
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ఏయూ క్యాంపస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారయ్యింది. ఈ సందర్భంగా మొత్తం రూ.10,742 కోట్లు విలువ చేసే ఐదు నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తయిన రెండు ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేస్తారు. ఇందుకోసం ప్రధాని ఈ నెల 11వ తేదీన విశాఖపట్నానికి చేరుకుంటారు. ఆ రోజు సా.5.30 గంటలకు మధురై విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 7.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.
ఆ తర్వాత చోళ షూట్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక 12వ తేదీ ఉ.10.10 గంటలకు చోళ షూట్ నుంచి ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో జరగనున్న బహిరంగ సభకు బయల్దేరుతారు. 10.30 గంటలకు రోడ్డు మార్గంలో అక్కడకు చేరుకుని 11.45 వరకు జరిగే బహిరంగ సభలో ఈ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని 12.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు తిరుగు ప్రయాణం అవుతారు.
సిద్ధమవుతున్న సభావేదిక
మరోవైపు.. 12వ తేదీన జరిగే బహిరంగ సభకు ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాన వేదికను రేయింబవళ్లు తీర్చిదిద్దుతున్నారు. రెండు భారీ జర్మన్ టెంట్ల ఏర్పాటు ఇప్పటికే పూర్తికావొచ్చింది. ఇక మద్దిలపాలెం గేట్ నుంచి ఏయూలోకి ప్రధాన మంత్రి ప్రయాణించే మార్గంలో రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నారు. దారిపొడవునా, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మైదానం చుట్టూ వీటిని ఏర్పాటుచేశారు. ఈ మొత్తం ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
బాంబు స్క్వాడ్ విస్తృత తనిఖీలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు, బాంబు స్క్వాడ్ అణువణువూ తనిఖీ చేస్తున్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రముఖులు పాల్గొననుండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాన వేదికకు ఎదురుగా భారీగా ఫ్లెక్సీలనూ ఏర్పాటుచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment