రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కలవరం అందుకే... | Large number of irregularities in the TDP Govt | Sakshi
Sakshi News home page

అక్రమాలు అనేకం..

Published Sat, Nov 17 2018 4:39 AM | Last Updated on Sat, Nov 17 2018 12:12 PM

Large number of irregularities in the TDP Govt - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న అవినీతి వ్యవహారాలను కప్పిపుచ్చుకోవడంతోపాటు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరగకుండా అడ్డుకునే లక్ష్యంతోనే ఏపీలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ టీడీపీ సర్కారు జీవో జారీ చేసినట్లు వెల్లడవుతోంది. రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను సింగపూర్‌ కంపెనీలకు కట్టబెట్టడం, సాగునీటి ప్రాజెక్టుల ముసుగులో అంచనాలు భారీగా పెంచి రూ.వేల కోట్లలో అవినీతికి పాల్పడటం, నీరు–చెట్టు పేరుతో ఉపాధి హామీ నిధులను టీడీపీ నేతలకు పంచిపెట్టడం, విశాఖలో లక్ష ఎకరాలకు సంబంధించిన భూముల రికార్డులను గల్లంతు చేసి భూ కబ్జాలకు దిగడంతోపాటు తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబు దొరికిపోయిన నేపథ్యంలో ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిగితే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరగకుండా రాష్ట్రంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు.  

ఉన్నతాధికారుల అభ్యంతరాలు బేఖాతర్‌..
రాజధాని, నిర్మాణ పనులు, సాగునీటి ప్రాజెక్టుల్లో అంచనాల పెంపు లాంటి పలు అంశాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ గట్టిగా వ్యతిరేకించినప్పటికీ సీఎం చంద్రబాబు కేబినెట్‌లో ఆమోదించుకుని  అక్రమాలను సక్రమం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నప్పటికీ ముఖ్యమంత్రి సమీక్షిస్తూ ఆదేశాలు జారీ చేశారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మినిట్స్‌లో స్పష్టం చేశారు. రాజధాని టెండర్లతో పాటు తాత్కాలిక సచివాలయ నిర్మాణం, రాజధాని భూ సమీకరణలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో పాటు సింగపూర్‌ కంపెనీలతో ఒప్పందాలు, పోలవరం ప్రాజెక్టులో అంచనాల పెంపు, నామినేషన్లపై కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వరకు నేరుగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో లొసుగులు ఉన్నట్లు మినిట్స్‌ స్పష్టం చేస్తున్నాయి. 

ఉపాధి నిధులు నీటి పాలు! 
విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నాక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి.. కమీషన్‌లు వసూలు చేసుకుంటున్నారు. హెడ్‌ వర్క్స్‌ నుంచి కుడి, ఎడమ కాలువ పనుల వరకూ ఇదే కథ. చంద్రబాబు కమీషన్‌ల కక్కుర్తి వల్ల పోలవరం జలాశయం పనులకు సంబంధించిన డిజైన్‌లు కొలిక్కి రాలేదు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల్లోనూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. చెరువుల్లో పూడిక తీత, మరమ్మతుల పనులను నీరు–చెట్టు కింద టీడీపీ కార్యకర్తలకు నామినేషన్‌పై అప్పగించి.. పనులు చేయకుండా చేసినట్లు చూపి రూ.15,689 కోట్లను దోచుకున్నారు. ఇందులో ఉపాధిహామీ నిధులే రూ.11,005.25 కోట్లు ఉండటం గమనార్హం. 

విశాఖ భూముల స్కాంపై స్వయంగా మంత్రే గళం విప్పినా...   
విశాఖపట్నం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా భూ రికార్డులు ట్యాంపరింగ్‌కు గురయ్యాయి. ఇందులో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, గంటా, టీడీపీకి చెందిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలలతో సహా పార్టీ ఇతర నాయకుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణం గురించి అదే జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆధారాలతో సహా ఆరోపణలు చేశారు. అయితే సిట్‌ విచారణ పేరుతో ఈ కుంభకోణాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.

ఏరులై పారిన అవినీతి.. 
పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా పెండింగ్‌ ప్రాజెక్టుల పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తాం. కొత్తగా 35.04 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందిస్తాం.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం’ అని సాగునీటి ప్రాజెక్టులపై 2014 జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. నాలుగున్నరేళ్లలో రూ.60,266.74 కోట్లు ఖర్చు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు చేసిన ఖర్చును మినహాయిస్తే రూ.51 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశారు. కానీ ఇప్పటివరకూ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు. పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అంచనా వ్యయాన్ని పెంచేసి.. కోటరీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి భారీ ఎత్తున దోచుకున్నారు. ఈ అవినీతిని 2015–16, 2016–17 కాగ్‌ నివేదికలు ఎత్తిచూపాయి. పోలవరం ప్రాజెక్టును 2018 ఖరీఫ్‌ నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించడంలో విఫలమైన చంద్రబాబు సర్కార్‌.. అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.57,970.86 కోట్లకు పెంచేయడంలో మాత్రం ప్రగతి సాధించిందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. 

ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్‌ వదిలిపెట్టి... 
తెలంగాణ శాసనమండలి ఎన్నికల సందర్భంగా సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడం తెలిసిందే. చంద్రబాబు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తూ చిక్కి అరెస్టయ్యారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి ఉన్నఫళంగా అమరావతికి తరలివచ్చారు. దీనికి సంబంధించి న్యాయస్థానంలో కేసు విచారణలోఉంది. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిగితే తమ పాత్ర బయట పడుతుందనే భయంతోనే ఏపీలో సీబీఐకి ప్రవేశాన్ని నిషేధిస్తూ టీడీపీ సర్కారు జీవో జారీ చేసినట్లు తెలుస్తోంది. 

హాయ్‌ల్యాండ్‌పై లోకేష్‌ కన్ను! 
కీలకమైన హాయ్‌ల్యాండ్‌ను చేజిక్కించుకునేందుకు సీఎం తనయుడు, మంత్రి లోకేష్‌ ప్రయత్నించారనే తీవ్ర ఆరోపణలున్నాయి. అగ్రిగోల్డ్‌ వ్యవహారాల నిగ్గు తేల్చడానికి సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని బాధితులు, ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసినా తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోని సీఐడీకి కేసును అప్పగించి తూతూ మంత్రంగా వ్యవహరించింది. న్యాయస్థానం కూడా ఇదే అభిప్రాయాన్ని పలు సార్లు వ్యక్తీకరించడం గమనార్హం.  

ఇవి కావా దోపిడీలు?  
- ఉచితం పేరుతో అధికార పార్టీకి చెందిన ఇసుక మాఫియా ఇష్జారాజ్యంగా దోపిడీకి పాల్పడుతోంది. 
అమరావతి సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని రూ.వెయ్యి కోట్ల విలువచేసే భూమిని ప్రభుత్వ పెద్దలు తమ బినామీకి కట్టబెట్టి సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. 
- విజయవాడ, గుంటూరు, విశాఖ తదితర ప్రాంతాల్లోని ఆర్టీసీకి చెందిన స్థలాలు తమవారికి కట్టబెట్టి లబ్ధి పొందే ప్రయత్నాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.  
విశాఖలో పేదల భూములను ‘గీతం’కు కట్టబెట్టారు. దొంగ డాక్యుమెంట్లతో దస్‌పల్లా హిల్స్‌ను కైకంకర్యం చేశారు.  
బెరైటీస్, విదేశీ బొగ్గు కొనుగోళ్లలో అక్రమాలకు, సోలార్‌లో గోల్‌మాల్‌కు చంద్రబాబు సర్కారు తెగబడింది.  
గ్రానైట్‌ ఖనిజం కోసం మంత్రి పుల్లారావు పేదల భూములను కొల్లగొట్టడానికి స్కెచ్‌ వేశారు. పత్తి కుంభకోణంలో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి.  
రెయిన్‌గన్‌ల నిర్వహణ పేరిట కోట్ల రూపాయల దోపిడీ జరిగింది.  

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో రూ.లక్ష కోట్ల దోపిడీ
గుంటూరు–విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు 2014 సెప్టెంబరు 4న సీఎం చంద్రబాబు  శాసనసభలో ప్రకటించారు. అయితే ఆ ప్రకటన వెలువడేలోగా చంద్రబాబు అండ్‌ కో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే భూములు కొట్టేసింది. పది వేల ఎకరాల భూములను చంద్రబాబు అండ్‌ కో సొంతం చేసుకున్నాకనే రాజధాని ఏర్పాటుపై శాసనసభలో ప్రకటన చేయడం గమనార్హం! ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా ఇలా రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్నారు. 29 గ్రామాల్లో సులభంగా భూసమీకరణ చేయాలన్న ముందస్తు వ్యూహంలో భాగంలో ఒక్కో గ్రామంలో ఇద్దరు చొప్పున మంత్రులు.. నలుగురైదుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ద్వారా తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేయించారు. భూసమీకరణకు సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు అత్యంత ప్రాధాన్యం గల ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించడంతో లోగుట్టు రట్టయింది. మరోవైపు రాజధానిలో రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను పలు కార్పొరేట్‌ సంస్థలకు చౌకగా  కట్టబెట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధిక రేట్లకు విక్రయించి ప్రయివేటు సంస్థలకు మాత్రం తక్కువ మొత్తానికి కట్టబెట్టి కమీషన్లు వసూళ్లు వసూలు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి.  

స్విస్‌ ఛాలెంజ్‌ ముసుగులో.. 
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ రూ.3,137 కోట్ల వ్యయంతో చేపట్టిన రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును ముందే ఎంపిక చేసిన సింగపూర్‌ కన్సార్టియంకు ప్రభుత్వం కట్టబెట్టింది. రాజధాని కోసం అంటూ రైతుల నుంచి 33 వేల ఎకరాలకు పైగా తీసుకున్నారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే నిర్ణయం తీసుకుని అక్కడ ప్రభుత్వ పెద్దల బినామీలతో భారీగా భూములను కొనుగోలు చేయించారు. దీన్నే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కుంభకోణంగా మార్చేశారు. అంతే కాకుండా రాజధానిలో సింగపూర్‌ కంపెనీలకు 1,691 ఎకరాలను కేటాయించారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్‌ కేటాయింపుల నుంచి  రూ.5,500 కోట్లతో మౌలిక వసతులు  కల్పించడానికి అంగీకరించారు. ఇలా మౌలిక వసతులు కల్పించిన 1,691 ఎకరాలను ప్లాట్లుగా వేసి సింగపూర్‌ కంపెనీలు మూడో పార్టీకి విక్రయిస్తాయి. ఇందులో రూ.లక్ష కోట్ల దోపిడీకి పాల్పడినట్లు స్పష్టమైంది. సింగపూర్‌ కంపెనీలు కేవలం రూ.232 కోట్లు మాత్రమే పెట్టుబడి పెడతాయి. కానీ 1,691 ఎకరాలను ప్లాట్లు వేసి విక్రయించగా వచ్చిన మొత్తంలో సింహభాగం లాభం ఆ సంస్థలకే చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది రూ.446 కోట్లు మాత్రమే. సింగపూర్‌ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందానికి కేంద్రం అనుమతించగా సింగపూర్‌ ప్రైవేట్‌ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం చేసుకోవడం గమనార్హం.  

కమీషన్లు రావనే భోగాపురం టెండర్‌ రద్దు 
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎయిర్‌ పోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్మించడానికి టెండర్లలో అర్హత సాధించింది. టెండర్‌ దాఖలు చేసిన మరో సంస్థ ఇస్తామన్న రెవెన్యూ వాటా కన్నా ఎయిర్‌ పోర్ట్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా అత్యధికంగా ఇస్తానంది. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్‌ పోర్టు అధారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి ఎటువంటి కమీషన్లు, అక్రమ వ్యవహారాలు సాధ్యం కావనే ఉద్దేశంతో టెండర్‌ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌ పోర్ట్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియాకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్‌ను ఖరారు చేయాలని రెండు సార్లు సిఫార్సు చేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ససేమీరా అనటం వెనుక లోగుట్టు ఇదేనని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement