గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఏపీ టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ అన్నారు. విశాఖలోని 52వ వార్డు గౌరీనగర్‌లో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల విషయంలో టీడీపీ నాయకుల ఆరోపణలు శుద్ధ అబద్ధమన్నారు. టిడ్కో ఇళ్లు గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసినా అవి పూర్తి కాలేదన్నారు. వాటిని ఒక యజ్ఞంలా పూర్తి చేశామన్నారు.
రూపాయికే ఇల్లు
రాష్ట్రంలో 2.62 లక్షల గృహాలు నిర్మాణం జరుగుతుండగా.. అందులో 1,43,600 గృహాలు కేవలం ఒక్క రూపాయికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు అందిస్తున్నారని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2018లో విడుదల చేసిన జీవోలో ప్రతి 300 చదరపు గజాల గృహ లబ్దిదారుడు రూ.2.65 లక్షలు చెల్లించాలని ఉందని గుర్తు చేశారు. ఈ సొమ్ము బ్యాంకుల్లో అప్పు తీసుకుని వాయిదాలు కడితే 20 ఏళ్లకు సుమారు రూ.7.20 లక్షలు కట్టాల్సి వచ్చేదన్నారు.
పాదయాత్ర సందర్భంగా కంచరపాలెం మెట్టు వద్ద జరిగిన బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లను ఉచితంగా అందజేస్తానని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మాట ప్రకారమే పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో బీ కేటగిరీ ఇళ్లు రూ.50 వేలు ఉండగా.. దాన్ని రూ.25 వేలు చేశారన్నారు. సీ కేటగిరీ ఇళ్లు రూ.లక్ష ఉండగా.. దాన్ని రూ.50 వేలు చేశారని వివరించారు.
ఇప్పటికే 22 పట్టణాల్లో 50 వేల గృహాలను లబ్ధిదారులకు అందించామన్నారు. అందులో 25 వేల గృహాలు ఒక్క రూపాయికే అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బీఎస్ కృష్ణ, సింహాచలం ట్రస్ట్‌బోర్డు సభ్యురాలు శ్రీదేవి వర్మ, వైఎస్సార్ సీపీ నాయకులు జియ్యాని మారుతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment