వార్షిక క్రైమ్ రిపోర్టును మీడియాకు చూపిస్తున్న డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు శాఖ నేరాలను నియంత్రించి శాంతిభద్రతలను సమర్థంగా పరిరక్షిస్తోందని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. వినూత్న పోలీసింగ్ విధానాలతో 2022లో అన్ని రకాల నేరాలు తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన భద్రతను అందించగలిగామని తెలిపారు.
ఆయన బుధవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పోలీసు శాఖ వార్షిక నివేదిక – 2022ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి, అక్రమ మద్యం దందాను సమర్థంగా కట్టడి చేశామన్నారు.
అసాంఘిక శక్తులపై నిఘా, పీడీ యాక్ట్ ప్రయోగం, తక్షణ అరెస్టులతో రాష్ట్రంలో హత్యలు, ఘర్షణలను నియంత్రించినట్లు తెలిపారు. గ్రామాల సందర్శన, అవగాహన కార్యక్రమాలతో ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు, దాడులను గణనీయంగా తగ్గించామన్నారు. దిశ వ్యవస్థను పటిష్టంగా అమలు చేశామన్నారు. నేర ప్రభావిత ప్రదేశాల జియో మ్యాపింగ్, మహిళా పోలీసుల పర్యవేక్షణ తదితర చర్యలతో మహిళా భద్రతను పటిష్టం చేసినట్లు చెప్పారు.
రోడ్లపై బ్లాక్ స్పాట్‌లు గుర్తించడం, ఇతరత్రా చర్యలతో రోడ్డు ప్రమాదాలను తగ్గించామన్నారు. లోన్ యాప్ వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో 36 అవార్డులు సాధించిందని చెప్పారు.
420 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ పోస్టుల్లో హోంగార్డులకు తొలిసారిగా రిజర్వేషన్ కల్పించామన్నారు. కొత్తగా నాలుగు ఐఆర్ బెటాలియన్లు మంజూరయ్యాయని అన్నారు. 2023లో కూడా సమర్థ పోలీసింగ్‌తో శాంతిభద్రతలను పరిరక్షిస్తామని చెప్పారు.
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించిన ప్రధానాంశాలు ఇవీ...
► 2020లో రాష్ట్రంలో 2,92,565 కేసులు, 2021లో 2,84,753 కేసులు నమోదు కాగా 2022లో కేసులు 2,31,359కి తగ్గాయి. గత సంవత్సరంతో కలిపి పెండింగ్ కేసులు 3,77,584 ఉండగా, 2,66,394 కేసుల దర్యాప్తు పూర్తయింది. దీంతో పెండింగ్ కేసుల సంఖ్య 1,11,190కి తగ్గింది. 96 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు చేశారు.
నేరాలకు శిక్షలు 66.69 శాతానికి పెరిగాయి. 2020లో 21 పోక్సో కేసుల్లో శిక్షలు పడగా, 2022లో ఆరు నెలల్లోనే 90 కేసుల్లో శిక్షలు పడ్డాయి. 42 కేసుల్లో జీవిత ఖైదు పడటం గమనార్హం. రాష్ట్రంలో 2021లో 945 హత్య కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 857కు తగ్గాయి. రోడ్డు ప్రమాదాలు 2021లో 19,203 జరగ్గా 2022లో 18,739కు తగ్గాయి.
► లైంగిక దాడి కేసులు 2021లో 1,456 నమోదు కాగా, ఈ ఏడాది 1,419 నమోదయ్యాయి. పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో మహిళలు ధైర్యంగా ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో కేసుల సంఖ్య పెరిగింది. మహిళలపై వేధింపుల్లో 2021లో 10,373 కేసులు నమోదు కాగా 2022లో 11,895 నమోదయ్యాయి.
► దిశ యాప్‌ను 1,37,54,267 మంది డౌన్‌లోడ్ చేసుకోగా, 1,11,08,227 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2022లో దిశ యాప్ వినతుల్లో 17,933 కేసుల్లో తక్షణ చర్యలు తీసుకుని 1,585 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
► ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారం కేసులు 2021లో 231 నమోదు కాగా, 2022లో 205కు తగ్గాయి. దాడులపై 2021లో 606 నమోదవగా 2022లో 585
నమోదయ్యాయి.
► అక్రమ మద్యం, నాటుసారాపై మొత్తం 37,189 కేసులు నమోదు చేసి 28,803 మందిని అరెస్టు చేశారు. 169 మందిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. 2,093 గ్రామాలను నాటు సారా లేని గ్రామాలుగా ప్రకటించారు. కేవలం 103 గ్రామాలు మాత్రమే నాటు సారా లేని గ్రామాలుగా ప్రకటించాల్సి ఉంది. నాటుసారా తయారీపైనే ఆధారపడుతున్న 1,363 కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించారు.
► ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 7119.85 ఎకరాల్లో గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. కేవలం ఐదు రోజుల్లో 720 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,45,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 70 శాతం ఒడిశా నుంచి తరలిస్తున్నదే.
Comments
Please login to add a commentAdd a comment