సాక్షి ప్రతినిధి, కడప: వచ్చే ఖరీఫ్ సాగుకు అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. రసాయనిక ఎరువులు, విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందించేందుకు జిల్లా వ్యవసాయాధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరోవైపు గత ఖరీఫ్ కంటే ఈ ఖరీఫ్‌లో సాగును పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక గత ఏడాది జిల్లాలో భారీ వర్షాలు కురవడంతోపాటు జిల్లాలోని అన్ని సాగునీటి వనరులను ప్రభుత్వం కృష్ణా జలాలతో నింపింది. వేసవిలోనూ ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. మరోవైపు భూగర్భ జలాలు పైకి చేరడంతో వేలాది బోరు బావుల్లోనూ పుష్కలంగా నీరు చేరింది. దీంతో గతంతో పోలిస్తే ఈ ఏడాది సాగు మరింత పెరగనుంది.
ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింతగా పంటల సాగు
ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగును మరింత పెంచాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో పులివెందుల, మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాలలో వేరుశనగ, వరి, శనగ తదితర పంటలు సాగు చేస్తారు. మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం, బద్వేలు, కడప తదితర ప్రాంతాల్లో వరితోపాటు పసుపు, మిరప, పత్తి, మొక్కజొన్న, సజ్జ తదితర పంటలను సాగు చేస్తారు. రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో పండ్ల తోటలతోపాటు వరి, చెరుకు, రాయచోటి ప్రాంతంలో మామిడి, వేరుశనగ, సన్‌ఫ్లవర్, ఇతర కూరగాయల పంటలు విరివిగా సాగు చేస్తారు. 2019 ఖరీఫ్‌లో 73,792 హెక్టార్లలో పంటలు సాగు కాగా, 2020 ఖరీఫ్‌లో 1,10,127 హెక్టార్లలో, 2021 ఏడాదిలో 1,24,000 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది సాగును మరింత పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
68,756 క్వింటాళ్ల పంపిణీకి ప్రతిపాదనలు
వచ్చే ఖరీఫ్‌లో 68,756 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా 14,602 క్వింటాళ్లు కేబీ రకం వేరుశనగ విత్తనాలు, 1500 క్వింటాళ్లు నారాయణి రకం, 1000 క్వింటాళ్లు టీఏజీ–24 రకం విత్తనాలు, అలాగే 950 క్వింటాళ్ల మినుములు, 692 క్వింటాళ్లు ఎల్‌బీజీ–752 రకం మినుము విత్తనాలు, 418 క్వింటాళ్లు పీబీజీ–104 రకం విత్తనాలకు ప్రతిపాదనలు పంపారు. వీటితోపాటు 339 క్వింటాళ్లు పెసర, 39,870 క్వింటాళ్లు శనగలు, 7500 క్వింటాళ్ల జీలుగ, 1100 క్వింటాళ్ల జనుము, 200 క్వింటాళ్ల పిల్లి పెసర తదితర విత్తనాలను పంపిణీ చేయనున్నారు.
అన్నదాతలకు మరింత ప్రోత్సాహం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక అన్నదాతలకు మరింత ప్రోత్సాహం లభిస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రతి యేటా 2,98,673 మంది రైతులకు ఆర్థికసాయం అందిస్తుండగా, సున్నా వడ్డీ పంట రుణాల కింద 90,000 మందికి సుమారు రూ. 50 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఇక పంటల బీమా కింద 2,89,922 మందికి రూ. 777.50 కోట్లు లబ్ధి చేకూరింది. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 2,23,016 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందజేశారు. మరోవైపు తగిన మేర సబ్సిడీ విత్తనాలను ప్రభుత్వం అందిస్తోంది.
ఖరీఫ్‌లో ఎరువుల కొరత లేదు
జిల్లాలో ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. బోరు బావుల కింద కూడా సాగు పెరగనుంది. వచ్చే ఖరీఫ్‌లో 1,35,100 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేయబోతున్నాము.
– నాగేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్, జిల్లా వ్యవసాయశాఖ
ఖరీఫ్ సాగు 1.35 లక్షల హెక్టార్లపైనే
గత ఏడాది ఖరీఫ్‌లో 1,24,058 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ సంవత్సరం దీనిని 1,35,100 ఎకరాలకు పైగా పెంచాలన్నది లక్ష్యం. ప్రధానంగా 33,994 హెక్టార్లలో వరి, 23,698 హెక్టార్లలో పత్తి, 23,149 హెక్టార్లలో వేరుశనగ, 3,578 హెక్టార్లలో కంది, 2563 హెక్టార్లలో సన్‌ఫ్లవర్, 2,603 హెక్టార్లలో శనగ, 177 హెక్టార్లలో పెసర, 276 హెక్టార్లలో జొన్న, 43 హెక్టార్లలో చెరకు, 2828 హెక్టార్లలో పసుపు, 4833 హెక్టార్లలో ఉల్లిగడ్డలు, 948 హెక్టార్లలో చీనీ, 1754 హెక్టార్లలో టమాటా తదితర పంటలను సాగు చేయించాలన్నది లక్ష్యం. మొత్తంగా 1,35,100 హెక్టార్లలో ఖరీఫ్ సాగును అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: సీఎం జగన్ ఆసరాతో డ్వాక్రా సంఘాలు బలోపేతం
Comments
Please login to add a commentAdd a comment