విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులకు రాజకీయ బదిలీలు
పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకూ రేటు
‘సాక్షి’ చేతికి చిక్కిన పెద్దల సిఫారసు లేఖలు, అంతర్గత జాబితాలు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీల ప్రజాప్రతినిధులు అందినకాడికి దండుకోవడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు వారికి రూ. లక్షలు కుమ్మరిస్తున్నాయి. ఆ కోవలోనే విద్యుత్ శాఖలో కూడా భారీగా డబ్బులు చేతులు మారాయి. అర్హతను, నిబంధనలను బట్టి చేయాల్సిన బదిలీల్లో రాజకీయ నేతల సిఫారసు లేఖలే రాజ్యమేలుతున్నాయి.
ఏ ఉద్యోగిని కదపాలన్నా, ఎక్కడికి బదిలీ చేయాలన్నా, ఉన్నచోటనే ఉంచాలన్నా.. ఈ లేఖా్రస్తాన్ని సంధిస్తే చాలు పనైపోతోంది. ఇందుకోసం ఒక్కో పోస్టుకు దాని ప్రాధాన్యతను బట్టి రూ.5 లక్షల నుంచి దాదాపు రూ.30 లక్షల వరకూ ఉద్యోగులు సమర్పించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగుల బదిలీలకు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన సిఫారసు లేఖలు, వాటి ఆధారంగా విద్యుత్ సంస్థలు తయారు చేసిన రాజకీయ బదిలీల జాబితాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి.
నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్నతాధికారులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తమ మాట వినని వారిని వేధించడం, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు వంటి చర్యలను చూస్తున్న ఉన్నతాధికారులకు ఆ పారీ్టల నేతలు చెప్పింది చేయడం తప్ప మరో గత్యంతరం లేదు. తమకు అనుకూలురైన వారిని కూటమి ప్రభుత్వం అందలం ఎక్కిస్తోంది.
విద్యుత్ సంస్థల్లోని డైరెక్టర్ల చేత బలవంతంగా రాజీనామా చేయించిన ప్రభుత్వం ఏపీఈపీడీసీఎల్‌లో ఫైనాన్స్ డైరెక్టర్‌గా ఉన్న చంద్రానికి మాత్రం ఏపీసీపీడీసీఎల్‌లోనూ అదే స్థానాన్ని కట్టబెట్టింది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో ఆయనకు సత్సంబంధాలు ఉండటంతోనే రెండు డిస్కంలలో ఒకే పోస్టులో కొనసాగుతున్నారు.
ఇక బదిలీల కోసం ప్రజాప్రతినిధులు సిఫారసు చేసిన ఉద్యోగుల పేర్లతో ప్రత్యేకంగా జాబితాలను సీఎండీలు తయారు చేయించారు. ఆ జాబితాలు దగ్గర పెట్టుకుని బదిలీల ప్రక్రియను జరిపిస్తున్నారు. డబ్బులు ఇచ్చుకోలేని వారు, ఎవరి నుంచీ రాజకీయ సిఫారసులు తీసుకుని రాలేని వారు దీనివల్ల బలైపోతున్నారు. వారిని అప్రా«దాన్య పోస్టుల్లోకి, ప్రాంతాలకు బదిలీ చేసేస్తున్నారు.
ఇవిగో సాక్ష్యాలు
» ఏలూరు సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (ఏఈఈ) రాజమండ్రి డి7 సెక్షన్‌కు బదిలీ కోసం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీకి ప్రస్తుత రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో పాటు, మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిఫారసు చేశారు.
» విశాఖ సర్కిల్‌లో ఓ ఏఈఈని రాజమండ్రి సర్కిల్‌లోని గోపాలపట్నం రూరల్ సెక్షన్‌కు బదిలీ చేయాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సిఫారసు చేశారు.
» మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఓ ఏఈని ఏలూరు సర్కిల్ నుంచి రాయవరం బదిలీ చేయమని చెప్పారు.
» రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ ఏలూరు సర్కిల్ నుంచి ఓ ఏఈఈని సంపత్‌నగరం పంపమన్నారు. n ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) ఓ ఏఈని రాజమండ్రి సర్కిల్ నుంచి ఏలూరు సర్కిల్‌కు బదిలీ చేయాలని సిఫారసు చేశారు.
» ఏలూరు సర్కిల్‌లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్(ఏడీఈ)ని కొయ్యలగూడెం సబ్ డివిజన్‌కు మార్చాల్సిందిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సీఎండీకి లేఖ ఇచ్చారు.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో పాటు ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కోలలో జరుగుతున్న బదిలీలు మొత్తం ఇదే విధంగా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల ఆధారంగానే జరుగుతున్నాయి. (ఆ ఉద్యోగుల పేర్లు, వారు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల పేర్లతో సహా ‘సాక్షి’ వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వారి ఉద్యోగ భద్రత దృష్ట్యా ఆ వివరాలను ప్రచురించడం లేదు.)
మేమెందుకు తగ్గాలి?
బదిలీల్లో పలువురు ఉన్నతాధికారులూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఏపీసీపీడీసీఎల్‌కు కొత్త సీఎండీని నియమించినా ఇటీవల బదిలీపై వచ్చిన ఉన్నతాధికారే మొత్తం బదిలీల ప్రక్రియను చూస్తున్నారు. ఈ డిస్కం పరిధిలో ఓ ఎమ్మెల్యేకి మరో ఉన్నతాధికారి స్వయంగా డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్‌లో ఓ ఉన్నతాధికారి పశి్చమ గోదావరి జిల్లాలో ఉన్న ఓ ఉద్యోగి సాయంతో సొంత వారి చేత వసూళ్ల పర్వాన్ని నడిపిస్తున్నారు.
రాజమండ్రికి చెందిన ఓ యూనియన్ నేత మధ్యవర్తిగా వ్యవహరిస్తూ డబ్బులు వసూలు చేసి సంబంధిత అధికారులకు సమర్పిస్తున్నారు. ఇక ఏపీఎస్పీడీసీఎల్‌లో ఓ ఉన్నతాధికారికి మూడు డిస్కంలతో అనుబంధం ఉండటంతో ప్రజాప్రతినిధులకు అనుగుణంగా వాటిని నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నతాధికారులు సామాజిక సమీకరణాలకు కూడా పెద్దపీట వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment