రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి
అనుకూల ఉద్యోగులతో ప్రత్యేక వ్యవస్థ
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరున్నారో తెలుసుకునేందుకే
ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తున్నట్లు అనుమానాలు
ఫోన్లలో మాట్లాడేందుకు సైతం భయపడుతున్న అధికారులు, ఉద్యోగులు
మంత్రులు, ఐఏఎస్‌లలోనూ వణుకు
సాక్షి, అమరావతి : ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని గుర్తించి, నిరంత నిఘాకు రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖలు, సెక్షన్లల్లో టీడీపీ వేగులు తిష్టవేశారు. ఆ శాఖలు, సెక్షన్లలోనే అనుకూలంగా ఉండే కొందరితో టీడీపీ ఈ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. శాఖల్లో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరిగిందో సమాచారాన్ని వీరు నిరంతరం టీడీపీ పెద్దలకు చేరవేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతుండటంతో అధికారులు, ఉద్యోగుల్లో తీవ్ర భయం నెలకొంది. కొందరు మంత్రులు, ఐఏఎస్ అధికారులు కూడా ఫోన్లలో మాట్లాడేందుకు కూడా జంకుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
మాజీ నాయకులతోనే నిఘా వ్యవస్థ!
సచివాలయ ఉద్యోగుల సంఘానికి గతంలో నాయకులుగా పనిచేసిన పలువురితో పాటు టీడీపీకి అనుకూలంగా ఉండే కీలక అధికారులతో ఈ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వివిధ సెక్షన్లలో పనిచేసే అదనపు కార్యదర్శులు, డిప్యూటీ కార్యదర్శులు, ఇతర అధికారులను టీడీపీ, వైఎస్సార్‌సీపీ, న్యూట్రల్ అని మూడుగా విభజించారు. అందులోనూ ఎవరు ఏ సామాజికవర్గానికి చెందిన వారో కూడా పరిశీలించి, పూర్తిగా తమకు అనుకూలంగా ఉండే వారిని ముఖ్యమైన శాఖల్లో కీలక స్థానాల్లో నియమించారు.
వైఎస్సార్‌సీపీ ముద్ర వేసిన వారిలో కొందరిని జీఏడీకి అటాచ్ చేయగా, మరికొందరిని అప్రాధాన్యమైన పోస్టుల్లోకి పంపించారు. న్యూట్రల్ అనుకున్న వారికీ అప్రాధాన్య పోస్టులు ఇచ్చారు. దాదాపు అన్ని కీలక స్థానాల్లో అనుకూలమైన వారినే పెట్టుకొన్నారు. వారి ద్వారానే సెక్షన్లు, ముఖ్య కార్యదర్శుల పేషీల్లో ఏం జరుగుతుందో నిరంతరం టీడీపీ పెద్దలకు తెలిసే ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది.
పార్టీల ముద్ర వేసి మరీ వేధింపులు
ఎవరైనా ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలపై పిచ్చాపాటిగా మాట్లాడినా, అసంతృప్తి వెలిబుచ్చినా వారి గురించి ఈ నిఘా వర్గాలు ప్రభుత్వ పెద్దలు, ఆయా శాఖల ముఖ్యులకు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా మాట్లాడిన వారిపై వైఎస్సార్‌సీపీ ముద్ర వేసి వేధిస్తుండటం పరిపాటిగా మారిందంటున్నారు. ఐఏఎస్‌లూ ఈ నిఘా దెబ్బకు భయపడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులను ఎవరు, ఎందుకు కలుస్తున్నారు, వారు ఎవరికి సంబంధించిన వ్యక్తులనే సమాచారాన్ని కూడా పెద్దలకు చెబుతున్నట్లు సమాచారం. మంత్రుల పేషీల్లో ఓఎస్‌డీలు, పీఎస్‌లు కూడా స్వేచ్ఛగా మాట్లాడేందుకు జంకుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అనుమానాలు
నిఘాతోపాటు ఫోన్ ట్యాపింగ్ కూడా జరుగుతున్నట్లు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. ఐఏఎస్‌లతోపాటు వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు సైతం ఫోన్లలో మాట్లాడేందుకు భయపడుతున్నట్లు తెలిసింది. వాట్సాప్ కాల్స్ మాట్లడడానికీ వెనుకాడుతున్నారంటే ట్యాపింగ్ భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరి మధ్య సంభాషణ బయటకు తెలిసిపోతుండడంతో కచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు మంత్రులు సైతం స్వేచ్ఛగా మాట్లాడేందుకు జంకుతున్నారు. ఏ కామెంట్ చేసినా, ఎవరిని కలిసినా పెద్దలకు తెలిసిపోతుందంటూ వారు కూడా ఆందోళన వెలిబుచ్చుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment