సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డల కళ్యాణానికి ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు అందిన దరఖాస్తులకు నగదు బదిలీకి ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవననిర్మాణ కార్మికులు(బీవోసీడబ్ల్యూడబ్ల్యూబీ) కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లికి ఆర్థికసాయం అందించేందుకు గతేడాది అక్టోబర్ 1న ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అర్హులు ఈ పథకానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు త్రైమాసికాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. తరువాత 15 రోజుల్లో సచివాలయం, మండల, జిల్లాస్థాయిల్లో పరిశీలించి నగదు బదిలీ చేయనున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య జరిగిన వివాహాలకు ఈ నెల 31 వరకు నవశకం లబ్ధిదారుల మేనేజ్‌మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటికి ఫిబ్రవరిలో నగదు బదిలీ చేయనున్నారు.
ఈ మార్గదర్శకాలు తప్పనిసరి
విద్యను ప్రోత్సహించడం, పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించడం, బాల్యవివాహాలను అరికట్టడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ పథకానికి కొన్ని నిబంధనలు విధించింది. వధూవరులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండడంతోపాటు వివాహతేదీ నాటికి వధువుకి 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాల వయసు ఉండాలని నిర్దేశించింది.
వివాహం జరిగిన 60 రోజుల్లోగా నవశకం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం గత ఏడాది అక్టోబర్ 1 తర్వాత వివాహాలు చేసుకున్నవారికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అందిన దరఖాస్తులను సచివాలయం, మండల, జిల్లాస్థాయిల్లో 15 రోజుల్లో ఆడిట్ చేస్తారు. ఇలా ఏడాది కాలంలో జరిగిన వివాహాలకు నాలుగు విడతలుగా (ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్ త్రైమాసికాల్లో) ఆర్థికసాయం విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.
కళ్యాణమస్తు దరఖాస్తుకు 31 వరకు అవకాశం.. ఈ మార్గదర్శకాలు తప్పనిసరి
Published Fri, Jan 27 2023 4:33 AM | Last Updated on Fri, Jan 27 2023 9:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment