ్యతిరేకించి, నేడు శంకుస్థాపన చేస్తున్నారంటూ రాయటం దారుణం కాక మరేమిటి?
ఏ1గా నిలిచింది జీఎంఆర్ సంస్థే...
► ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తొలుత పిలిచిన టెండర్లల్లో ఎయిర్‌పోర్టు అథారిటీఆఫ్ ఇండియా ఎంపికయింది. కానీ ఆ టెండర్లను రద్దుచేసి తిరిగి పిలిచిన టెండర్లలో జీఎంఆర్ సంస్థే ఏ1గా నిలిచింది. ఈలోగా ఎన్నికలు సమీపించడంతో భూసేకరణ, పర్యావరణ అనుమతులు, జీఎంఆర్‌తో ఒప్పందం లేకుండానే హడావుడి శంకుస్థాపన చేశారు. అందుకే నాటి శంకుస్థాపనకు సైతం జీఎంఆర్ ప్రతినిధులు దూరంగా ఉన్నారు.
► ఈ ఎయిర్‌పోర్టు భూసేకరణపై సుప్రీంకోర్టు నవంబర్11, 2022న తీర్పు ఇస్తే జనవరి 2023 నాటికి భూసేకరణ పూర్తయ్యింది.
► ఈ ఏడాది మార్చిలో పునరావాస గ్రామాలకు ప్రజలను తరలించే ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది.
► ఇక ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి ఎన్‌ఓసీ 2022 నవంబర్లో వచ్చింది. ఇలా అడ్డంకులన్నీ తొలగించాకే శంకుస్థాపన చేశారు సీఎం జగన్. అసలు ‘ఈనాడు’ ఏడుపు ఎందుకంటే నాడు చంద్రబాబు చేయలేకపోయింది..నేడు జగన్ చేస్తున్నారనే ఈర‡్ష్య ఒకటి కాగా... జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ... శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగనే పూర్తయ్యాక విమానాశ్రయాన్ని ప్రారంభించాలని వ్యాఖ్యానించటం ఎల్లో ముఠా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే శంకుస్థాపన కార్యక్రమం వార్తను కుదించేసి... అసత్యాలు, అర్థసత్యాలతో కూడిన కథనాన్ని పతాక శీర్షికల్లో వేసేసింది.
పునరావాస గ్రామాలూ పూర్తి...
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉన్నా చిత్తశుద్ధి లేకుండా భోగాపురాన్ని ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నది చంద్రబాబు నాయుడు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైఎస్ జగన్ దీనికి అనుమతులు సాధించటంతో పాటు ఈ నాలుగేళ్లలో పునరావాస గ్రామాలను సైతం పూర్తి చేశారు. అప్పట్లో బలవంతపు భూ సేకరణను వ్యతిరేకించిన మాట వాస్తవం. అందుకే స్థానికులు తమకు పరిహారం దక్కి.. స్వచ్ఛందంగా పునరావాస కాలనీలకు వెళ్లిన తరవాతే శంకుస్థాపన చేశారన్న విషయాన్ని దాచిపెడతారెందుకు రామోజీరావు గారూ?
Comments
Please login to add a commentAdd a comment