పోలవరం కాలువ గట్టుపై అక్రమాలు
కాలువ గట్టును కొల్లగొట్టి జోరుగా విక్రయాలు
వివిధ ప్రాంతాలకు టిప్పర్లలో తరలిపోతున్న గ్రావెల్ మట్టి
ద్వారకాతిరుమల: పోలవరం కాలువ గట్టుపై పచ్చ ముఠా పేట్రేగిపోతోంది. విలువైన గ్రావెల్ మట్టిని అక్రమంగా తవ్వి తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో కొందరు సాగిస్తున్న ఈ దందా రోజురోజుకు ఉధృతమవుతోంది. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి, లైన్ గోపాలపురం, పరిసర ప్రాంతాల్లోని పోలవరం కుడి కాలువ గట్టుపై గ్రావెల్ మట్టి అక్రమ తవ్వకాలు గత కొన్నాళ్లుగా యథేచ్ఛగా సాగుతున్నాయి.
ప్రస్తుతం కాలువకు రెండు పక్కల గట్లపై పొక్లెయిన్లు పెట్టి, రాత్రీ పగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఈ తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్ల రాకపోకలు జరిగే సమయంలో గట్టుపై మట్టి పైకి లేచి, టిప్పర్ డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుండటంతో, ఒక వాటర్ ట్యాంకర్ ద్వారా గట్టును తడుపుతున్నారు. నిత్యం ఇక్కడి నుంచి సుమారు 100 టిప్పర్లకు పైగా మట్టి బయటకు తరలిపోతోంది. ఒక్కో టిప్పర్ మట్టిని దూరాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.11 వేలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాలువ మట్టి పొలసానిపల్లి, ఏలూరు, భీమవరం పరిసర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిపోతోంది.
అనుమతులు ఉన్నాయంటూ దందా..
తవ్విన మట్టిని మరో ప్రాంతానికి తరలించాలంటే కచ్చితంగా ఇరిగేషన్, మైనింగ్ శాఖల అనుమతులు తప్పనిసరి. ఎం.నాగులపల్లి, లైన్ గోపాలపురంలో తవ్వకాలు జరుపుతున్న పచ్చ నేతల్లో ఒకరు సుమారు 5 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు పొందారు. మైనింగ్ శాఖ నుంచి అనుమతులు పొందకుండానే తవ్వకాలు జరుపుతున్నారు. ఇదేంటని స్థానికులు ఎవరైనా ప్రశి్నస్తే మాకు అనుమతులు ఉన్నాయంటూ తమ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో ఎం.నాగులపల్లి, లైన్ గోపాలపురంకు చెందిన ఆయన అనుచరులు ఈ దందాకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు.
తవ్వకాల వైపు కన్నెత్తి చూడని అధికారులు..
పట్టపగలు అక్రమ తవ్వకాలు సాగుతున్నా ఆ వైపు అధికారులెవరూ కన్నెత్తి చూడటం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అనుమతులు ఉన్నాయి మీకెందుకు రిస్క్.. మీ పని మీరు చూసుకోండి అని అధికారులు చెబుతున్నారట. అక్రమార్కులకు అధికారులు ఇలా కొమ్ముకాయడం దారుణమని పలువురు అంటున్నారు. ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇచ్చిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో, అది కూడా మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారని ధ్వజమెత్తుతున్నారు.
ఉప ముఖ్యమంత్రికి ఇవి కనబడవా..
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల ఐఎస్ జగన్నాథపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, అక్కడ జరిగిన గ్రావెల్ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్ తవ్వకాల్లో వైఎస్సార్‌సీపీ నాయకుల పాత్ర ఏమైనా ఉందేమో విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పోలవరం కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు ఆయనకు కనబడటం లేదా అని స్థానికులు ప్రశి్నస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment