
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో కాలుష్యానికి ‘మియావాకి’ అడవులతో చెక్ పెట్టాలని పురపాలక శాఖ కార్యాచరణకు ఉపక్రమించింది. కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్న నగరాలు, పట్టణాల్లో తగినంత ఆక్సిజన్‌ను అందించడంతోపాటు జీవవైవిధ్యాన్ని పెంపొందించాలన్నది పురపాలక శాఖ లక్ష్యం. ఇటీవల విశాఖపట్నంలో పైలట్ ప్రాతిపదికగా చేపట్టిన ఈ ప్రాజెక్టును ఇతర నగరాలు, పట్టణాలకూ విస్తరించాలని నిర్ణయించింది.
ఏమిటీ ‘మియావాకి’ అడవుల పెంపకం
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటడం, పరిమిత వ్యయంతో దట్టమైన పచ్చదనాన్ని పెంపొందించేందుకు రూపకల్పన చేసిన విధానమే ‘మియావాకి’ అడవుల పెంపకం. జపాన్‌కు చెందిన అకిరా మియావాకి అనే వృక్ష శాస్త్రవేత్త ఈ విధానానికి రూపకల్పన చేశారు. నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మట్టిని సేంద్రియ విధానంలో ట్రీట్మెంట్ చేసి చుట్టూ ఫెన్సింగ్ నిరి్మస్తారు. అనంతరం మట్టి స్వభావానికి అనుగుణంగా స్థానిక జాతులకు చెందిన వివిధ రకాల మొక్కలనే అడుగుకు ఒకటి చొప్పున ఏడు వరుసలుగా రకరకాల మొక్కలను నాటుతారు. దాంతో మొక్కలు విశాలంగా విస్తరించకుండా పొడవుగా పెరుగుతాయి. పెరిగిన తరువాత మొక్కలు ఒకదానికి ఒకటి అడ్డురాకుండా వాటి ఎత్తు, విస్తరణలను పరిగణనలోకి తీసుకుని తగిన జాతులవే నాటుతారు. దాంతో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో దట్టమైన అడవులుగా రూపుదిద్దుకుంటాయి. ఈ విధానంతో దాదాపు 2.50 లక్షల వ్యయంతో ఒక ఎకరాలో 50 రోజుల్లోనే అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు.
విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్
‘మియావాకి’ అడవుల పెంపకాన్ని పురపాలక శాఖ విశాఖపట్నంలో చేపట్టింది. గాజువాక, మధురవాడలలో 25 ప్రాంతాలను ఎంపిక చేసింది. మొక్కల వేర్ల వరకు నీరు సులభంగా వెళ్లేలా మట్టిని రీఫిల్లింగ్ చేశారు. మారేడు, నేరేడు, పనస, మోదుగు, ఇరిడి, మద్ది, వేప, శ్రీగంధం, తాని, జమ్మి, టేకు, ఉసిరి, సీతాఫలం, వెదురు వంటి దాదాపు 40 రకాల మొక్కలను నాటారు. సేంద్రియ ఎరువులు వాడారు. రూ.50 లక్షలతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. త్వరలోనే విశాఖలోని 25 ప్రాంతాల్లో దట్టమైన ‘మియావాకి’ అడవులు కనువిందు చేయనున్నాయి.
ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా..
‘మియావాకి’ అడవుల పెంపకాన్ని రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లోనూ చేపట్టాలని పురపాలక శాఖ నిర్ణయించింది. తొలుత మిగిలిన 16 మునిసిపల్ కార్పొరేషన్లలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఒక్కో కార్పొరేషన్‌లో 5 నుంచి 10 ప్రాంతాల్లో ఈ ‘మియావాకి’ అడవులను పెంచాలని భావిస్తున్నారు. అందుకోసం ఖాళీ ప్రదేశాలను గుర్తించడంతోపాటు స్థానిక మొక్కల జాతులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇతర మునిసిపాలిటీల్లోనూ కనీసం ఒకటి చొప్పున ‘మియావాకి’ అడవులను పెంచాలన్నది పురపాలక శాఖ ఉద్దేశం.
ఉపయోగాలు ఇవీ..
► ఇంతవరకు ‘అర్బన్ ఫారెస్ట్రీ’ విధానంలో చేపడుతున్న మొక్కల పెంపకం కంటే మియావాకి అడవులు పదిరెట్లు దట్టంగా ఉంటాయి.
► నగరాలు, పట్టణాల్లో విస్తారంగా ఆక్సిజన్‌ను అందిస్తాయి.
► కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్న నగరాలు, పట్టణాల్లో ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి.
► మట్టి కోతను నివారిస్తాయి.
► భూగర్భ జలాలు పెరిగేందుకు ఉపయోగపడతాయి.
► ఎన్నో వృక్ష జాతులతో ఉండే ఈ అడవులు పక్షులు, ఇతర జాతులకు నెలవుగా మారి జీవ వైవిధ్యానికి తోడ్పడతాయి.
Comments
Please login to add a commentAdd a comment