
గుంటూరు: శాంతియుతంగా సమస్యను పరిష్కరించాల్సిన సీఐ రెచ్చిపోవడంతో ఓ మామూలు వివాదం శాంతిభద్రతలకే విఘాతం కలిగించే పరిస్థితికి దారితీసింది. ఫిర్యాదు చేసిన దళితులపైనే విచక్షణ మరిచి తన ప్రతాపం చూపడంతో.. ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఓ యువకుడిని సీఐ తుపాకీతో కొట్టడంతో న్యాయం చేయాల్సిన తమపైనే దాడిచేయడం ఏమిటని ప్రజలు ముట్టడించడంతో సదరు సీఐ అక్కడి నుంచి ఆటోలో జారుకున్నారు. ఆగ్రహించిన ప్రజలు స్థానిక అంబేడ్కర్ బొమ్మ వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలోని శాంతిపేటలో పోలేరమ్మ ఆలయ స్థలం ఉంది.
ఈ స్థలాన్ని స్థానిక వ్యక్తి ఒకరు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ స్థలంలో సోమవారం షెడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వివాదం చెలరేగింది. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ మురళీ, తన సిబ్బందితో అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడికి ఫిరంగిపురం సీఐ బి.రవీంద్రబాబు హోంగార్డుతో అక్కడికి చేరుకున్నారు. వచ్చీ రావడంతో అక్కడ గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వారిని విచక్షణారహితంగా కొట్టారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఫిర్యాదు చేసిన తమపైనే దాడి చేయడమేమిటని అక్కడి యువకులు ప్రశ్నించడంతో సీఐ ఆగ్రహానికి గురయ్యారు.
తన గన్ బయటకుతీసి అఖిల్ అనే యువకుడిని కొట్టడంతో అతనూ గాయపడ్డాడు. దీంతో స్థానికులు సీఐ రవీంద్రబాబును ముట్టడించడంతో ఆయన అక్కడి నుంచి ఆటోలో జారుకున్నారు. అనంతరం.. దళితులు సీఐ డౌన్ డౌన్ అంటూ స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న గుంటూరు డీఎస్పీ భానూదయ మేడికొండూరు, నల్లపాడు సీఐలు నాగూల్ మీరా, వంశీధర్‌తో అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. సీఐపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్థానికులు పట్టుబట్టడంతో వారికి సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.