సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రొయ్యల వినియోగం పెంచేందుకు ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఎగుమతులకే పరిమితమైన ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ రొయ్యలను ఇక నేరుగా వినియోగదారుల చెంతకు చేర్చాలని సంకల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ ప్రక్రియను అమలుచేసేందుకు ఏపీ రొయ్య రైతుల ఫెడరేషన్ సైతం ముందుకొచ్చింది.
సాధారణంగా.. స్థానికంగా సాగై మార్కెట్లోకి వచ్చే 80–120 కౌంట్ రొయ్యలు కాకుండా మిగిలిన కౌంట్ రొయ్యలు వివిధ రూపాల్లో ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ హైకౌంట్ రొయ్యలను కూడా వివిధ రూపాల్లో డోర్ డెలివరీ చేయనున్నారు. ఇందులో భాగంగా.. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా దీనిని అమలుచేస్తున్నారు. ఆ తర్వాత డిమాండ్ ఆధారంగా రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు, పట్టణ ప్రాంతాలకు ఈ విధానాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఏపీలో సగటు వినియోగం 1.5 కిలోలే..
రొయ్యల వినియోగంలో ప్రపంచంలో చైనా నంబర్–1 అని చెప్పాలి. ఇక్కడ సగటున ప్రతిఒక్కరూ ఏటా 10–12 కిలోల రొయ్యలు తింటారు. అమెరికాలో 8–10 కిలోలు.. యూరోపియన్ దేశాల్లో 8 కిలోలకు పైగా తీసుకుంటారు. కానీ, రొయ్యల ఉత్పత్తిలో రారాజుగా ఉన్న మనదేశంలో మాత్రం వీటి వినియోగం సగటున 800 గ్రాములకు మించడంలేదు.
అలాగే, రొయ్యల సాగు, దిగుబడులు, ఎగుమతుల్లో నెం.1గా ఉన్న మన రాష్ట్రంలో ఇది 1.5 కిలోలు మాత్రమే. ఈ నేపథ్యంలో.. రొయ్యల తలసరి వినియోగం పెంచడమే లక్ష్యంగా ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రాన్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ వాటిలో ఉండే పోషకాలపై విస్తృత ప్రచారం చేస్తూనే మరోవైపు ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ రొయ్యలను సామాన్య వినియోగదారులకూ అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
ఆ కౌంట్ రొయ్యలకు విదేశాల్లో గిరాకీ..
సాధారణంగా.. 20–60 కౌంట్ రొయ్యలు స్థానిక మార్కెట్లలో పెద్దగా అందుబాటులో ఉండవు. ఇవన్నీ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రధానంగా హోల్‌ష్రింప్స్ (ఎలాంటి ప్రాసెసింగ్ చేయకుండా తల, తోక భాగాలతో సహా), హెడ్‌లెస్ షెల్‌ఆన్ (తలభాగం తీసినవి), పీల్డ్ టేల్‌ఆన్ (పూర్తిగా వలిచిన రొయ్యపప్పు), పీల్డ్ డీవియండ్ టేల్‌ఆన్ (తల, షెల్, శరీరంలోని భాగాలను తీసివేసి), బటర్‌ఫ్లై టేల్‌ఆన్ (తల, ఇతర వ్యర్థపదార్థాలను తీసేసి తోకతో సహా బటర్‌ఫ్లై ఆకారంలో కట్ చేస్తారు), బటర్‌ఫ్లై టేల్‌ఆఫ్ (తల, తోక, ఇతర వ్యర్థపదార్థాలను తీసేసి బటర్‌ఫ్లై ఆకారంలో కట్ చేస్తారు) రూపాల్లో విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.
నెలరోజులకు పైగా నిల్వ ఉండేలా..
రొయ్యల దేశీయ వినియోగం పెంచేందుకు వండుకోవడానికి సిద్ధంగా ఉన్న వనామీ రొయ్య పప్పును విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఎగుమతి చేసేందుకు ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో అదే రీతిలో పూర్తిస్థాయిలో ప్రాసెస్ చేసిన రొయ్యలను కనీసం నెలరోజులకు పైగా నిల్వ ఉండేటట్లుగా వివిధ రూపాల్లో ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో సరఫరా చేయనున్నారు. సాధారణంగా ప్రాసెస్ చేసిన కిలో రొయ్య పప్పు అంటే 800 గ్రా. పప్పు, 200 గ్రా. ఐస్‌తో ఉంటుంది.
కానీ, ఐస్‌తో సంబంధం లేకుండా రొయ్యపప్పు నికర బరువు ఆధారంగానే ధర చెల్లించే ఏర్పాటుచేశారు. పైగా ఏరోజుకారోజు వలిచిన పప్పునే డోర్ డెలివరీ చేస్తారు. ముందుగా వీటిని ప్రయోగాత్మకంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉచితంగా డోర్ డెలివరీ చేస్తారు. ఆ తర్వాత ఇతర నగరాలు, పట్టణాలతో పాటు రవాణా సౌకర్యం ఉన్న అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఇలా ఆర్డర్‌పై సప్లైచేసే రొయ్యపప్పు ధరలను కౌంట్, క్వాంటిటీ, వెరైటీ, దూరాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఆర్డర్‌పై రెండ్రోజుల వ్యవధిలో ఎంత పరిమాణం కావాలన్నా సరఫరా చేస్తారు. మరోవైపు.. రొయ్యలతో పాటు అందుబాటులో ఉండే అన్ని రకాల చేపలను కూడా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యం..
రొయ్య కౌంట్‌ను బట్టి కిలో రూ.600 నుంచి రూ.850 ధరగా నిర్ణయించారు. మార్కెట్ రేటు హెచ్చుతగ్గులను బట్టి ధరల్లో మార్పులుంటాయి. అదే 20 కిలోలకు పైబడి ఆర్డర్లకు కిలోకు రూ.50 నుంచి రూ.100 వరకు డిస్కౌంట్ ఇస్తాం. ఆర్డర్ ఇవ్వాలనుకునే వారు ఫెడరేషన్‌కు చెందిన: 9661664779లో ఆర్డర్ ఇవ్వొచ్చు. ముఖ్యంగా.. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేస్తున్నాం. – జీవీ సుబ్బరాజు, ప్రధాన కార్యదర్శి, ఏపీ రొయ్య రైతుల సమాఖ్య
Comments
Please login to add a commentAdd a comment