సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్రంలో మూడు పట్టభద్రులు, రెండు టీచర్, నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. తొమ్మిది స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నుంచి పెద్దఎత్తున స్పందన కనిపించింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో స్వల్ప సంఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి.
స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1,538 పోలింగ్ స్టేషన్లలో ఉ.8 గంటలకు మొదలైన పోలింగ్ సా.4 గంటలకు ముగిసింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 63.65 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 95 శాతానికిపైగా, టీచర్ల నియోజకవర్గాల్లో 87.15 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ప్రాథమిక సమాచారం. పోలైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సమయం ముగిసినప్పటికీ చాలామంది ఓటర్లు ఇంకా క్యూలైన్లలోనే ఉన్నారు.
దీంతో సా.4 గంటలకు క్యూలైన్లో ఉన్నవారినీ కూడా ఓటింగ్‌కు అనుమతించారు. పోలింగ్ ప్రక్రియను పూర్తిగా వెబ్‌కాస్టింగ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనా సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని సమీక్షిస్తూ అధికారులకు సూచనలు చేశారు. ఇక పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. మార్చి 16న ఉ.8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు పెట్టడానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.
ప్రశాంత పోలింగ్‌కు పటిష్ట చర్యలు
ఇక రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంది. 20 జిల్లాల్లోని 1,535 పోలింగ్ కేంద్రాల్లో 125 కేంద్రాలు అత్యంత సున్నితమైనవి, 498 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 912 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించింది. తదనుగుణంగా పోలింగ్ సక్రమ నిర్వహణకు తగిన బందోబస్తు ఏర్పాటుచేసింది. మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, క్యూఆర్ టీమ్‌లను వినియోగించింది. ముందస్తు చర్యల్లో భాగంగా 7,093 లైసెన్స్‌డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని భావించిన 6,792 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతోపాటు 1,858 మందిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీచేసింది. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి రూ.75.94లక్షల నగదు, 2,909 లీటర్ల మద్యాన్ని జప్తుచేసింది.
జిల్లాల వారీగా ఇలా..
- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి జిల్లాలో 8,165 మంది ఓటర్లకు గానూ 7,215 మంది.. పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి 1,07,632 మంది ఓటర్లకు గానూ 68,695 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పొదలకూరులో, కలెక్టర్ చక్రధర్‌బాబు దంపతులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి పశ్చిమ గోదావరిలో రెండు స్థానాలకు 15 నియోజకవర్గాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1,105 ఓట్లకు గాను పోలింగ్ ముగిసేసరికి 1,088 ఓట్లు నమోదయ్యాయి. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ, మంతెన సత్యనారాయణరాజుతో పాటు కొందరు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు.
- తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకాశం జిల్లాలోనూ ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మూడు డివిజన్లలో కలిపి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు 91.40 శాతం, పట్టభద్రుల నియోజకవర్గానికి 69.23 శాతం పోలింగ్ నమోదైంది.
- అన్నమయ్య జిల్లా పరిధిలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికలు జరిగాయి. అలాగే, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ రాయలసీమ పరిధిలో పట్టభద్రుల స్థానానికి 68.31 శాతం, ఉపాధ్యాయుల స్థానానికి 93.36శాతం పోలింగ్ నమోదైంది. తూర్పు రాయలసీమ పరిధిలో పట్టభద్రులకు 66.93 శాతం, ఉపాధ్యాయులు 88.77 శాతం వంతున నమోదైంది.
- కర్నూలు జిల్లాలో పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సోమవారం ప్రశాంతంగా జరిగింది. పట్టభద్రులకు సంబంధించి సా.4గంటలకు 59.37 శాతం పోలింగ్ నమోదైంది. తుది పోలింగ్ శాతం విడుదల కావాల్సి ఉంది. ఇక టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి 90.26 శాతం మంది ఓటు వేశారు.
- వైఎస్సార్ జిల్లా టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 91.31శాతం పోలింగ్ నమోదైంది. అలాగే, పట్టభద్రుల స్థానానికి 72.01శాతం నమోదైంది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తిరుపతిలోని రెండు కేంద్రాల్లో రీపోలింగ్
చిత్తూరు కలెక్టరేట్ : తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తిరుపతిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. చిన్నబజారు వీధిలోని 229, సత్యనారాయణపురంలోని 233 పోలింగ్ బూత్‌ల్లో రిగ్గింగ్ జరిగిందని కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు కలెక్టరేట్ అధికారులు నివేదిక పంపారు. దీంతో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులిచి్చంది. ఈనెల 15న ఉ.8 గంటల నుండి సా.4 గంటల వరకు ఆ రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసినట్లు రిటరి్నంగ్ అధికారి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment