కేంద్రం నుంచి 41.84 లక్షల మందికి రూ.836.89 కోట్లు విడుదల
ప్రతి రైతుకూ రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయమందిస్తామని చంద్రబాబు హామీ
పగ్గాలు చేపట్టి 4 నెలలైనా పైసా కూడా జమ చేయని వైనం
చంద్రబాబు తీరుపై మండిపడుతున్న అన్నదాతలు
సాక్షి, అమరావతి: రైతుల ఖాతాల్లోకి ప్రధానమంత్రి కిసాన్ 18వ విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున కేంద్రం జమ చేస్తోంది. 2024–25 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి రెండో విడతగా శనివారం 41.84 లక్షల మందికి రూ.836.89 కోట్లను కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. 2024–25 సీజన్‌లో తొలివిడత సాయం కింద 40.91 లక్షల మందికి రూ.824.61 కోట్లు జూన్ 18న జమ చేసిన విషయం విదితమే.
సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చి..
తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్ పేరిట చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. చంద్రబాబు సర్కారు కొలువుదీరి నాలుగు నెలలు పూర్తయినా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో పైసా కూడా జమ చేయలేదు.
కనీసం అక్టోబర్‌లో అయినా పీఎం కిసాన్ సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని రైతులు ఆశించారు. కానీ.. కూటమి ప్రభుత్వం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. పెట్టుబడి సాయం జమ చేయకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
ఐదేళ్లూ ఠంఛన్‌గా ఇచ్చిన జగన్ ప్రభుత్వం
వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఇచ్చిన హామీ కంటే మిన్నగా సాయం అందించి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున జమ చేసింది.
ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే మే నెలలో తొలి విడతగా రూ.7,500 చొప్పున, రబీ సీజన్‌కు ముందు అక్టోబర్‌లో రెండో విడతగా రూ.4,000 చొప్పున, జనవరిలో పంట చేతికొచ్చే సమయంలో మూడో విడతగా రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఇలా ఐదేళ్ల పాటు సగటున 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్లు పెట్టుబడి సాయంగా అందించి వారికి తోడుగా నిలిచింది.
పెట్టుబడి సాయం కోసం ఉద్యమిస్తాం
ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్ పేరిట హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం నాలుగు నెలలైనా ఆ ఊసెత్తడం లేదు. కనీసం ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదు. కేంద్రం ఇప్పటికే రెండు విడతల్లో పీఎం కిసాన్ సాయం జమ చేసింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పైసా కూడా పెట్టుబడి సాయం అందించలేదు. తక్షణమే పెట్టుబడి సాయం జమ చేయకపోతే రైతుల తరఫున ఉద్యమిస్తాం – జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం
జగన్ హయాంలో మేలు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఐదేళ్లూ ఏటా క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం జమ చేసి రైతులకు ఎంతో మేలు చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేయడం దుర్మార్గం. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 76 లక్షల మంది రైతులతోపాటు కౌలు రైతులకు కూడా తక్షణమే పెట్టుబడి సాయం అందించాలి. లేకుంటే రైతుల తరఫున వైఎస్సార్‌సీపీ రైతు విభాగం ఉద్యమిస్తాం. – వడ్డి రఘురామ్, వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
Comments
Please login to add a commentAdd a comment