
జొన్నలగడ్డ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులతో వాహనదారుల వాగ్వాదం
గరికపాడు (జగ్గయ్యపేట అర్బన్)/నందిగామ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణలో పగటి పూట లాక్‌డౌన్ ఎత్తివేయడంతో పాటు ఆదివారం కావడంతో ఆంధ్రా నుంచి వెళుతున్న వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. తెలంగాణలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద, నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద తెలంగాణలోకి వెళ్లే వాహనాలను ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ప్రజలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉదయం నుంచి వాహనాలను నిలిపేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
తెలంగాణలోని కోదాడ పట్టణ ఎస్‌ఐ సైదులు మాట్లాడుతూ ఈ–పాస్ లేని వాహనాలకు అనుమతి లేదని చెప్పారు. రామాపురం చెక్‌పోస్టు మీదుగా రాత్రి నుంచి ఇప్పటివరకు ఈ–పాస్ ఉన్న 700కు పైగా వాహనాలను అనుమతించామని, ఈ–పాస్ లేని 1,500 వాహనాలను వెనక్కు పంపామని తెలిపారు. ప్రయాణికులు ఈ–పాస్‌తో వచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు. తెలంగాణలోని మధిర పట్టణం రెడ్‌జోన్ కావడంతో ఎవ్వరినీ అనుమతించబోమని, ఈ పాస్ ఉన్న వారిని మాత్రమే వెళ్లనిస్తామని జొన్నలగడ్డ వద్ద పోలీసులు చెప్పారు. దీంతో చేసేదిలేక కొందరు వెనుదిరగగా, అక్కడే మధ్యాహ్నం వరకు వేచి ఉన్న వారిని మాత్రం ఎట్టకేలకు పోలీసులు అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment