తెలుగు నేలపై విరిసిన పద్మాలు | Padma Awards For Telugu People Andhra Pradesh | Sakshi
Sakshi News home page

తెలుగు నేలపై విరిసిన పద్మాలు

Published Thu, Jan 26 2023 4:52 AM | Last Updated on Thu, Jan 26 2023 10:17 AM

Padma Awards For Telugu People Andhra Pradesh - Sakshi

సంగీతం.. దేవుడిచ్చిన వరం 
తన సంగీతంతో శ్రోతలను ఉర్రూతలూగిస్తూ ఇటీవల ‘80వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు’, ‘28వ క్రిటిక్స్‌ చాయిస్‌ అవార్డు’అందుకున్న ఎంఎం కీరవాణి తాజాగా పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. కీరవాణి నాలుగో ఏటనే తండ్రి వేలు పట్టుకుని సంగీతం వైపు తొలి అడుగులేశారు. ఆరేళ్లప్పుడు రాయచూరులోని దత్తప్ప అనే విద్వాంసుడి వద్ద సంగీతం అభ్యసించారు. వయోలిన్‌పై పట్టు సాధించారు. ఇంజనీర్‌ కావాలని శ్రమించినా సీటు రాలేదు.

ఆ తర్వాత కీరవాణి‘జాలీ ఫ్రెండ్స్‌’అనే ఆర్కెస్ట్రా ట్రూపులో చేరి, పాటలు పాడారు. చెన్నైకి వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద అసిస్టెంట్‌గా చేరారు. తర్వాత వేటూరి వద్ద అసిస్టెంట్‌గా చేరారు. వేటూరి సిఫార్సుతో కీరవాణికి ‘మనసు–మమత’సినిమాకి సంగీత దర్శకునిగా తొలి అవకాశం వచ్చింది. ఆయన ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీతం అందించారు. 

ఆర్చిడ్‌ మొక్కలపై పరిశోధనలకు నాగేశ్వరరావుకు పద్మశ్రీ  
ఏలూరుకు చెందిన డాక్టర్‌ అబ్బారెడ్డి నాగేశ్వరరావు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన ఆర్చిడ్‌ రకానికి చెందిన అరుదైన మొక్కలపై పరిశోధనలు చేస్తున్నారు. సెంటర్‌ ఫర్‌ ఆర్చిడ్‌ జినీ కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఈస్ట్రన్‌ హిమాలయన్‌ రీజియన్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలకు గానూ లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్ట్స్‌లో ఇప్పటికే తన పేరును నమోదు చేసుకున్నారు. 35 రకాల నూతన ఆర్చిడ్‌ జాతి మొక్కలను కనుగొన్నారు.  

సేవామూర్తి చంద్రశేఖర్‌ 
కాకినాడ రూరల్‌: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు కాకినాడకు చెందిన సంకురాత్రి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌కు లభించింది. ఆయన 1943 నవంబర్‌ 20న సింగరాయకొండలో అప్పల నరసయ్య, రామయ్యమ్మ దంపతులకు జన్మించారు. కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే స్థిరపడ్డారు. 1985లో విమాన ప్రమాదంలో చంద్రశేఖర్‌ భార్య మంజరి, కుమారుడు కిరణ్, కుమార్తె శారద మృతి చెందారు. దీంతో ఇండియాకు వచ్చేసిన ఆయన 1989లో సంకురాత్రి ఫౌండేషన్‌ను స్థాపించారు. కాకినాడ రూరల్‌ మండలం పెనుమర్తి వద్ద కంటి ఆస్పత్రి, విద్యాలయం స్థాపించి సేవలు అందిస్తున్నారు.  

ఏటికొప్పాక కళాకారుడికి పద్మశ్రీ  
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామానికి చెందిన సీవీ రాజు(చింతలపాటి వెంకటపతి రాజు)కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన రూపొందించిన ఏటికొప్పాక బొమ్మలు బాగా ప్రాచుర్యం పొందాయి. మొదట సీవీ రాజుది వ్యవసాయ వృత్తే అయినా... 1988లో బొమ్మల తయారీని చేపట్టారు. పిల్లల ఆట వస్తువులు, కుంకుమ భరణిలు డిజైన్‌ చేసి ఎగుమతి చేశారు. 2020లో మన్‌ కీ బాత్‌లో ప్రధానమంత్రి మోదీ.. రాజుతో సంభాషించారు. మళ్లీ గత ఆదివారం కూడా రాజు తయారుచేసిన బొమ్మలను ప్రధాని ప్రశంసించారు. బొమ్మల తయారీలో నైపుణ్యానికి రాష్ట్రపతి అవార్డు రాజుకు లభించింది. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ చోటు దక్కించుకున్నారు.    

హరికథా సామ్రాజ్య సార్వభౌమ.. 
తెనాలి: తెలుగునాట ప్రసిద్ధి చెందిన హరికథకుడు.. కోట సచ్చిదానందశాస్త్రి భాగవతార్‌. రామాయణ, భారత, భాగవతాలను శ్రావ్యంగా, జనరంజకంగా గానం చేస్తూ విశేష ప్రాచుర్యం కల్పించారు. తన సేవలకు గుర్తుగా తాజాగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. సచ్చిదానంద శాస్త్రి స్వస్థలం.. ప్రకాశం జిల్లా అద్దంకి. 14 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో పౌరోహిత్యం చేస్తూనే.. స్వయంగా హరికథాగానం సాధన చేశారు. చతురోక్తులు, సరస సంభాషణలతో వీక్షకుల మనసు తనపైన లగ్నమయ్యేవరకు కాలక్షేపం చేసి, కథాంశంతో హరికథను ఆరంభించేవారు. ఆకాశవాణిలో టాప్‌ ఏ గ్రేడ్‌ ఆర్టిస్టయ్యారు. 

విజయగుప్తాకు పద్మశ్రీ 
సాక్షి ప్రతినిధి, బాపట్ల: వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉన్న విజయగుప్తా అందించిన సేవలకు పద్మశ్రీ దక్కింది. విజయగుప్తా మంచినీటి చేపల పెంపకం కోసం తక్కువ ఖర్చుతో కూడిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. నీలి విప్లవం ద్వారా చేపల ఉత్పత్తిని పెంచిన ఘనతను సొంతం చేసుకున్నారు. విజయగుప్తా చేసిన విశిష్ట పరిశోధనలకు ఇప్పటికే దేశ,విదేశాల్లో పురస్కారాలను అందుకున్నారు. బాపట్లలో జన్మించిన ఆయన గుంటూరు ఏసీ కళాశాలలో బీఎస్సీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివారు. పశ్చిమ బెంగాల్‌ మత్స్యశాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. 22 దేశాల్లో పరిశోధనలు నిర్వహించారు.   

ఇద్దరు శాస్త్రవేత్తలకు పద్మశ్రీ 
శాస్త్ర విజ్ఞాన రంగంలో కేఎన్‌ గణేశ్, పీసీ సూద్‌కు పురస్కారాలు 
సాక్షి, అమరావతి: శాస్త్ర విజ్ఞాన రంగంలో చేసిన విశిష్ట కృషికి ప్రముఖ శాస్త్రవేత్త కేఎన్‌ గణేశ్‌కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. ప్రముఖ బయో ఆర్గానిక్స్‌ శాస్త్రవేత్త అయిన కేఎన్‌ గణేశ్‌ తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌) వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఉన్నారు. కేంబ్రిడ్జ్‌ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేశాక భారత్‌కు తిరిగి వచ్చి 1980లో హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాలిక్యులర్‌ బయాలజీలో చేరారు. భారత్‌లో మొదటి డీఎన్‌ఏ సింథసిస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. డీఎన్‌ఏ గుర్తింపులో రసాయన సూత్రాలు, డీఎన్‌ఏ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై విశేష పరిశోధనలు నిర్వహించారు.  

అణు భౌతిక శాస్త్రంలో పీసీ సూద్‌కు.. 
అణు భౌతిక శాస్త్రంలో చేసిన విశేష కృషికిగాను పీసీ సూద్‌కు పద్మశ్రీ లభించింది. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌లో భౌతిక శాస్త్రవేత్తగా ఆయన పనిచేస్తున్నారు. న్యూక్లియర్‌ ఫిజిక్స్, థియోరాటికల్‌ ఫిజిక్స్, ఎలిమెంటరీ పార్టికల్‌ ఫిజిక్స్‌ల్లో పరిశోధనలు చేశారు. న్యూక్లియర్‌ స్ట్రక్చర్‌ అంశంలో 300కుపైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. వాటిలో 158 పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 

మృదు మధురమైన కంఠస్వరం.. వాణీజయరామ్‌ సొంతం
‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ’.. ఎంత కమ్మని గొంతు. ఉషోదయం వేళ మనసుని ఉల్లాసంగా తట్టిలేపే మృదు మధురమైన కంఠస్వరం వాణీ జయరామ్‌ సొంతం. ‘స్వాతి కిరణం’లోని ఈ పాటను తమిళ పొన్ను (అమ్మాయి) వాణీ జయరామ్‌ స్పష్టంగా తెలుగులో పాడిన తీరు అద్భుతం. ‘శంకరాభరణం’సినిమాలో ‘పలుకే బంగారమాయెనా..’అని పాడితే ‘మీ పాటే మధురమాయెనే..’అని శ్రోతలు కితాబునిచ్చారు. ‘అందెల రవమిది పదములదా..’అంటూ ‘స్వర్ణకమలం’కి పాడితే శ్రోతల మనసులు నాట్యం చేశాయి. ఐదు దశాబ్దాలకు పైబడిన కెరీర్‌లో వాణీ జయరామ్‌ పదివేల పాటలు పాడారు.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ.. ఇలా దాదాపు 20 భాషల్లో పాడారు. ఎనిమిదవ ఏటనే ఆమె ఆల్‌ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్ణాటక సంగీతం, హిందుస్తానీ అభ్యసించిన ఆమె చదువుని నిర్లక్ష్యం చేయలేదు. డిగ్రీ పూర్తయ్యాక చెన్నైలో ఆమెకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్‌కి బదిలీ అయ్యారు. 1969లో జయరామ్‌ని పెళ్లి చేసుకున్నాక కొన్నేళ్ల పాటు ముంబైలో ఉన్నారు. ఏ భాషలో పాడితే అదే ఆమె మాతృభాష అన్నట్లుగా పాడిన వాణీ జయరామ్‌కి ఎన్నో అవార్డులూ రివార్డులూ దక్కాయి. తాజాగా ఆమెను ‘పద్మ భూషణ్‌’వరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement