శ్రీవారి కల్యాణం నిర్వహిస్తున్న టీటీడీ వేద పండితులు
కొమ్మాది (భీమిలి): సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా దేశంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖపట్నంలోని రుషికొండపై మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం బుధవారం వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం నుంచి సాధారణ భక్తులకు ప్రవేశం కల్పించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో కలిసి శ్రీవారి ఆలయాన్ని వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. స్వరూపానందేంద్రతో కలసి వైవీ సుబ్బారెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖకు మరింత ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చేందుకు రెండేళ్ల క్రితం రూ. 26 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ ఏడాది మార్చి 18న అంకురార్పణతో వైదిక కార్యక్రమాలు ప్రారంభమై ఐదు రోజులపాటు కొనసాగాయన్నారు. అమరావతిలో కూడా శ్రీవారి ఆలయం పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కశ్మీర్‌లో 60 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో రానున్న రెండేళ్లలో వెయ్యి శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వాస్తవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభించాల్సి ఉండగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా ఆయన రాలేకపోయారని, త్వరలో ఆలయాన్ని సందర్శిస్తారని తెలిపారు.
సీఎం జగన్ ఆదేశాలతో ఆలయం నిర్మాణం
శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రుషికొండలో టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలిపారు. వైఖానస ఆగమానుసారం శ్రీవారి ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్న దిగి వచ్చారన్నంత అద్భుతంగా ఉందన్నారు. వేదాలు, ఆగమాలు, దేవాలయాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆలయంలో స్వామి వారిని దర్శిస్తే సమస్త పాపాలు తొలగి కోరిన కోర్కెలు నెరవేరుతాయని వివరించారు.
శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రుషికొండలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంతో విశాఖ మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదాపీఠ ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్, మల్లాడి కృష్ణారావు, జేఈవోలు సదా భార్గవి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు, ఆగమ సలహాదారులు విష్ణు భట్టాచార్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment