సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 90,167 మంది అవ్వా తాతలకు ఆగస్టు నెలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఇందులో 89,324 మంది రెగ్యులర్ పింఛన్లు, 843 మంది హెల్త్ పింఛన్లు అందుకోనున్నారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 8 నెలల వ్యవధిలో 11,42,877 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు కావడం గమనార్హం. వీటితో కలిపి మొత్తంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మంగళవారం 61.68 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరగనుంది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛన్ సొమ్ము అందించనున్నారు. ఇందుకోసం రూ.1,496.07 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల బ్యాంకు ఖాతాలకు నిధులను విడుదల చేసింది.
ఐదు నెలల తరువాత పాత విధానంలో పంపిణీ..
► ఈసారి జియో ట్యాగింగ్ విధానంలో కాకుండా పాత పద్ధతి ప్రకారమే బయోమెట్రిక్ ద్వారా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కొత్త పింఛన్లు భారీగా మంజూరు కావడం, పాత బకాయిలు పెద్ద ఎత్తున చెల్లిస్తున్న నేపథ్యంలో పంపిణీలో పారదర్శకంగా వ్యవహరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
► కరోనా, లాక్‌డౌన్ కారణంగా సొంత ఊరికి దూరంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 1,87,442 మందికి కూడా ఈ నెల పింఛన్లను బకాయిలతో కలిపి అందచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. 2,375 మంది ఆరు నెలల పింఛన్ డబ్బులు అందుకోనున్నారు. 5,497 మందికి ఐదు నెలల డబ్బులు, 1,286 మందికి నాలుగు నెలల పింఛన్ చెల్లిస్తారు. 2,399 మందికి మూడు నెలలు, 15,748 మందికి రెండు నెలలు, 1,60,137 మందికి ఒక నెల పింఛను బకాయిలు కలిపి అందించనున్నారు.
► తాము ప్రస్తుతం ఉంటున్న చోట పింఛన్ అందచేయాలని కోరుతూ 13,969 మంది డీఆర్డీఏ అధికారులకు దరఖాస్తు చేసుకోవడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేశారు.
సీఎం విప్లవాత్మక నిర్ణయాలతో సంతృప్త స్థాయిలో పింఛన్లు
పరిపాలనలో సీఎం వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులతో రాష్ట్రంలో సంతృప్త స్థాయిలో పింఛన్లు అందించగలుగుతున్నాం. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే అర్హులకు పింఛను మంజూరు కార్డు అందజేస్తున్నాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రతి నెలా ఒకటో తేదీనే యజ్ఞంలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment