kadapa agriculture
-
ఏపీ: ఖరీఫ్ సాగు కోసం ప్రణాళికలు సిద్ధం
సాక్షి ప్రతినిధి, కడప: వచ్చే ఖరీఫ్ సాగుకు అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. రసాయనిక ఎరువులు, విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందించేందుకు జిల్లా వ్యవసాయాధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరోవైపు గత ఖరీఫ్ కంటే ఈ ఖరీఫ్‌లో సాగును పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక గత ఏడాది జిల్లాలో భారీ వర్షాలు కురవడంతోపాటు జిల్లాలోని అన్ని సాగునీటి వనరులను ప్రభుత్వం కృష్ణా జలాలతో నింపింది. వేసవిలోనూ ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. మరోవైపు భూగర్భ జలాలు పైకి చేరడంతో వేలాది బోరు బావుల్లోనూ పుష్కలంగా నీరు చేరింది. దీంతో గతంతో పోలిస్తే ఈ ఏడాది సాగు మరింత పెరగనుంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింతగా పంటల సాగు ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగును మరింత పెంచాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో పులివెందుల, మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాలలో వేరుశనగ, వరి, శనగ తదితర పంటలు సాగు చేస్తారు. మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం, బద్వేలు, కడప తదితర ప్రాంతాల్లో వరితోపాటు పసుపు, మిరప, పత్తి, మొక్కజొన్న, సజ్జ తదితర పంటలను సాగు చేస్తారు. రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో పండ్ల తోటలతోపాటు వరి, చెరుకు, రాయచోటి ప్రాంతంలో మామిడి, వేరుశనగ, సన్‌ఫ్లవర్, ఇతర కూరగాయల పంటలు విరివిగా సాగు చేస్తారు. 2019 ఖరీఫ్‌లో 73,792 హెక్టార్లలో పంటలు సాగు కాగా, 2020 ఖరీఫ్‌లో 1,10,127 హెక్టార్లలో, 2021 ఏడాదిలో 1,24,000 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది సాగును మరింత పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 68,756 క్వింటాళ్ల పంపిణీకి ప్రతిపాదనలు వచ్చే ఖరీఫ్‌లో 68,756 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా 14,602 క్వింటాళ్లు కేబీ రకం వేరుశనగ విత్తనాలు, 1500 క్వింటాళ్లు నారాయణి రకం, 1000 క్వింటాళ్లు టీఏజీ–24 రకం విత్తనాలు, అలాగే 950 క్వింటాళ్ల మినుములు, 692 క్వింటాళ్లు ఎల్బీజీ–752 రకం మినుము విత్తనాలు, 418 క్వింటాళ్లు పీబీజీ–104 రకం విత్తనాలకు ప్రతిపాదనలు పంపారు. వీటితోపాటు 339 క్వింటాళ్లు పెసర, 39,870 క్వింటాళ్లు శనగలు, 7500 క్వింటాళ్ల జీలుగ, 1100 క్వింటాళ్ల జనుము, 200 క్వింటాళ్ల పిల్లి పెసర తదితర విత్తనాలను పంపిణీ చేయనున్నారు. అన్నదాతలకు మరింత ప్రోత్సాహం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక అన్నదాతలకు మరింత ప్రోత్సాహం లభిస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రతి యేటా 2,98,673 మంది రైతులకు ఆర్థికసాయం అందిస్తుండగా, సున్నా వడ్డీ పంట రుణాల కింద 90,000 మందికి సుమారు రూ. 50 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఇక పంటల బీమా కింద 2,89,922 మందికి రూ. 777.50 కోట్లు లబ్ధి చేకూరింది. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 2,23,016 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందజేశారు. మరోవైపు తగిన మేర సబ్సిడీ విత్తనాలను ప్రభుత్వం అందిస్తోంది. ఖరీఫ్‌లో ఎరువుల కొరత లేదు జిల్లాలో ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. బోరు బావుల కింద కూడా సాగు పెరగనుంది. వచ్చే ఖరీఫ్‌లో 1,35,100 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేయబోతున్నాము. – నాగేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్, జిల్లా వ్యవసాయశాఖ ఖరీఫ్ సాగు 1.35 లక్షల హెక్టార్లపైనే గత ఏడాది ఖరీఫ్‌లో 1,24,058 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ సంవత్సరం దీనిని 1,35,100 ఎకరాలకు పైగా పెంచాలన్నది లక్ష్యం. ప్రధానంగా 33,994 హెక్టార్లలో వరి, 23,698 హెక్టార్లలో పత్తి, 23,149 హెక్టార్లలో వేరుశనగ, 3,578 హెక్టార్లలో కంది, 2563 హెక్టార్లలో సన్‌ఫ్లవర్, 2,603 హెక్టార్లలో శనగ, 177 హెక్టార్లలో పెసర, 276 హెక్టార్లలో జొన్న, 43 హెక్టార్లలో చెరకు, 2828 హెక్టార్లలో పసుపు, 4833 హెక్టార్లలో ఉల్లిగడ్డలు, 948 హెక్టార్లలో చీనీ, 1754 హెక్టార్లలో టమాటా తదితర పంటలను సాగు చేయించాలన్నది లక్ష్యం. మొత్తంగా 1,35,100 హెక్టార్లలో ఖరీఫ్ సాగును అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కూడా చదవండి: సీఎం జగన్ ఆసరాతో డ్వాక్రా సంఘాలు బలోపేతం -
పచ్చ మోసం
రైతులకు మేం చేసినంతగా ఏ ప్రభుత్వం చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వం చేసేదొకటి చెప్పేదొకటని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పథక సబ్సిడీలు పెంచామని పైకి చెబుతున్నా అది రైతు దరి చేరిందెక్కడని ప్రశ్నిస్తున్నాయి. ఉద్యాన రైతులకు విరివిగా పథకాలు వినియోగించుకోవడానికి అవకాశాలు కల్పించామని మంత్రి ఊదరగొడుతుంటారు. కానీ చేతల్లో మాత్రం చూపించకపోవడం గమనార్హం. కడప అగ్రికల్చర్ : ఉద్యాన రైతులు ఏడాది కాలంగా పండ్లతోటల సాగు, పాత తోటల పునరుద్ధరణ, యాంత్రీకరణ పథకం, పంట రక్షణ చర్యలు ఊతకర్రలతో పంటలసాగు ఇలా పలు పథకాలను వినియోగించుకున్నారు. కానీ ఏడాది కావస్తున్నా ఆయా పథకాలకు సబ్సిడీ రుణం విడుదల కాకపోవడంతో లబోదిబోమంటున్నారు. తమ వాటా చెల్లించాలని దరఖాస్తులు పంపే సమయంలో చెప్పారని, పథకం మంజూరయ్యాక మీ ఖాతాల్లో సబ్సిడీ రుణం పడుతుందన్నారు. ఇంత వరకు తమ అకౌంట్లలో ఒక్క రూపాయి కూడా పడలేదని ఆయా తోటల రైతులు చెబుతున్నారు. ఇంత అధ్వానంగా ఏ ప్రభుత్వంలోనూ లేదని నిప్పులు చెరుగుతున్నారు. అసలే కరువు పరిస్థితుల్లో అల్లాడుతున్న తమకు ప్రభుత్వం ఇట్లా చేయొచ్చునా అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యాన శాఖలో అమలవుతున్న పథకాలు.. జిల్లాలో 2018–19 సంవత్సరానికి ఉద్యాన తోటల సాగుకు మొక్కల పెంపకం, వాటి పరికరాలు, నూతన పండ్లతోటల సాగు, మొదటి, రెండో, మూడో సంవత్సరాల్లో సాగు చేసిన తోటల నిర్వహణ, ముదురు, పాత తోటలనుసాగులోకి తీసుకువచ్చే పునరుద్ధరణ పథకం, కొమ్మల కత్తరింపు, మల్చింగ్, సస్యరక్షణ, ప్యాక్ హౌస్‌లు, కోత అనంతరం చేపట్టాల్సిన పద్ధతులు, శీతలీకరణ గిడ్డంగులు, ఉద్యాన యాంత్రీకరణ పనిముట్లు, పండ్లతోటలకు రక్షక కవచాలు, నీటి ఎద్దడి నుంచి కాపాడే జీబా వంటి 21 రకాల స్కీములు సమీకృత ఉద్యాన అభివృద్ధి పధకం, రాష్ట్రీయ కృషి వికాష్ యోజన, రాష్ట్ర ప్రణాళిక కింద పధకాలు అమలవుతున్నాయి. రైతులకు రావాల్సిన బకాయి రూ.14.71 కోట్లు.. జిల్లాలో ఆయా పథకాల కింద రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, పులివెందుల, ముద్దనూరు, మైదుకూరు, బద్వేలు, కడప, రాజంపేట, రైల్వేకోడూరు ఉద్యా న డివిజన్లలోని 41 మండలాల్లో ఉద్యాన తోటలు 1.80 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో కొన్ని కొత్త తోటలు కాగా, మిగిలినవి పాతవి, కూరగాయ తోటలు ఉన్నాయి. వీటి సాగు కోసం రైతులు సమీకృత ఉద్యాన అభివృద్ధి, రాష్ట్రీయ కృషి వికాష్ యోజన, రాష్ట్ర ప్రణాళిక పథకాల కింద దరఖాస్తు చేసుకుని తోటలను సాగు చేసుకున్నారు. కొందరు బ్యాంకుల్లో, ప్రైవేటుగా వడ్డీలకు రుణాలు తెచ్చుకుని పండ్ల, కూరగాయల తోటల ను సాగు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణం ఇంత వరకు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మా డబ్బులు రావేమోనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైతులంటే ప్రభత్వానికి చిన్నచూపు మామిడి పాత తోటలు పునరుద్ధరించుకోమని చెప్పారు. ఒక్కో రైతుకు ఐదు ఎకరాల వరకు అనుమతిచ్చారు. ఆ ప్రకారం తాను పాత తోటలను కొమ్మలను కత్తిరించుకుని మళ్లీ సాగులోకి తెచ్చుకున్నాను. ఎరువులు, పురుగు మందులకు సొమ్ములు చెల్లిస్తామన్నారు. దీని కోసం బ్యాంకులో అప్పుగా రుణం తీసుకున్నాం. అప్పు తీర్చుద్దామంటే ప్రభుత్వం సబ్సిడీ మొత్తం విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోంది. రైతులంటే ప్రభుత్వానికి చిన్నచూపు తగదు. –పచ్చిపాల రంగారెడ్డి, మామిడి రైతు, దిగువబత్తినవాండ్లపల్లె, లక్కిరెడ్డిపల్లె మండలం ప్రభుత్వానికి నివేదికలు పంపాం... జిల్లాలో రావాల్సిన ఉద్యాన పంటల సబ్సిడీ రుణం విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపాం. కొంత కాలంగా ఈ సమస్య ఉంది. అయినా ప్రభుత్వం నుంచి నిధులు రాగానే రైతుల ఖాతాలకు వెళతాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. –ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా ఉద్యాన శాఖ -
లక్ష్యం.. దూరం
కడప అగ్రికల్చర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గంలోని కొందరు అధికార పార్టీ డైరెక్టర్లు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సొసైటీలకు ఇష్టానుసారంగా రుణాలను మంజూరు చేయించుకున్నారు. రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడంలో తాహతు లేకపోయినా బ్యాంకు అధికారులపై ఒత్తిడి చేయించి మంజూరు చేయించుకున్నారు. ఇప్పుడు ఆ రుణాలు ఆయా ప్రాథమిక సహకార సంఘాల్లో తడిసి మోపెడై మొండి బకాయిలై కూర్చున్నాయి. దీనిపై రాష్ట్ర ఆప్కాబ్, నాబార్డు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించగా సొసైటీలకు అస్తులకంటే అప్పులు ఎక్కువ ఉన్నాయని, వాటిని రాబట్టడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఆ మేరకు డీసీసీ బ్యాంకు సీఈఓ వెంకటరత్నం చొరవ తీసుకుని బ్యాంకు ఉద్యోగులను గ్రూపులు ఏర్పాటు చేసి మొండి బకాయిలను రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బకాయిలు రాబడుతున్న సమయంలో ఆయా డైరెక్టర్లు కొందరు మోకాలొడ్డుతున్నారని బ్యాంకు ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. రుణాలు ఇప్పించుకున్నప్పుడు ఉండే శ్రద్ధ తిరిగి చెల్లించాల్సినప్పుడు ఉండదా? అని ఓ ఉద్యోగి బాహాటంగానే ఆరోపించారు. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు లక్ష్యానికి దూరమవుతున్నాయి. జిల్లాలోని 69 ప్రాథమిక సొసైటీల్లో 41 మినహా మిగిలిన 28 ప్రాథమిక సొసైటీలకు 2500 మంది రైతులు రూ.6.50 కోట్లు బకాయిపడ్డారు. దీంతో ఇవి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు జిల్లాలో సహకార వ్యవస్థ నిర్వీర్యం కావడానికి అధికార పార్టీ అధ్యక్షులు, డైరెక్టర్ల తీరే కారణమని అధికారులు అంటున్నారు. ఇష్టారాజ్యంగా తాహతుకు మించి రుణాలను ఎగురేసుకు పోయారు. రికవరీలకు వచ్చే సరికి బకాయిలు రాబట్టలేక అధ్యక్షులు, డైరెక్టర్లు చేతులెత్తేశారు. ఇది ఒక కారణం కాగా సంఘాల్లో నిపుణులైన సిబ్బంది లేకపోవడం కూడా మరో కారణమని చెబుతున్నారు. కొందరు సీఈఓలను రాజకీయ నాయకులు తమ వాడం టూ సంఘాలకు నియమించుకుంటుండడంతో వ్యవస్థ నాశనం అవుతోందని అధికారులు పెదవి విరుస్తున్నారు. సభ్యత్వాలను పెంచుకుని రైతులను ప్రాథమిక పరపతి సంఘ కార్యాలయాల మెట్లు ఎక్కేలా చేయటంలో వైఫల్యం, సంఘాల ద్వారా రుణ మంజూరు, వసూళ్లకే పరిమితౖమైనందున ఆదాయ వనరులు కొరవడి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం, పరపతేతర వ్యాపారాలతో అదనపు రాబడికి, సంఘాల అభ్యున్నతికి ప్రయత్నించకపోవడం వంటి కారణా లెన్నో సహకార సంఘాల మనుగడను కష్ట తరం చేస్తున్నాయి. రూ.113 కోట్ల రుణంలో అర్హత కోల్పోయిన 28 సొసైటీలు జిల్లాలో జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుతోపాటు బ్రాంచీలు 24 ఉన్నా యి. వీటికి అనుబంధంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు 69 ఉన్నా యి. వీటిలో 41 సొసైటీలు 50 శాతం రుణ రికవరీ చేయగా, మిగిలిన 28 సొసైటీలు చతికిలపడ్డాయి. ఈ సొసైటీలు రూ.113 కోట్ల రుణ కేటాయింపుల్లో రుణం తీసుకోవడానికి అవకాశం లేకుం డా పోయిందని డీసీసీ బ్యాంకు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. జిల్లాలోని అన్ని సొసైటీలకు పంట రుణాలను బ్యాంకు బ్రాంచీలు సమకూర్చుతున్నాయి. జిల్లాలో స్వల్పకాలిక పంట రుణాలు 72 వేల మంది కాగా, దీర్ఘకాలిక రుణాలు 12 వేల మంది తీసుకుంటున్నారు. ప్రతి ఏటా ఆయా పంట రుణాలకుగాను రూ.350 కోట్లు అందజేస్తున్నారు. ఇందులో దీర్ఘకాలిక రుణ బకాయి రూ.54 కోట్లు కాగా, రెండేళ్ల కాలంగా వసూలైంది రూ.34 కోట్లు మాత్రమే. రూ.20 కోట్లు రావాల్సి ఉందని డీసీసీ బ్యాంకు అధికా రులు తెలిపారు. ఉద్యోగులు శత విధాల ప్రయత్నం చేస్తున్నా అందుకు తగ్గట్లు పాలకవర్గం నుంచి ప్రోత్సాహం లేకపోగా మోకాలడ్డేందుకు చూస్తోందని ఓ ఉద్యోగి సాక్షి ఎదుట వాపోయారు. అధికార పార్టీ సొసైటీలకు రుణాలు జిల్లాలో అధికార పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాథమిక సహకార సంఘాలకు కొందరు డైరెక్టర్లు అధికంగా రుణాలు మంజూరు చేయించుకున్నారు. కొన్నింటికైతే తాహతుకు మించి మంజూరు చేయించుకుని తిరిగి చెల్లించడలో చేతులెత్తేస్తున్నారని డైరెక్టర్లపై కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులను తమ చెప్పుచేతుల్లో ఉంచుకుని ఇష్టానుసారంగా కొందరు డైరెక్టర్లు రుణాలు పొందారు. తమ అనుచరులకు ఇప్పించారు. ఇప్పుడు ఆయా బకాయిలు చెల్లించాలని అడుగుతుంటే మొహం చాటేస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఉదాహరణకు.. అట్లూరు పీఏసీసీ పరిధిలో పండుమిరప పంటను సాగు చేయరు. అయితే ఆ పంటకు ఇబ్బడి ముబ్బడిగా ఆ సొసైటీలో రుణాలు ఇచ్చారు. ఈ పంటకు అధికంగా పెట్టుబడి అవుతుంది కాబట్టి స్కేల్ ఆఫ్ పైనాన్స్ కూడా ఎక్కువగా ఉంటోంది. ఈ విధంగా రుణాలు ఇచ్చారంటే ఆ సొసైటీకి ఒక విధంగాను మిగతా సొసైటీలకు మరో విధంగాను రుణాలు ఇచ్చారంటే పాలకవర్గం ప్రమేయంతోనే ఇలా కేటాయించుకుంటారని రిటైర్డ్ అధికారి ఒకరు సాక్షికి తెలిపారు. ఇదే విధంగా బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజవర్గాల్లో ఉన్న అధికారపార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహించే సోసైటీల్లోనే ఈ బకాయిలు ఎక్కువగా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. రాష్ట్రంలో చివరి స్థానానికి చేరిన బ్యాంకు గ్రేడింగ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డీసీసీ బ్యాంకులకు గ్రేడింగ్ విధానంలో మన డీసీసీ బ్యాంకు ఆఖరు స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా రుణాలు ఇచ్చిన, వసూళ్లలో వెనుకబడిన బ్యాంకుల జాబితాను ఆప్కాబ్ తయారు చేస్తుంది. ఆ విధంగా కడప డీసీసీ బ్యాంకు గ్రేడింగ్ చూస్తే చివరి నుంచి 5 స్థానంలో ఉన్నట్లు అధికారులు చెబుతుండడం గమనార్హం. నేను రాకముందు జరిగిన వ్యవహారానికి నాకు సంబంధంలేదు బ్యాంకు బ్రాంచీల నుంచి పీఏసీసీలకు రుణాలు ఇచ్చిన సమయంలో నేను లేను. ఆ సమయంలో ఉన్న వారు ఇచ్చిన అప్పుల వసూళ్లు రాబట్టాలంటే తలప్రాణం తోకకొస్తోంది. గ్రూపులుగా ఉద్యోగులను నియమించి మొండిబకాయిలను రాబట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నేను రాకముందు జరిగిన వ్యవహారానికి నేనెలా బాధ్యత వహిస్తాను. –వెంకటర త్నం,సీఈఓ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, కడప -
‘ఒంగోలు పెయ్య @ రూ.3.50 లక్షలు
ఒంగోలు జాతి పశు సంపదపై రైతులకు మక్కువ పెరుగుతోంది. సరిగ్గా 10 నెలలు నిండిన ఓ పెయ్య దూడ ను కృష్ణా జిల్లా నున్న మండలానికి చెందిన రైతు బొంతు సాయి రామిరెడ్డి రూ. 3.50 లక్షలకు కొనుగోలు చేశాడు. వైఎస్ఆర్ జిల్లా, మైదూకూరు మండలం, నెల్లూరు కొట్టాల గ్రామానికి చెందిన చిలమకూరు కిరణ్‌కుమార్‌రెడ్డి ఒంగోలు జాతి పశు సంపదను అభివృద్ధి చేయాలనే తలంపుతో తెనాలిలో ఓ రైతు వద్ద (మూల పుట్టుకను కనుగొని) ఆ జాతి ఆవును కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. గుంటూరు లాంఫాంలో అదే జాతి ఆబోతు వీర్యాన్ని తీసుకొచ్చి ఈ ఆవుకు సంక్రమింపజేసి సంతతిని పెంపొందించాడు. ఆ విధంగా ఇప్పటికి ఎద్దులు, పెయ్య, లేగ దూడలు కలిపి ఎనిమిది, ఆరు ఆవులు ఉన్నాయి. ఇందులో మూడో తరంగా చెప్పుకుంటున్న ఈ పెయ్య దూడను కృష్ణా జిల్లా రైతు సాయి రామిరెడ్డి ఇష్టపడి పదే పదే కావాలని కోరడంతో రూ. 3.50 లక్షలకు విక్రయించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంతతిని అభివృద్ధి చేయాలనేదే తన ధ్యేయమన్నారు. ఇందుకు సహకరిస్తానని చెప్పడంతోనే ఆయనకు పెయ్య దూడను విక్రయించానని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. - కడప అగ్రికల్చర్ -
డీయూ ద్రావణంతో పేనుబంక పరారీ!
దున్నింగ, ఊడుగ ద్రావణంతో సత్ఫలితాలు కరువు కాటకాలను తట్టుకొని, వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేస్తున్న వివిధ పైర్లను పూత, కాత దశలో పచ్చ పురుగు, దాసరి పురుగు, పేనుబంక ఆశిస్తూ తీవ్ర నష్టం కలిగిస్తుంటాయి. అయితే, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో కషాయాలు, ద్రావణాలతో ఆ చీడపీడలకు చక్కని పరిష్కారాలు వెదుకుతున్నారు అభ్యుదయ రైతు కొమ్ములూరి విజయకుమార్ (98496 48498). వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి వెలంవారిపల్లె ఆయన స్వగ్రామం. కరువు కాలంలోనూ మెట్ట ప్రాంతాల్లో అందుబాటులో ఉండే చెట్ల ఆకులతో రైతులు సులువుగా తయారు చేసుకోగలిగిన ద్రావణాలు, కషాయాలపై ఆయన దృష్టి కేంద్రీకరించారు. కొత్తగా తయారు చేసే ద్రావణాలనుతన పంటలపై వాడిన తర్వాత ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నారు. పచ్చ పురుగు, దాసరి పురుగు, పేనుబంకలను సమూలంగా నాశనం చేసే దున్నింగ, ఊడుగ ద్రావణాన్ని(డీయూ ద్రావణం) ఇటీవల తయారు చేశారు. తన పొలంలో వాడి మంచి ఫలితాన్ని రాబట్టారు. ఆహార పంటలు, కూరగాయ పంటలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటలపై దీన్ని పిచికారీ చేయవచ్చని విజయకుమార్ చెబుతున్నారు. ఈ ద్రావణం పురుగుల గుడ్లు పగలకుండా చేసి లార్వా దశలోనే పురుగుల జీవన చక్రం నిలిచిపోయేలా చేస్తుందన్నారు. డీయూ ద్రావణం తయారీ ఇలా... తెల్ల లేదా ఎర్ర దున్నింగ, ఊడుగ ఆకులతో డీయూ ద్రావణాన్ని తయారు చేస్తారు. దున్నింగాకును ఆయుర్వేద మందుల తయారీలో వాడతారు. ఊడుగ ఆకుల కషాయాన్ని పాము, తేలు విషానికి విరుగుడుగా వాడతారు. బీడు భూములు, చెరువు గట్ల మీద ఈ మొక్కలు విరివిగా లభిస్తాయి. 10 కిలోల దున్నింగాకు (లేత కొమ్మలు, వేళ్లు సహా).. 10 కిలోల ఊడుగ చెట్టు ఆకులు, లేత కొమ్మలను సేకరించి మెత్తగా నూరి పెట్టుకోవాలి. ఈ ముద్దలను 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి నిండుగా నీరు పోయాలి. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కర్రతో బాగా కలియబెట్టాలి. ఇలా 20 రోజుల పాటు పులియబెట్టాక డీయూ ద్రావణం వాడకానికి సిద్ధమవుతుంది. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. తయారీ దశ నుంచి వాడుకునే వరకు దీన్ని నీడలోనే ఉంచాలి. ఏ యే పంటపై ఎలా వాడాలి? పచ్చపురుగు, దాసరి పురుగు, పేనుబంక ఆశించకముందే డీయూ ద్రావణాన్ని పిచికారీ చేసి పంటలను పూర్తిగా రక్షించుకోవచ్చని విజయకుమార్ తెలిపారు. వరిపై పురుగు లార్వా దశలో ఉంటే 20 లీటర్ల నీటికి అర లీటరు ద్రావణం కలిపి పిచికారీ చేయాలి. రెక్కల పురుగు దశలో అయితే 1 లీటరు ద్రావణం, పురుగు దశలో అయితే ఒకటిన్నర లీటర్ల ద్రావణం చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పండ్ల తోటలు, కూరగాయలు, పత్తి, మిరప వంటి ఇతర పంటల్లోనూ ఇదే మోతాదులో పిచికారీ చేసుకోవాలి. ఆకుకూర తోటలపై అయితే ఆయా దశల్లో పురుగు తీవ్రతను బట్టి పావు లీటరు/ అర లీటరు/ లీటరు ద్రావణాన్ని 20 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుకూరల లేత మొక్కలను కొరికి తినే మిడతలను సైతం ఈ ద్రావణం నివారిస్తుందన్నారు. నారును ఈ ద్రావణంలో ముంచి నాట్లు వేసుకుంటే వైరస్ తెగుళ్లు దరిచేరవన్నారు. - మాచుపల్లె ప్రభాకరరెడ్డి, కడప అగ్రికల్చర్ -
ఐదడుగుల సొరకాయ
సొరకాయ మూమూలుగా ఒకటిన్నర అడుగు నుంచి రెండడుగుల పొడవు ఉంటుంది. మహా అంటే మూడడుగులు. కానీ వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం వెంకటగారిపల్లెకు చెందిన యువరైతు సామసాని వెంకటసుబ్బారెడ్డి తోటలో ఐదడుగుల సొరకాయలు కాశాయి. పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన అభ్యుదయ రైతు నరసింహారెడ్డి ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పంట ఉత్పత్తుల సందర్శనకు వెళ్లాడు. అక్కడ హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ రైతు ఇచ్చిన సొర విత్తనాలను తీసుకువచ్చి వెంకటసుబ్బారెడ్డికి ఇచ్చాడు. తన పొలంలోని మునగ చెట్టు వద్ద వెంకట సుబ్బారెడ్డి ఆ విత్తనం నాటి తీగలను చెట్టుకు అల్లించాడు. ప్రస్తుతం ఐదు అడుగుల పొడవున్న నాలుగు కాయలు ఆ తీగలకు వేలాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. - కడప అగ్రికల్చర్ -
రుణమాఫీ.. అంతా కిరికిరి
అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం.. ఇది ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వాగ్దానం. బాబు మాటను నమ్మి రైతులు ఓట్లేసి అధికారం కట్టబెట్టారు. ప్రమాణస్వీకారం చేసిన రోజే రైతు రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తారని ఎదురు చూసిన రైతులకు తీవ్ర నిరాశ మిగిలింది. రుణమాఫీ సాధ్యాసాధ్యాలపై కమిటీ పేరుతో కాలయాపన చేస్తుండటంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రుణమాఫీ కాక.. కొత్త రుణాలు దొరకక రైతులు మానసిక క్షోభకు గురవుతున్నారు. కడప అగ్రికల్చర్: ‘ఏరు దాటేంతవరకు ఓడమల్లన్న... ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న సామెత చందంగా తయారైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి. పంట రుణాలను మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రోజుకో మాట మాట్లాడటం తగదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పమాణం స్వీకారం చేసేటప్పుడే రుణమాఫీ పైలుపై సంతకం చేస్తానని చెప్పిన చంద్రబాబు ప్రమాణం స్వీకారం పూర్తికాగానే రుణమాఫీపై సాధ్యాసాధ్యాల అమలుకు కమిటీ వేయడం దేనికని రైతులు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ అంత సులువు కాదని ఒక మంత్రి, ఆరు నూరైనా రుణమాఫీ చేసి తీరుతామని మరోమంత్రి, అన్నీ ఆలోచించి సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకున్న తరువాతనే మాఫీ ఉంటుందని ఇంకో మంత్రి, లక్షల కోట్లు ఖర్చయినా వెనకడుగు వేయమని, ఆర్బీఐ ఒప్పుకోలేదని, బ్యాంకులు ఎప్పుడూ మాఫీ ఒప్పుకోవని, అది మామూలేనని, మహిళల పేరుతో పంటల కోసం బంగారు తాకట్టుపెట్టి తెచ్చిన బకాయి మాత్రమే మాఫీ చేస్తామని, పంట రుణం ఎంత ఉన్నా లక్ష రూపాయల వరకే మాఫీ అని ఇలా పలువురు మంత్రులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఖరీఫ్ ప్రారంభమైన నేపథ్యంలో కమిటీ రుణమాఫీపై 15 రోజుల్లో ప్రాథమిక నివేదికను అందజేస్తుందని,అనంతరం 30 రోజుల్లో తుది నివేదిక సమర్పిస్తుందని, అప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆ ప్రకటన ప్రకారం ఇప్పటికి 15 రోజులు గడచిపోయాయి. అయినా ప్రాథమిక నివేదిక ఏమీ లేదు. రేపటి నుంచి విత్తనకాయలు పంపిణీ... చేతిలో చిల్లి గవ్వలేదు : చేతిలో చిల్లిగవ్వలేదు. గురువారం నుంచి విత్తనకాయలను పంపిణీ చేస్తామని వ్యవసాయాధికారులు ప్రకటించారు.. ఏం పెట్టి విత్తనాలను కొనుగోలు చేయాలని రైతుల నుంచి ఉదయిస్తున్న ప్రశ్న. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటిస్తే మళ్లీ రుణాలు బ్యాంకుల నుంచి తెచ్చుకోవడానికి వీలుంటుందని, ఇప్పుడు బ్యాంకుల వద్దకు వెళితే పాత బకాయి చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలు ఎలా చేయాలో అర్థం కావడం లేదని చిన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘పెద్దకారు రైతులకు బయట అప్పులు పుడతాయని మాబోటి వారికి వడ్డీకి డబ్బులు ఎవరు ఇస్తారని’ పెండ్లిమర్రి మండలం మొళ్లకాల్వకు చెందిన చిన్నకారు రైతు వెంకటసుబ్బన్న తెలిపాడు. ‘నిరుడు ఎరువులకు, విత్తన కాయలకు చేసిన అప్పులే తీరలేదని మళ్లీ అప్పు ఇవ్వమని షావుకార్లను ఎలా అడిగేదని’ చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్యగారిపల్లెకు చెందిన మధ్యకారు రైతు నాగిపోగు గంగాధరరెడ్డి అన్నాడు. కాలయాపన చేస్తే బీమా కోల్పోతాం.. పంట రుణాలు తీసుకుంటేనే పంటల బీమా వర్తిస్తుంది. ఆగస్టు 30లోగా పంట రుణం తీసుకున్న రైతులు ప్రీమియం చెల్లించడానికి అవకాశం ఉం టుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 45 రోజుల తరువాత తాపీగా సూచనలు, సలహాలు చేసినా...వాటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రైతు లు బీమా అవకాశాలను కోల్పోతారు. రైతులు గత ఏడాది తీసుకున్న తేదీకి తిరిగి ఈ ఏడాది అదే నెలలో అదే తేదీన రుణం చెల్లించకపోతే, రద్దు కాకపోతే రైతు 11.75 శాతం వడ్డీ కట్టాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ని ఇబ్బందులున్నాయని తెలిసినా ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందో అర్థం కావడం లేదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.