నిర్మించి లీజుకిస్తేనే లాభం!  | Port Revenue Losing Heavily With PPP Policy | Sakshi
Sakshi News home page

నిర్మించి లీజుకిస్తేనే లాభం! 

Published Mon, Dec 7 2020 4:27 AM | Last Updated on Mon, Dec 7 2020 4:27 AM

Port Revenue Losing Heavily With PPP Policy - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం(పీపీపీ)తో పోర్టుల నిర్మాణం ద్వారా భారీగా ఆదాయాన్ని నష్టపోతుండటంతో సొంతంగా నిర్మించి లీజుకివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా అధికాదాయాన్ని ఆర్జించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులను ల్యాండ్‌ లార్డ్‌ (నిర్మించి లీజుకివ్వడం) విధానంలో ఏపీ మారిటైమ్‌ బోర్డు నిర్మిస్తోంది. గడిచిన ఆరేళ్లలో రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రయివేటు పోర్టులు కాకినాడ డీప్‌వాటర్, గంగవరం, కృష్ణపట్నం రూ.18,062.32 కోట్ల విలువైన ఆదాయాన్ని ఆర్జిస్తే.. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఖజానాకు వచ్చింది కేవలం రూ.978.58 కోట్లు మాత్రమే. అంటే వేలాది ఎకరాలిచ్చి, మౌలిక వసతులు కలి్పస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు శాతం ఆదాయమే లభిస్తోంది. తక్కువ వ్యాపారం చేసిన కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు ద్వారా రాష్ట్ర ఖజానాకు అధికాదాయం వస్తే, ఎక్కువ లావాదేవీలు నిర్వహిస్తున్న గంగవరం, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఆదాయం తక్కువగా ఉంటోంది.  

డీప్‌వాటర్‌ పోర్టుదే అగ్రస్థానం 
2014–15 నుంచి 2019–20 ఆరేళ్ల కాలంలో ఈ మూడు పోర్టుల ద్వారా రాష్ట్ర ఖజానాకు సమకూరిన 978.58 కోట్లలో రూ.599.94 కోట్లు ఒక్క కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు నుంచే వచ్చింది. మిగిలిన రెండు పోర్టుల నుంచి వచ్చింది రూ.378.64 కోట్లే. దీనికి కారణం కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టును ప్రభుత్వం నిర్మించి ఆ తర్వాత ప్రయివేటు సంస్థకు అప్పజెప్పింది. దీనివల్ల ఈ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 22 శాతం ఉంది. అదే పీపీపీ విధానంలో నిర్మించిన గంగవరం, కృష్ణపట్నం పోర్టుల్లో ప్రభుత్వ వాటా వరుసగా 2.1, 2.6 శాతంగా ఉంది. దీనివల్ల ఈ రెండు పోర్టులు అధిక వ్యాపారం చేస్తున్నా రాష్ట్ర ఖజానాకు వస్తోంది మాత్రం చాలా స్వల్పం.

ఈ ఆరేళ్లలో ఈ మూడు పోర్టులు 497.206 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా రూ.18,062.32 కోట్ల ఆదాయాన్నార్జించాయి. ఇందు లో కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు కేవలం 88.74 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేస్తే, గంగవరం పోర్టు 148.804, కృష్ణపట్నం పోర్టు 259.662 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేసింది. సరుకు రవాణా ద్వారా డీప్‌వాటర్‌ పోర్టుకు రూ.2,687.93 కోట్లు, గంగవరం పోర్టు రూ.4,921.45 కోట్లు, కృష్ణపట్నం పోర్టు రూ.10,452.94 కోట్లు ఆర్జించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నాటికి ఈ మూడు పోర్టులు 77.745 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ.1,899.92 కోట్ల ఆదాయాన్ని పొందాయి. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఈ ఏడాది రూ.108.29 కోట్ల ఆదాయం సమకూరింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement