సాక్షి, అమరావతి/సాక్షిప్రతినిధి, కాకినాడ: జాతీయస్థాయిలో కులగణన ప్రక్రియను చేపట్టాలనే బీసీల న్యాయమైన డిమాండ్‌ను పెద్ద మనస్సుతో అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. దీంతో కులగణనను వేగవంతం చేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమయ్యింది. ఇందుకోసం సోమవారం సాంఘిక సంక్షేమ శాఖ, మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశాల్లో శాఖల వారీగా కసరత్తు ముమ్మరం చేసింది. కులగణనకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించింది.
ఇదిలా ఉంటే.. జనాభా లెక్కలు–2022 సేకరణలో బీసీ కులగణన జరపాలంటూ దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ బీసీ కులం కాలమ్ పెట్టి జనగణన చేపట్టడానికి కేంద్రం సమ్మతించకపోవడంతో రాష్ట్ర పరిధిలో నిర్వహించడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే బీసీ కులం కాలం చేర్చి జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. బీహార్‌లో చేపట్టిన కులగణనను అధ్యయనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో కులాల వారీగా వివరాలు సేకరించేందుకు (కులగణన) క్షేత్రస్థాయిలో సిబ్బందిని వినియోగించుకునేందుకు నిర్ణయించింది. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ఇందుకోసం ఉపయోగించనుంది. సర్వే పారదర్శకంగా జరిగేలా మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవో స్థాయిలో పునఃపరిశీలన చేస్తారు. రాష్ట్రంలో సమర్థవంతంగా కులగణన నిర్వహించేందుకు అవసరమైన పటిష్ట కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు సాగుతుండటం విశేషం.
బీసీల పక్షపాతి సీఎం జగన్ : మంత్రి వేణు
ఎన్నో ఏళ్లుగా బీసీలు ఎదురుచూస్తున్న కులగణన ప్రక్రియను చేపట్టడం ద్వారా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి బీసీల పక్షపాతినని నిరూపించుకున్నారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 15 తరువాత ఈ ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభమవుతుందన్నారు. ఈ చర్య రాష్ట్రంలోని బలహీన వర్గాలకు ఓ పెద్ద ఊరటని, వారి మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంటుందని చెప్పారు.
వెనుకబడిన తరగతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు విద్య, సంక్షేమం, వంటి అంశాలలో ప్రాధాన్యత కల్పించే దిశగా కులగణన జరుగుతుందని తెలిపారు. సాధ్యం కాదనుకున్న బీసీల కోరిక సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి ఆ బాధ్యతను తనకు అప్పగించినందుకు రుణపడి ఉంటానన్నారు. కుల గణనను ప్రారంభించే ముందు వివిధ కుల సంఘాల నాయకులు, పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి అనుభవాలు, అభిప్రాయాలను తెలుసుకుంటామని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment