
అన్నమయ్య జిల్లా: కూటమి సర్కార్ అక్రమంగా పెట్టిన కేసులో అరెస్టైన ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో సబ్ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు.. ఈసీజీతో పాటు మరికొన్ని రక్ష పరీక్షలు నిర్వహించారు. బీపీతో పాటు ఈసీజీలో తేడాలున్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం పోసానిని కడప రిమ్స్‌కు తరలించారు. గత రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసాని.. కొంతకాలంగా కడుపులో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఎడమ భుజం నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. తీవ్రమైన గొంతునొప్పితో కూడా బాధపడుతున్న పోసాని.. మాట్లాడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు.
పోసాని తీవ్రమైన గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్నారు. అబ్డామిన్ హెర్నియా సర్జరీలో ఇన్‌ఫెక్షన్ వల్ల పోసానికి తీవ్రమైన సమస్య ఉంది. హెర్నియా సర్జరీ తర్వాత నెలరోజులు ఆస్పత్రిలోనే పోసాని చికిత్స తీసుకున్నారు తీవ్రమైన వెన్నునొప్పితో మూడుసార్లు వోకల్ కార్డు సర్జరీ జరిగింది.కొద్ది రోజుల క్రితం పోసానికి గుండెకు సంబంధించిన చికిత్స జరగగా, హార్ట్ సర్జరీ చేసిన స్టంట్ వేశారు వైద్యులు. హార్ట్ సర్జరీ తర్వాత ఛాతిలో నొప్పితో బాధపడుతున్నారు పోసాని

కాగా, పోసాని కృష్ణ మురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. గురువారం రాత్రి 9 గంటలకు పోలీసులు కృష్ణ మురళిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. పదేళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ పోసాని చేసిన వ్యాఖ్యలపై స్థానిక జనసేన నేత ఫిర్యాదు మేరకు ఆయనపై అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోసాని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు.

పోలీసులు నమోదు చేసిన సెక్షన్లను ప్రస్తావిస్తూ, ఈ సెక్షన్లు ఆయనకు వర్తించవని వివరించారు. సంబంధం లేని సెక్షన్లతో పాటు అనవసర సెక్షన్లు పెట్టారని వాదించారు. ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబంధించి తమ వాదనలు వినిపించారు. దాదాపు 9.30 గంటలకు ప్రారంభమైన వాదనలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి.
ఇరుపక్షాల వాదనలు ఆలకించిన మెజిస్ట్రేట్ సాయితేజ్.. తెల్లవారుజామున పోసానికి 14 రోజుల రిమాండును విధించారు. అనంతరం పోసానిని రైల్వేకోడూరు సీఐ పి.వెంకటేశ్వర్లు, ఓబులవారిపల్లి ఎస్‌ఐ పి.మహేష్‌నాయుడులు తమ సిబ్బందితో ఉదయం 7.52 గంటలకు నేరుగా రాజంపేట సబ్ జైలు వద్దకు తీసుకొచ్చారు.