టీడీపీ బంద్‌ను పట్టించుకోని ప్రజలు | People who ignored the TDP bandh Andhra Pradesh | Sakshi
Sakshi News home page

టీడీపీ బంద్‌ను పట్టించుకోని ప్రజలు

Published Thu, Oct 21 2021 4:27 AM | Last Updated on Thu, Oct 21 2021 12:11 PM

People who ignored the TDP bandh Andhra Pradesh - Sakshi

విజయవాడ బీసెంట్‌ రోడ్డులో సాధారణంగానే తెరిచి ఉన్న దుకాణాలు

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: చంద్రబాబు ఇచ్చిన బంద్‌ పిలుపును రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేదు. జనంలో కనీస స్పందన కూడా కనిపించలేదు. టీడీపీ శ్రేణులే దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అక్కడక్కడా కొందరు నాయకులు మాత్రం హడావుడి చేసి సరిపెట్టుకున్నారు. అవి కూడా చాలా స్వల్పమేనని ఆ పార్టీ అంతర్గత నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బంద్‌లో పాల్గొనాలని చంద్రబాబు మంగళవారం రాత్రి నుంచి పార్టీ నేతల్ని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ బాధ్యులు అదేపనిగా ఫోన్లు చేసి ఏదో ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఫలితం కనిపించలేదు. చాలామంది పార్టీ ఇన్‌చార్జ్‌లు చేతులెత్తేసి నియోజకవర్గాలకే రాలేదని స్థానిక నేతలు వాపోతున్నారు. దీంతో కొద్దిచోట్ల ఉత్సాహంగా ఉండే కొందరు స్థానిక నేతలు హడావుడి చేశారు.

తమకు పట్టుందని చెప్పుకొనే విజయవాడలోనే బంద్‌లో ఆ పార్టీ శ్రేణులు అరకొరగా పాల్గొన్నాయి. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చొక్కా చించుకుని, కర్ర పట్టుకుని హల్‌చల్‌ చేసినా అది అరగంట కూడా లేదు. ఆయన వెనుక పట్టుమని పదిమంది కూడా లేరు. నాలుగైదుచోట్ల టీడీపీ జెండాలు చూపిస్తూ ఫొటోలు దిగి వెళ్లిపోయారు. పోలీసులు హౌస్‌ అరెస్టులు చేశారని ఆరోపిస్తున్నా అది కూడా లేదని క్షేత్రస్థాయి వాస్తవాల్ని బట్టి స్పష్టమైంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన అనుచరులు దీనిగురించి అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి చెందిన మెజారిటీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు బంద్‌కు దూరంగా ఉన్నారు. దీన్నిబట్టి పార్టీలోనే బంద్‌కు మద్దతు లేదని స్పష్టమైంది. మరోవైపు సాధారణ ప్రజలకు టీడీపీ బంద్‌ గురించే తెలియని పరిస్థితి నెలకొంది.

తిరుమల బైపాస్‌రోడ్డు శివజ్యోతినగర్‌ వద్ద టీడీపీ నేత కిరాణ దుకాణం 

జన జీవనం యథావిధిగా కొనసాగింది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు సహా అన్ని రవాణా వ్యవస్థలు ఎప్పటిలానే నడిచాయి. విద్య, వ్యాపారసంస్థలు మామూలుగా తెరుచుకున్నాయి. టీడీపీకి మద్దతు ఇచ్చేది లేదని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించడంతో వ్యాపార కార్యకలాపాలు సాధారణంగా జరిగాయి. ఒకటి రెండు చోట్లకు టీడీపీ నేతలు వెళ్లి షాపులు మూసేయాలని చెప్పినా వాణిజ్యవర్గాలు పట్టించుకోలేదు. దీంతో టీడీపీ బంద్‌ ప్రభావం సాధారణ జనంలో ఏమాత్రం లేదని స్పష్టమైంది. బంద్‌ పూర్తిగా విఫలమైనా విజయవంతమైందని టీడీపీ ప్రకటించుకోవడం గమనార్హం. ప్రజలు స్వచ్ఛంధంగా పాల్గొని మద్దతు ఇచ్చారని అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. గృహ నిర్బంధాలు, అరెస్టులు, ఇబ్బందులకు గురిచేసినా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, శ్రేణులు బంద్‌ని విజయవంతం చేసినట్లు పేర్కొన్నారు. బంద్‌కు ఎవరి నుంచి మద్దతు లభించకపోవడంతో చంద్రబాబు కోటరీ అసహనానికి లోనైంది. ఈ నేపథ్యంలో మైలేజి కోసం చంద్రబాబు దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. 

నామమాత్రంగానైనా కనిపించని బంద్‌ ప్రభావం
టీడీపీ రాష్ట్ర బంద్‌ పిలుపుని విశాఖ జిల్లా ప్రజలు పట్టించుకోలేదు. అసలు బంద్‌ ప్రభావమే కనిపించలేదు. జనజీవనం యథావిధిగా సాగింది. ఏజెన్సీ, రూరల్‌ మండలాల్లో బలవంతంగా దుకాణాలు మూయిస్తున్న టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, విశాఖ పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, కార్పొరేటర్లు, టీడీపీ స్థానిక నేతల్ని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని, మధ్యాహ్నం వారి సొంత పూచీకత్తుతో విడిచిపెట్టారు. టీడీపీ కార్యాలయంపై మంగళవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తల దాడికి కారణమైన రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును అరెస్టు చేయాలంటూ భీమిలి పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజెన్సీలో ఉన్న టీడీపీ వర్తకులు మధ్యాహ్నం 12 గంటల తరువాత దుకాణాలు తెరిచారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరూ సహకరించకపోవడంతో వెనుదిరిగారు. అరకు పాడేరు నియోజకవర్గాల్లో వారాంతపు సంతలు యధావిధిగా నడిచాయి. చిత్తూరు జిల్లాలో బంద్‌ ప్రభావం కనిపించలేదు. అక్కడక్కడా టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ప్రజాజీవనం మామూలుగానే కొనసాగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దుకాణాలను మూయించే ప్రయత్నం చేశారు. ఆ వెనుకే వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ, పట్టణ అధ్యక్షుడు చందక సత్తిబాబు, మండల కన్వీనర్‌ ఎం.మైఖేల్‌రాజు షాపులను తెరిపించారు. 
ఒంగోలులో టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన డీమార్ట్‌ షోరూం  

హెరిటేజ్‌ ఫ్రెష్‌లో యథావిధిగా వ్యాపారం
కృష్ణాజిల్లాలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బంద్‌ను పట్టించుకోలేదు. ఎక్కువమంది ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు నాయకులు.. పోలీసులు తమను హౌస్‌ అరెస్టు చేసినట్టు ప్రకటించుకున్నారు. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌ దుకాణాలు కూడా మూసివేయలేదు. విజయవాడ మొగల్రాజపురంలో హెరిటేజ్‌ ఫ్రెష్‌లో వ్యాపారం మామూలుగానే కొనసాగింది. ప్రకాశం జిల్లాలో బంద్‌కు సహకరించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్లను గృహనిర్బంధం చేశారు. టీడీపీ కార్యకర్తలు కొందరు ఒంగోలులోని డీమార్ట్‌ షోరూం సిబ్బందితో గొడవపడి మూసేయాలంటూ షోరూం అద్దాలు పగులగొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతపురంలో జాతీయ రహదారిపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టైర్లకు నిప్పుపెట్టారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడికి వ్యూహరచన చేసిన కొందరిని ముందస్తు సమాచారంతో త్రీటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే  ప్రభాకరచౌదరి, మరికొందరు నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, టీడీపీ నాయకులను అరెస్టు చేసి ఓడీచెరువు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రాప్తాడు మండలం ఎర్రగుంటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త గొర్ల సుదర్శన్‌రెడ్డిపై టీడీపీ నాయకులు దాడిచేశారు.

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు, మైదుకూరుల్లో టీడీపీ నేతలు లింగారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్‌ రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, పార్టీ నాయకులు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి అనంతరం విడిచిపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని హౌస్‌ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పిల్లి అనంతలక్ష్మి, వనమాడి కొండబాబు, జ్యోతుల నెహ్రూలతో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 

తిరగబడిన ప్రయాణికులు
గుంటూరులో టీడీపీ నాయకుడు షేక్‌ నసీర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు బస్టాండ్‌లో బస్సులను ఆపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నేతలు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను గృహ నిర్భంధం చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న ఉండవల్లి గ్రామంలో నలుగురు టీడీపీ కార్యకర్తలు జెండాలతో ఆర్టీసీ బస్సును అడ్డుకుని ప్రయాణికులను దిగాలని కోరగా వారు తిరగబడ్డారు.  

చొక్కాచించుకుని బుద్దా వెంకన్న హైడ్రామా
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుధవారం తమ ఇంటి సమీపంలో తన చొక్కా తానే చించుకుని కొద్దిసేపు హైడ్రామా నడిపారు. బంద్‌కు ప్రజల మద్దతు లేకపోవడంతో ఏదో విధంగా హడావుడి సృష్టించి మీడియాలో హైలెట్‌ కావాలని ప్రయత్నించారు. అందులో భాగంగా విజయవాడ అర్జునవీధిలోని తన ఇంటి దగ్గరికి వచ్చిన కొద్దిమందితో బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆయన్ని వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు ఆపి తమకు సహకరించాలని కోరారు. వెంటనే బుద్దా వెంకన్న తన చొక్కాను చించుకుని పోలీసులపై చిందులు వేయాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం నెరవేరలేదు. వెంకన్న స్వయంగా చొక్కా చించుకున్న వీడియో క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవడంతో నెటిజన్లు ఆయనపై కామెంట్లు చేశారు. తాను ఒకటనుకుంటే మరొకటి కావడంతో వెంకన్న అవాక్కయ్యారు.

ప్రభుత్వ కార్యాలయాలపై టీడీపీ వర్గీయుల దాడి
బంద్‌ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని తూర్పుచోడవరం గ్రామ సచివాలయంపైన, కృష్ణాజిల్లా గంపలగూడెంలోని వైఎస్సార్‌ క్రాంతిపథం (వెలుగు) కార్యాలయంపైన టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడిచేశారు. తూర్పుచోడవరం సచివాలయంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ గ్రామసభ వద్ద అలజడి సృష్టించారు. కుర్చీలను విరగ్గొట్టారు. అడ్డువచ్చిన కూలీ కత్తుల గంగరాజుపై దాడిచేసి గాయపరిచారు. ఆ సమయంలో టీడీపీకి చెందిన సర్పంచ్‌ శంఖవరపు వెంకటలక్ష్మి, వైఎస్సార్‌ సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు చోడసాని సునీత అక్కడే ఉన్నారు. ఈ దాడిపై సచివాలయ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రమేష్, ఉద్యానశాఖ అసిస్టెంట్‌ సత్యనారాయణ నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు గంగరాజు కూడా పోలీసులకు ఫిర్యాదుచేశారు.

ఈ గ్రామ సచివాలయంపై టీడీపీ శ్రేణులు దాడిచేయడం ఈఏడాది ఇది రెండోసారి. పంచాయతీ ఎన్నికలు జరిగిన ఈ ఏడాది ఫిబ్రవరి 21న రాత్రి సచివాలయంపై ఉన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాన్ని రాళ్లతో ధ్వంసం చేశారు. దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అప్పట్లో నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం జరిగిన దాడిని కూడా వారు వీడియో తీశారు. గంపలగూడెంలోని వైఎస్సార్‌ క్రాంతిపథం కార్యాలయంలో వార్డు సభ్యులకు శిక్షణ ఇస్తుండగా వెళ్లిన టీడీపీ కార్యకర్తలు కుర్చీలు విరగ్గొట్టారు. ఈ సంఘటనపై డిజిటల్‌ అసిస్టెంట్‌ నవీన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మందిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌.ఐ. వి.సతీష్‌ తెలిపారు. ఘటనాస్థలాన్ని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, తిరువూరు సీఐ శేఖర్‌బాబు పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement