సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన కేసులను హైకోర్టు కొట్టేయడంతో త్వరలో శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టడానికి ఏపీ ఏవియేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ప్రణాళికలు సిద్ధంచేసింది. ఈనెల 12న విశాఖ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభానికి ప్రధాని మోదీ విశాఖ వస్తున్న తరుణంలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులకు కూడా శంకుస్థాపన చేయించాలని ఏపీఏడీసీఎల్ యోచిస్తోంది. ప్రధాని యాత్రకు సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్ ఇంకా ఖరారు కానందున.. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా షెడ్యూల్‌లో చేర్చాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరనున్నట్లు ఏపీఏడీసీఎల్ ఎండీ భరత్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.
రూ.2,300 కోట్లతో నిర్మాణం
విశాఖకు సమీపంలో విజయనగరం జిల్లా భోగాపురం వద్ద 2,203 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధంచేసింది. సుమారు రూ.2,300 కోట్లతో ఎయిర్‌పోర్టు నిర్మాణ కాంట్రాక్టును జీఎంఆర్ సంస్థ చేజిక్కించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదిరింది. పనులు ప్రారంభించడానికి ఇంతకాలం కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం గట్టిగా వాదించడం ద్వారా అనుకూలమైన తీర్పు రావడంతో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ అధికారులు తెలిపారు. అలాగే, మూడేళ్లలో పనులు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ రెండున్నర ఏళ్లల్లోనే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారు తెలిపారు.
ఏటా 60 లక్షల మంది ప్రయాణం
ఇక భోగాపురం తొలిదశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణించేలా ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి ఏటా సగటున 28 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వాస్తవంగా విశాఖ నుంచి ఇంకా ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత ఎయిర్‌పోర్టు భారత నావికాదళానికి సంబంధించినది కావడంతో విమాన రాకపోకలపై అనేక ఆంక్షలున్నాయి. అదే భోగాపురంలో విమానాశ్రయం వస్తే 24 గంటలూ సర్వీసులు నడిపే అవకాశముంటుంది. ఇక విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రస్తుతం ఏటా 4,400 టన్నుల సరుకు రవాణా జరుగుతుండగా కొత్త విమానాశ్రయం వస్తే ఇది భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు.. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖలోని విమానాశ్రయం మూసివేయడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇప్పటికే నిరభ్యంతర సర్టిఫికెట్‌ను కూడా ఇచ్చింది.
అప్పట్లో టీడీపీ తీరుతో రోడ్డెక్కిన రైతులు
గత టీడీపీ ప్రభుత్వంలో తొలుత 15 వేల ఎకరాలు అవసరమని ఆ పార్టీ నేతలు నాయకులు ప్రకటనలు చేయడంతో భోగాపురం మండల రైతులు తీవ్ర ఆందోళనలకు దిగారు. దీంతో ఐదువేల ఎకరాలతో సరిపెట్టాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ 2015 ఆగస్టులో రైతులు రోడ్డెక్కారు. నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. న్యాయస్థానంలో విచారణ పెండింగ్‌లో ఉండగానే 2019 సాధారణ ఎన్నికలు సమీపించాయి. మరోవైపు.. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఏమీ పూర్తిచేయలేదు. కానీ, ఎన్నికలకు రెండునెలల ముందు ఫిబ్రవరి 14న ఎలాంటి అనుమతులు లేకుండానే హడావుడిగా శంకుస్థాపన చేశారు.
ఇప్పుడు రెట్టింపు పైగా పరిహారం
కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్ విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ అదే సమయంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. భూమి పరిస్థితిని బట్టి పరిహారాన్ని ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు ప్రకటించారు. అంతకుముందు డి.పట్టా భూములకు టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం రూ.12.50 లక్షలు మాత్రమే. అలాకాకుండా వారికీ జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. దీంతో చాలామంది హైకోర్టులో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగతా వాటినీ శుక్రవారం హైకోర్టు పరిష్కరించింది. సంబంధిత రైతులకు పరిహారం ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది.
ఆ మేరకు ఆ మొత్తాన్ని చెల్లించడానికి జిల్లా కలెక్టరు ఎ. సూర్యకుమారి తదితర అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేస్తోంది. మరోవైపు.. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. అలాగే, విమానాశ్రయ పరిధిలోనే గత టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడా వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ పూర్తయ్యింది. జాతీయ రహదారి నుంచి అనుసంధాన రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో వంతెన నిర్మాణానికి అవసరమైన 119 ఎకరాల సేకరణ రెండో దశ నోటిఫికేషన్‌తో కొలిక్కి వచ్చింది.
నిర్వాసితులకు టౌన్‌షిప్‌లను తలదన్నే కాలనీలు
ఇక ఇళ్లు కోల్పోయిన 376 కుటుంబాల కోసం రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను ప్రభుత్వం నిర్మిస్తోంది. అంతేకాక.. ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా ఐదు సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల చొప్పున పునరావాస పరిహారాన్ని ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేసింది.
చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
Comments
Please login to add a commentAdd a comment