భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతి
సాక్షి బిజినెస్ బ్యూరో, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపాదిత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతి లభించింది.కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఈ మేరకు అనుమతిని మంజూరు చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో లేవనెత్తిన అంశాలకు ప్రాజెక్టు అథారిటీ సంతృప్తికరంగా స్పందించినట్టు ఈఏసీ తెలిపింది.
తుది ఈఐఏ, ఈఎంపీ నివేదికలో ఈ అంశాలను పొందుపరచాలని సూచించినట్టు పేర్కొంది. విశాఖ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రూ.2,260.73 కోట్ల వ్యయంతో పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ప్రతిపాదనలు తొలి దశకు సంబంధించినవి. వచ్చే కొన్ని సంవత్సరాల్లో విశాఖ విమానాశ్రయంలో ట్రాఫిక్ గరిష్ట స్థాయికి చేరనున్న నేపథ్యంలో దాన్ని భోగాపురం విమానాశ్రయం తగ్గించనుందని ఈఏసీ పేర్కొంది.