జాలిలేని దేవుడు.. కష్టాలకే కన్నీళ్లొచ్చె.. | Orphan Sisters Urges Help For Study Kodigenahalli Parigi | Sakshi
Sakshi News home page

జాలిలేని దేవుడు.. కష్టాలకే కన్నీళ్లొచ్చె..

Published Sat, Apr 17 2021 9:21 AM | Last Updated on Sat, Apr 17 2021 10:58 AM

Orphan Sisters Urges Help For Study Kodigenahalli Parigi - Sakshi

కూతుళ్లు పుడితే ఇంటికే వెలుగు అనుకుంటాం.. మహాలక్ష్మిగా భావిస్తాం.. ఆ ఇంట ఇద్దరు లక్ష్మిలు జన్మించారు. తల్లిదండ్రులు మురిసిపోయారు.. మురిపెంగా చూసుకున్నారు.. చిన్నకూతురికి ఏడాదిలోపే తల్లి దూరమైంది.. తండ్రి అన్నీ తానే అయ్యాడు. ఆలనాపాలనా చూసుకుంటుంటే.. అంతలోనే అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. ఆదరణ కరువైంది. ఆకలేస్తే అన్నం లేదు.. తలదాచుకోను ఇల్లులేదు. ఎటు వెళ్లాలో దిక్కుతోచలేదు. చెల్లిని చదివించేందుకు అక్క చదువు మానేసింది. కూలిపనులకెళ్లి పూట గడుపుకుంటున్నారు. ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తే.. బాగా చదువుకుంటామని అక్కాచెల్లెల్లు చెప్తున్నారు.
 

పరిగి: కొడిగెనహళ్లి పంచాయతీ ఎస్సీ కాలనీకి చెందిన కూలీ కె.హనుమంతప్ప, నరసమ్మ దంపతులు. వీరికి యశోద, ఐశ్వర్య కుమార్తెలు. చిన్నమ్మాయికి ఏడాది వయసున్నపుడు అంటే 14 ఏళ్ల కిందట తల్లి అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి కూతుళ్ల ఆలనాపాలనా హనుమంతప్పే చూసుకుంటూ వచ్చాడు. ఐదేళ్ల కిందట ఆయన కూడా ఆరోగ్యం క్షీణించి మృత్యువాతపడ్డాడు. అప్పటికి యశోద ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ చదువుతోంది. సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లోనే ఉంటూ వచ్చారు. ఇక పోషించేవారు లేకపోవడంతో చిన్నాన్నకు చెందిన ఓ చిన్న గదిలో అక్కచెల్లెల్లిద్దరూ తలదాచుకుంటున్నారు. స్నానం చేసుకోవడానికి కూడా సరైన వసతి లేదు. చిన్నపాటి వర్షం వచ్చినా కారుతోంది. ఇద్దరూ చదువుకోవాలంటే సాధ్యపడదని గ్రహించిన యశోద చదువు మానేసింది.  

చెల్లి చదువు కోసం.. 
చెల్లి ఐశ్వర్యనైనా చదివిద్దామని యశోద నిర్ణయించుకుంది. కుటుంబ భారం, చెల్లి చదువును తన భుజానకెత్తుకుంది. అర కిలోమీటరు దూరంలో ఉన్న ఓ నర్సరీలో మొక్కలకు నీరు పెట్టేందుకు వెళ్తోంది. అయితే అక్కడ నీరు పెట్టినందుకు రోజుకు రూ.50 మాత్రమే ఇస్తున్నారు. ఆ మొత్తంతోనే రోజులు నెట్టుకుంటూ వస్తున్నారు. చెల్లి ఐశ్వర్య సేవామందిరం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.  

మేమున్నామని.. మీకేం కాదని.. 
తల్లిదండ్రుల ఆలనాపాలనకు నోచని అమ్మాయిల కష్టం గురించి తెలుసుకున్న తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మీ, ఎంపీడీఓ రామారావు, ఎస్‌ఐ శ్రీనివాసులు, పలువురు స్వచ్ఛంద సంస్థ, ప్రజాసంఘాల ప్రతినిధులు శుక్రవారం కొడిగెనహళ్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం వేదికగా స్పందించారు. వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అమ్మాయిల సంరక్షణ బాధ్యతలను తాను తీసుకుంటానని సర్పంచ్‌ శ్రీరామప్ప హామీ ఇచ్చారు. యశోద, ఐశ్వర్యలకు అండగా ఉంటామని దివ్య ఎడ్యుకేషనల్‌ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ పరిగి వేణుగోపాలరావు తక్షణసాయంగా రూ.10 వేల నగదు అందజేశారు.

అదే విధంగా ప్రముఖ సామాజక కార్యకర్త, వైఎస్సార్‌సీపీ నేత శివరామిరెడ్డి తన వంతుగా రూ.10 వేలు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మారుతీరెడ్డి సైతం రూ.5 వేలు తక్షణ సాయంగా అందజేశారు. హిందూపురం కౌన్సిలర్‌ సతీష్, ఆర్టీసీ డిపో కంట్రోలర్‌ బాబయ్య సంయుక్తంగా రూ.5 వేలు ఇచ్చారు. భగత్‌సింగ్‌ సేవాసమితి రూ.5 వేలు, ఇరిగేషన్‌ పెనుకొండ డీఈ గోపి రూ.3 వేలు, జెడ్పీ స్కూల్‌ హెచ్‌ఎం దిల్షాద్‌ బేగం రూ.5 వేలు, విశ్రాంత హెచ్‌ఎం ఓబులేసు, ఏఎం లింగణ్ణ కాలేజ్‌ అధ్యాపకుడు రామాంజి తనవంతుగా రూ. 2 వేలతో పాటు నిత్యావసర సరుకులను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.

బాగా చదువుకుంటాం 
అమ్మ, నాన్న లేని జీవితం మాకు శూన్యంగా అనిపించింది. ఆలన, పాలన చూడాల్సిన వారు లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిసింది. దాతలు సహకరిస్తే బాగా  చదువుకుంటాం.          – యశోద, ఐశ్వర్య

ఆర్థికసాయం అందించాలనుకుంటే...
పేరు : కె.యశోద  
అకౌంట్‌ నంబర్‌ : 31382210019948 
కెనరా బ్యాంకు, కొడిగెనహళ్లి బ్రాంచి.
ఐఎఫ్‌ఎస్‌సీ: సీఎన్‌ఆర్‌బీ0013138

 చదవండి: ‘బిడ్డా... లే నాన్న... నువ్వు తప్ప మాకు దిక్కెవరే..’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement