మూడు సంస్థలతో పోటీ పడి బిడ్డు దక్కించుకున్న ఓరియంట్
ఏడాదికి కనీసం 80 నుంచి 100 మందికి శిక్షణ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో తొలి పైలెట్ శిక్షణ కేంద్రం కర్నూలు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ఏర్పాటవుతోంది. ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఓరియంట్ ఫ్లైట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతిస్తూ రాష్ట్ర మౌలిక వసతులు, పెట్టుబడులు శాఖ ఉత్తర్వులిచ్చింది. పైలెట్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఏడీసీఎల్) టెండర్లు పిలవగా మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.
ఇందులో రిత్విక్ ఏవియేషన్, ధిల్లాన్ ఏవియేషన్ లిమిటెడ్‌లు నిర్దేశిత నిబంధనల అర్హతలను అందుకోలేకపోయాయి. ఏపీఏడీసీఎల్ ప్రతీ విమానానికి గంటకు కనీస ఆదాయంగా రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్న నిబంధన విధిస్తే.. ఓరియంట్ ఏవియేషన్ దానికి అదనంగా రూ.750 చెల్లించడానికి ముందుకొచ్చింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ఓరియంట్ ఏవియేషన్ ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు అనుమతిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ గురువారం ఉత్తర్వులిచ్చారు.
సంవత్సరానికి 100 మంది వరకు శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.155 కోట్లతో ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో సుమారు రూ.30 కోట్లతో పైలెట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. దీర్ఘకాలిక లీజు విధానంలో తొలుత 20 ఏళ్లకు ఆ తర్వాత పరస్పర అంగీకారంతో మరో పదేళ్లు పొడిగించుకునేలా ఈ ఎఫ్‌టీవోని ఏర్పాటు చేస్తున్నారు.
ఏడాదికి కనీసం 80 నుంచి 100 మందికి పైలెట్ శిక్షణ ఇచ్చేలా ఈ ఎఫ్‌టీవోని ఏర్పాటు చేస్తున్నారు. కేవలం విమాన సర్వీసులే కాకుండా కర్నూలు ఎయిర్‌పోర్టును ఆధారం చేసుకుని పైలెట్ శిక్షణ, పారాగ్లైడింగ్, ఎంఆర్‌వో యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా విమానాశ్రయ ఆదాయం పెంచే మార్గాలను ఏపీఏడీసీఎల్ పరిశీలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment