ఉత్తరాంధ్రకు సీఎం జగన్‌ నాలుగు వరాలు | CM Jagan public meeting at Savaravilli Bhogapuram Mandal | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రకు సీఎం జగన్‌ నాలుగు వరాలు

Published Wed, May 3 2023 3:34 AM | Last Updated on Wed, May 3 2023 10:19 AM

CM Jagan public meeting at Savaravilli Bhogapuram Mandal - Sakshi

విమానాశ్రయం నమూనా

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానా­శ్రయం నిర్మా­ణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం భూమి పూజ చేయనున్నారు. దీంతోపాటు విజయనగరం జిల్లాలో మరో రెండు కీలక ప్రాజెక్టులతోపాటు విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్‌ నిర్మించే వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌కు సీఎం జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నాయి. రూ.4,592 కోట్లతో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణం కానుండగా ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్‌ టెక్‌ పార్కు రూపుదిద్దుకోనుంది.

ముఖ్యమంత్రి జగన్‌ నేడు విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించి పలు కార్యక్రమాలకు శంకుస్థాపనతోపాటు భోగాపురం మండలం సవరవిల్లి వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భోగాపురం మండలంలోని ఎ.రావివలస వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను, సవరవిల్లి వద్ద బహిరంగ సభ వేదికను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, విజయనగరం జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, కలెక్టర్‌ నాగలక్ష్మి, డీఐజీ హరికృష్ణ, ఎస్పీ దీపిక తదితరులు మంగళవారం పరిశీలించారు.

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం
విశాఖ ఎయిర్‌పోర్టుకి ప్రత్యామ్నాయంగా అత్యాధునిక సౌకర్యాలతో భోగాపురం మండలంలో 36 నెలల్లో నిర్మించే అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి జగన్‌ భూమిపూజ చేస్తారు. దాదాపు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో జీఎంఆర్‌ విశాఖ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ దీన్ని నిర్మిస్తోంది.

3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పాటు దేశీయ, అంతర్జాతీయ రవాణాకు దోహదపడేలా కార్గో టెర్మినల్‌ ఇక్కడి ప్రత్యేకత. తొలి దశ నిర్మాణమే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. అనంతరం ఏటా  1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశలవారీగా సౌకర్యాలను విస్తరిస్తారు.

రూ.21,844 కోట్లతో వైజాగ్‌ టెక్‌పార్క్‌ 
అదానీ గ్రూప్‌ ఆధ్వర్యంలో రూ.14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్‌ పార్క్‌ ఏర్పాటు కానుంది. త్వరలో రూ.7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్‌ పార్క్‌లను అభివృద్ధి చేస్తారు. తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, మరో 10,610 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు
జలయజ్ఞంలో భాగంగా విజయనగరం జిల్లాలో 24,710 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చంపావతి నదిపై 2005 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాంది పలికారు. ఆయన హఠాన్మరణంతో ఈ ప్రాజెక్టు పనులు మందగించాయి. పెండింగ్‌ పనులను రూ.194.90 కోట్లతో పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు.

పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు తాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీటితో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన నీటిని అందించడం లక్ష్యంగా తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్‌ చేపట్టారు. 2024 డిసెంబర్‌ నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు.

చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌
విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తూ పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ.23.73 కోట్ల వ్యయంతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం కానుంది. అన్ని కాలాల్లో సముద్రంలో చేపలు వేటాడేందుకు వెసులుబాటు కలగనుంది. తుపాన్లు, విపత్తుల సమయాల్లో సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు, అలల తాకిడికి పడవలు దెబ్బ తినకుండా లంగర్‌ వేసే సదుపాయం ఉంటుంది. తద్వారా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు.

‘భోగాపురం’ ప్రత్యేకతలు
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూసేకరణ, టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి ఎన్‌వోసీ, అనుమతులు సాధించింది. ఎన్‌జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయ వివాదాలను పరిష్కరించడం ద్వారా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. దీన్ని పీపీపీ విధానంలో నిర్మించేలా జీఎంఆర్‌ గ్రూప్‌తో ఏపీ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఏడిసీఎల్‌) ఒప్పందం చేసుకుంది.

అత్యంత ఆధునికంగా ట్రంపెట్‌ నిర్మాణం ద్వారా ఇటు విశాఖ అటు శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయ టెర్మినల్‌కు చేరుకునేలా అనుసంధానించనున్నారు. అంతర్జాతీయ ఎగ్జిట్‌ గేట్‌వే ఏర్పాటుకు వీలుగా కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్‌ ఎకో సిస్టమ్‌తోపాటు తొలిదశలో 5,000 చ.మీ విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రన్‌వే, కమర్షియల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆప్రాన్, ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్, ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ అండ్‌ టెక్నికల్‌ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ దీని ప్రత్యేకతలు. 16వ నెంబర్‌ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం, కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా, కమర్షియల్‌ అప్రోచ్‌ రోడ్, సోలార్‌ ప్యానెల్స్‌ ఏరియా, ఏవియేషన్‌ అకాడమీ, మెయింటెనెన్స్‌ రిపేర్‌ అండ్‌ ఓవర్‌ హాలింగ్‌ సౌకర్యాలున్నాయి.

విశాఖ–భోగాపురం మధ్య రూ.6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మాణం కానుంది. రెండువైపులా సర్వీసు రోడ్లు ఉంటాయి. ఎయిర్‌పోర్టు నిర్మాణ సమయంలో 5 వేల మందికి, సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి దక్కుతుంది.

పర్యాటక అభివృద్ధి, ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. విమానాశ్రయం కోసం స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసిన నాలుగు గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు రూ.77 కోట్లతో పునరావాసం కల్పించారు. సీఎం జగన్‌ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ఇప్పటికే వసతి కూడా కల్పించింది.

అదానీ డేటా సెంటర్‌తో ఐటీ బూమ్‌
డేటా హబ్‌తో డేటా స్పీడ్‌ గణనీయంగా పెరగనుంది. సింగపూర్‌ – విశాఖ వరకు సముద్ర సబ్‌మెరైన్‌ కేబుల్‌ ఏర్పాటు ద్వారా ఇంటర్నెట్‌ బ్యాండ్‌ విడ్త్‌ ఐదు రెట్లు పెరుగుతుంది. తద్వారా భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో మరిన్ని ఐటీ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. విశాఖలో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుతో ఐటీ, ఐటీ అనుబంధ సేవల్లో వృద్ధి నమోదు కానుంది. భారీ స్ధాయిలో హైటెక్‌ ఉద్యోగాల కల్పనకు సానుకూల వాతావరణం నెలకొంటుంది.

విశ్వసనీయమైన డేటా భద్రతతోపాటు సేవల ఖర్చుల్లో తగ్గుదల ఉంటుంది. అధునాతన టెక్‌ కంపెనీలు విశాఖను ఎంచుకోవడం ద్వారా ఐటీ రంగంలో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోనున్నాయి. డేటా సెంటర్‌కు అనుబంధంగా ఏర్పాటు కానున్న స్కిల్‌ యూనివర్సిటీ, స్కిల్‌ సెంటర్ల ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు చేపట్టారు. బిజినెస్‌ పార్క్‌ రిక్రియేషన్‌ సెంటర్ల ద్వారా ఉద్యోగుల జీవన శైలి మారనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement